
షడ్రసానుబంధాలు
తీపి - ముడి వేసిన జాంపండు
అది అక్క ఎంచుకున్న జాంకాయ. తల్లేమో కాపలా. తమ్ముడు ఊరుకుంటాడా... మధ్యాహ్నం స్కూల్ గ్యాప్‌లో దోటీ అందుకొని రాల్చడానికి ట్రై చేస్తాడు. ఒరే ఒరే.. అని అడ్డుపడాలి. అక్క ఆ కాయను నాలుగు రోజుల క్రితమే సెలెక్ట్ చేసుకొని, పండాక ఇది నాది అని ప్రకటించి, పాత గుడ్డ తెచ్చి దానికి చుట్టూ కట్టి ముడి వేసి చిలుక కన్ను సోకకుండా రక్షించుకుంటూ ఉంటే తమ్ముడి బెడద ఒకటి. ఉడతలాంటి వాడి ఊపు ఒకటి. మరికొన్ని జామకాయలు ఉన్నాయి. పక్కనే సపోటా చెట్టు ఉంది. పెరట్లో చెట్లు పెంచాలి గదా అని రెండు బొప్పాయి చెట్లు కూడా వేశారు. ఇన్ని ఉన్నా తమ్ముడికి ఆ జాంకాయే కావాలి. అక్క ఎంచుకున్న జాంకాయే కావాలి. తండ్రికి టెన్షన్. ఎవరికి వత్తాసు రావాలి? కూతురి కోరికను చూస్తే మురిపెం. కొడుకు అల్లరిని చూస్తే ముద్దు. ఒక్క జాంకాయ... ఆ ఇంటిని నాలుగు రోజుల పాటు ఎంతో తియ్యగా ఉంచుతుంది. చివరకు ఏమవుతుంది? అక్క దానిని తనే తీనేస్తుందా? ఏం తినదు. తెంచి, ఆ కాయ ఉన్న గుప్పిటను నీళ్ల తొట్టెలో అడుగు దాకా ముంచి అటూ ఇటూ ఆడించి కత్తి తెచ్చి సరిగ్గా నాలుగు ముక్కలు చేసి నలుగురికీ ఇస్తుంది. అబ్బ... అది ఎంత తీపి. ఆ రుచి ఎంత తియ్యన!
కారం - నానమ్మ రోటి పచ్చడి
చటాచటా నానమ్మ తమలపాకు తొడిమ తెంచుతుంది. తోక తెంచుతుంది. ఉబ్బుగా ఉన్న ఈనె తీసి అవతల పారేసి చూపుడు వేలితో కాసింత సున్నాన్ని బట్ట మీద అత్తరు రాసినట్టు రాస్తుంది. ఐదుకు ఎక్కువ కావు మూడుకు తక్కువ కావు... వక్క పలుకులు వేసి... చూపుడు వేళ్లతో బొటన వేళ్లతో చకచకా చిలక చుట్టి నోట్లో పెట్టుకుంటుంది. కాసేపటికి నోరంతా ఎర్రన. లిప్‌స్టిక్ రాసుకున్న కాలేజీ గర్ల్‌లాగా భలే గ్లామర్‌గా తయారైపోతుంది. ఆమెను కునుకుపోనిచ్చి వక్కాకు సంచి కాజేసి ఇమిటేట్ చేయడానికి ట్రై చేసి సున్నాన్ని అత్తరులాగాక ఇడ్లీకి చట్నీలా రాస్తే... నోరంతా పొక్కి... ఒకటే మంట... ఉస్.. ఉస్... కారం... అప్పుడు నానమ్మే లేచి హారి భడవా అని... ఇంకో ఆకు ఎక్కువ నమిలించి, మీగడ నాకించి, ఒక ఎండు కొబ్బరి ముక్క నోట్లో వేసి ఒళ్లో కూచోబెట్టుకొని కథ మొదలెడితే ఆ మధ్యాహ్నం పూట మనసంతా అరుణం. మమతంతా అరుణం. ఈ అనుభవం నానమ్మ రోటి పచ్చడి దగ్గర పనికొస్తుంది. టక్కున వేలు రాసి పచ్చడి తీసి నాలిక్కి రాసుకోవడానికి భయమేస్తుంది. నాన్న కూచోవాలి, అన్న కూచోవాలి, అమ్మ అన్నం వడ్డించాలి, నానమ్మ వచ్చి పిల్లర్‌లో నుంచి సరిగ్గా సిరా చుక్కలు పోసినట్టు ఎంత అవసరమో అంత నెయ్యి ఒలికించి వెళ్లాలి. తెల్ల తెల్లని అన్నంలో ఎర్రై పచ్చడి కలిపి ఆమె చూపిన మార్గంలో నాలుగు ముద్దల అడుగులు వేస్తే ఆ పూట ఇల్లంతా అరుణం. నిలువెల్లా అరుణం.
చేదు - అన్నయ్య పాత షర్టు
అన్నీ అన్నయ్యవే. ఒక రెడ్ షర్ట్ ఉంది. ఒక గ్రీన్ ఫుల్ హ్యాండ్స్ ఉంది. రెండూ అతని ఫేవరెట్స్. చిన్నప్పటి నుంచి ఆనవాయితీగా పై క్లాస్‌లోకి వాడు వెళ్లాక సెకండ్ హ్యాండ్ స్కీమ్ కింద తర్వాతి వాళ్లకు రావాలి. కాని అవి రెండు మాత్రం ఇవ్వడట. తనే ఉంచుకుంటాడట. వేసుకోవడానికి వీల్లేదట. అప్పటికే సీనియర్ ఇంటర్. ఎవరో గర్ల్‌ఫ్రెండ్‌కు ఆ రెండు షర్ట్స్‌లోనే పదే పదే కనిపించాడట. ఆ గర్ల్‌ఫ్రెండ్‌కు కూడా ఆ షర్ట్స్ అంటే ఇష్టమట. వాటిని నువ్వేసుకొని ఎలా తిరుగుతావ్ అని పాయింట్. కరెక్టే. కాని కొత్తవి లేవు కదా. నాన్నను అడగలేము కదా. మొన్నే ఇంటికి తప్పనిసరై రిపేర్లు చేయించాడు. పనిలో పనిగా పెరట్లో నాపరాళ్లు పరిపించాడు. అడగ్గా అడగ్గా అమ్మకు ఒక గంధం రంగు పట్టుచీర కొని ఇచ్చాడు. ఇప్పుడు టెన్త్‌కు వచ్చాం. కొత్త సైకిల్ లేదు. కొత్త షూస్ లేవు. కొత్త ప్యాంట్స్ లేవు. కనీసం పాత చొక్కాలు కూడా లేవా? చేదుగా అనిపిస్తుంది. నాన్న ఇదంతా గమనించినట్టే అనిపిస్తుంటుంది. అమ్మ ఏమీ తెలియనట్టే తిరుగుతుంటుంది. కాని ఒక రోజు రాత్రి డాబా మీద చల్లగాలికి ఆదమరుపుగా నిద్ర పడితే అమ్మ గబగబా ఊపుతూ నిద్ర లేపి ప్లాస్టిక్ కవర్‌లో నుంచి కొత్తచొక్కా తీసి చూపిస్తుంది. నిద్ర కళ్లకు పక్కన నాన్న నవ్వుతూ నిలబడ్డట్టుగా అనిపిస్తుంది. ఆ క్షణంలో ఆయన పిల్లల సంతోషం కోసం ఎంత చేదునైనా కంఠాన దాచుకునే గరళ కంఠుడిగా సాక్షాత్కరించినట్టు అనిపిస్తుంది.
వగరు - తిరునాళ్లలో బూర
ఎవరో ఫలానా బెంగుళూరు వెళ్లారట. మొన్నెవరో ఫలానా హైదరాబాద్‌కు వెళ్లి అక్కినేనితో ఫొటో దిగి ద్రాక్షతోటలు చూసి వచ్చారట. ఎవరో పట్నం వెళ్లి ‘ప్రతిఘటన’ చూసి వచ్చి చరణ్‌రాజ్ గురించి కథలు కథలుగా చెప్పారట. ఊళ్లోకి సెకండ్ రిలీజ్‌గా వచ్చిన ‘డిస్కో డాన్సర్’లో మిథున్‌ని చూడ్డానికి కూడా జేబులో డబ్బులు లేవట. నాన్నను అడిగితే అవన్నీ ఎందుకురా... హాయిగా పెరట్లో చెట్ల కింద ఆడుకోక. అన్నయ్య ఇది గమనించి ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని ఒకటీ అరా అన్నా చూడగలుగుతున్నాడు. అక్క రూపాయి అద్దెకు వచ్చే ‘మరణ మృదంగం’లాంటి నవలలు ఉంటే ఎక్కడికీ వెళ్లక్కర్లేదని అడ్జస్టైపోయింది. అమ్మకు పూజగది. నానమ్మకు కుక్కిమంచం. మరి మనకు. రేడియోలో జనరంజని. ప్రతి శుక్రవారం వీధి చివర శ్రీమంతుల ఇంట్లో వాళ్లు దయదలిస్తే టీవీలో చిత్రలహరి. ఒక్కోసారి రానివ్వరు. గేటు దగ్గర ఊగులాడుతున్నా పట్టించుకోరు. వగరుగా ఉంటుంది. గొంతుకు అడ్డం పడుతుంటుంది. అమ్మను బాగా ఏడిపించాలని ఉంటుంది. నాన్నతో దెబ్బలాడాలనిపిస్తుంది. కాని... ఒకరోజు వస్తుంది. ఆ రోజున ఊరి చివర దేవతకు తిరునాలు వస్తుంది. అప్పుడు మాత్రం నాన్న తప్పనిసరిగా అందరినీ తీసుకువెళతాడు. చేయి పట్టుకొని మరీ నడిపిస్తూ అట్ట స్కూటర్‌తో ఫొటో తీయిస్తాడు. ఫ్రీగా వేసే లవకుశ సినిమా చూపిస్తాడు. పంచదార చిలకలు భలే రుచిగా ఉంటాయి. ఇక బూర కొనివ్వడం వల్ల గొంతు నొప్పి పుట్టేంత వరకూ ఒకటే ఊదడం. ఊది ఊది ఇన్ని రోజుల వగరు గొంతు నుంచి మాయమైపోతుంది. తిరునాళ్ల నల్ల చెరుకు రుచి తియ్యగా అంగిటలోకి దిగుతుంది.
ఉప్పు - అందరూ బంధువులే
పక్కింటి వర్ధనమ్మ వస్తుంది. నందివర్ధనాలు పూజకని కోసుకెళుతుంది. ఎదురింటి శాంతా టీచర్ వస్తుంది. చీరకు ఫాల్ కుట్టించుకుని వెళుతుంది. వీధిలో వాళ్లు ఎలాగూ బంధువులే. కాని అసలు బంధువులు కూడా వస్తూనే ఉంటారు. అమ్మ తరఫున పిన్ని వస్తుంది. నాన్న తరఫున అత్తయ్య వస్తుంది. పెదమావయ్యలు చినమావయ్యలు పెద తాతలు బుజ్జి తాతలు... బంధువులొచ్చినప్పుడల్లా చాలా సంబరంగా ఉంటుంది. వారి మాటలతో పాటు స్టీలు లోటాలో పావు వంతు టీ మనక్కూడా దక్కుతుంది. పొయ్యి ఎంతకూ ఆరదు. వడ్డింపు ఎంతకూ తరగదు. ఎన్నో జ్ఞాపకాలు ఇంట్లో దూరిన పిచుకల్లా గిరికీలు కొడతాయి. గత చరిత్రలు ఆవిధంగానే తెలుస్తుంటాయి. మర్యాదకు లోటు రాకుండా అమ్మ అవస్థ పడుతుంటుంది. శెట్టిగారి అంగట్లో నాన్న అప్పు పద్దు పెరుగుతూ పోతుంది. ఉప్పు సరిగా ఉంటే రుచి. కాని అప్పుడప్పుడు గీత దాటి ఉప్పు కశమవుతున్నదని నానమ్మ చిరాకు పడుతూ ఉంటుంది. ఎఫెక్ట్స్ ఆశించినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ సహజం. ఒక ఇల్లు నడవడంలో ఈ మాత్రం ఉక్కిరిబిక్కిరి తప్పదేమో అనిపిస్తుంది.
పులుపు - బందరులో బి.ఇడి
అన్నయ్యకు బి.టెక్ చేయాలని ఉండేది. ర్యాంక్ కొంచెంలో తప్పింది. ప్రయివేట్ కాలేజీలో చదివించేంత డబ్బు నాన్న దగ్గర లేదు. డిగ్రీ చేసి బి.ఇడి చేయరా అనంటే అన్నయ్య మూడు రోజుల పాటు ఇంటికే రాలేదు. అమ్మ అన్నం ముట్టలేదు. పులుపు. చెల్లెలికి ఫలానా సంబంధం చేయాలని ఇంట్లో అందరికీ ఉండేది. తనొచ్చి ఈ అబ్బాయిని చేసుకుంటాను అని ఒకతన్ని చూపింది. ఊహించలేదు. ఊహించిన కుటుంబం నుంచీ కాదు. అవుననాలా కాదనాలా? పులుపు. కాని తన ఛాయిసే కరెక్ట్ అని తెలియడానికి రెండేళ్లు పట్టింది. అప్పటి దాకా నాన్నకు అనుదినమూ పులుపే. ఉన్న ఇల్లు అక్క పేరున రాద్దామనుకుంటే నాకెందుకు ఇవ్వవు అని తమ్ముడు తగాదాకు వస్తే పాపం... అక్క కదా.. పెళ్లయినా తను సరిగ్గా సెటిల్ కాలేకపోతోంది కదా అని చెప్పినా ఒప్పుకోక పోతే... పులుపు. ఆ తర్వాత వాడే ప్రయోజకుడై అక్క బాగోగులు చూడటం ఆ పులుపుకు చక్కెర అద్దడమే. రుచులు ఆరే. కాని అనుభూతులు పదహారు వేలు. ఇవన్నీ కలిస్తేనే జీవితం. వీటితో పాటే సాగేదే జీవితం. జీవితమా.. నిత్య ఉగాదిలా వెలుగుతూనే ఉండు.
- నెటిజన్ కిశోర్