ఆటే... ఆరోగ్యం
తెలవారుతుండగానే లేచి ట్రాక్‌ప్యాంటూ, టీషర్టూ వేసుకుని, గ్రౌండ్‌కి వెళ్ళి తదేక దీక్షగా టెన్నిసో, ఫుట్‌బాలో చెమట్లు కక్కుతూ ప్రాక్టీస్
చేసేస్తుంటారు. మన ఇంటి పక్కనో, స్కూల్లోనో, కాలేజీ మైదానాల్లోనో సందడి చేస్తుంటారు. నెలవారీ ఫీజులు కట్టుకుని మరీ ఇంత
వ్యయ ప్రయాసలు పడే వారిని ఏమందాం? స్పోర్ట్స్‌పర్సన్స్ అంటే... కాదు కాదు మేం ఫిట్‌నెస్ లవర్స్ అంటారు. ఆటల్ని ఆరోగ్యానికి
మార్గంగా మలుచుకోవడమెలాగో మనకి ఇలా చెప్తారు...
ఆరోగ్యంతో ఆటలాడకూడదు అనుకుంటే తప్పకుండా ఆటలు ఆడాల్సిందే. అర్థం కాలేదా... ఆటలకు మనం జీవితంలో ఇవ్వాల్సిన ప్రాధాన్యత చెప్పడమే ఈ వాక్యానికి అర్థం. క్రీడలు... వాటిని కెరీర్‌గా ఎంచుకున్న వారికి మాత్రమే పరిమితమని, ఇతరులకు అవసరం లేదని అనుకోవడం తప్పు. ఆరోగ్యం కోరుకునే వారంతా ఆటలు ఆడాలి. ‘ఇంత వయసు వచ్చింది ఇంకా ఏంట్రా చిన్నపిల్లాడిలా ఆ ఆటలు?’ అనడం చాలాసార్లు వినే ఉంటాం. ఇక నుంచి వినవద్దు. అంటే అలాంటి మాటలకు దూరంగా పారిపోమని కాదు. అలాంటి వారి చేత కూడా ఆటలాడించమని. స్పోర్ట్స్ పర్సన్ కాకపోయినా స్పోర్టివ్‌గా జీవించాలంటే మాత్రం ఆటలు ఆడాల్సిందే. ఆట అలవాటుగా మారాల్సిందే.
ఆటలెందుకు?
దేహానికి వ్యాయామాన్ని ఇవ్వడానికి స్పోర్ట్స్ ఓ చక్కని మార్గం. ఇష్టమైన ఏదో ఒక ఆటను దినచర్యలో భాగంగా మార్చుకోవడం వల్ల కేవలం ఫిజికల్‌గా మాత్రమే కాకుండా మానసికంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయని నిరూపితమైంది. ఆటల వల్ల మన సామర్థ్యం మెరుగుపడుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్ళను, గెలుపోటములను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూడా క్రీడలు తోడ్పడతాయి. రోజువారీ వ్యవహారాల్లో మనల్ని చురుకుగా మారుస్తాయి. ముఖ్యంగా జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లంటే బద్దకించే వారికి మంచి ప్రత్యామ్నాయం. ఏదైనా ఆట ఆడడం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే దానిపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి డుమ్మాలు కొట్టం. అలాగే రోజూ జిమ్ బోర్ కొట్టిందనుకునే వారు కూడా మార్పుకోసం ఆటల్ని ఆశ్రయించవచ్చు. ఆట అంటే ఎన్నో రకాల వ్యాయామాల సమ్మిళితం. ఒకే సమయంలో వాకింగ్, రన్నింగ్, స్ట్రెచ్చింగ్, వెయిట్ లిఫ్టింగ్... ఇలా భిన్నరకాల వ్యాయామ ప్రక్రియలు ఇందులో ఉంటాయి. తద్వారా ఎన్నోరకాల వ్యాయామ లాభాలు పొందడానికి ఆటలు అవకాశానిస్తాయి. వినోదం సరేసరి.
ఏయే ఆటలు ఎంపిక చేసుకోవాలి?
మనకు ఇష్టమైన ఏ ఆట అయినా ఓకె. ప్రత్యేకించి స్పోర్ట్స్ మీద ఇష్టాయిష్టాలు లేనివారైతే తమకు నప్పేది, వైద్యుల, వ్యాయామ శిక్షకుల సలహా మేరకు ఎంచుకోవాలి. అది తప్పనిసరిగా అంతో ఇంతో శారీరక శ్రమ కల్గించేదే అయి ఉండాలి. ఆరోగ్యం కోసం, దేహానికి వ్యాయామం కోసం ఆటలు ఎంచుకుంటున్నపుడు వీలైనన్ని ఎక్కువ బాడీపార్ట్స్‌కి వర్కవుట్‌గా మారేదైతే బెటర్. ఎక్సర్‌సైజ్‌కు ఎలా సిద్ధమవుతామో, ఆటలకు అలాగే సిద్ధం కావాలి. కొన్ని ఎంచుకోదగిన ఆటల్లో... టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్, స్కిప్పింగ్, సాకర్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, రగ్బీ, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్స్ వంటివి ఉన్నాయి. వీటిలో మనకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఆట అంటే ఎవరో ఒకరితో కలిసి ఆడితేనే మజా. అయితే గ్రూప్‌తో సంబంధం లేకుండా ఒక్కరే ఆడగలిగే ఆటలు కూడా ఉన్నాయి. ఇతరుల కంపెనీ అందు బాటులో లేనప్పుడు వాటితో సరిపెట్టుకోవడం బెటర్.
ఆటకు ముందు...
► ఆరోగ్య జీవనం కోసం ఆటల్ని అలవాటు చేసుకోవాలనుకునే వారు ముందస్తుగా వైద్యులను, వ్యాయామ నిపుణులను సంప్రదించాలి.
►తప్పనిసరిగా వార్మప్, కూల్‌డవున్ ప్రక్రియల్ని భాగం చేయాలి.
►ఆటలో పడి టైమ్‌ని మర్చిపోవడం, సామర్థ్యానికి మించి శ్రమ పడడం ప్రమాదకరం.
►కాలక్షేపానికి ఆడినప్పటికీ విశాలమైన ప్రదేశంలోనో, గ్రౌండ్‌లోనో ఆడితేనే పూర్తి ఫలితాలు లభిస్తాయి.
►ఆడుతున్నపుడు తరచుగా అది తమ ఫిట్‌నెస్ రొటీన్‌లో భాగమని గుర్తు చేసుకుంటూ ఉంటే దేహంలో కలుగుతున్న మార్పులను సరిగా అవగాహన చేసుకోగలుగుతాం.
కొన్ని ఆటల ప్రయోజనాలు...
►బ్యాడ్మింటన్
►పెద్దగా శిక్షణ లేకుండానే ఆడగలిగినది. గంటసేపు ఆడితే దాదాపు 300 కేలరీలను ఖర్చుచేస్తుంది.
బాస్కెట్ బాల్
► దేహంలో అత్యధిక భాగాలకు వ్యాయామం అందించేది. 20 నిమిషాల సెషన్‌లో 150 నుంచి 250 కేలరీల దాకా ఖర్చవుతాయి.
వాటర్ పోలో
►తక్కువ మందికి అందుబాటులో ఉండే ఆట. ప్రతి 7 నిమిషాల సెషన్‌కు 60 నుంచి 80 దాకా కేలరీలను ఖర్చు చేయవచ్చు.
సాకర్
► సాకర్‌లో... పరుగులు తీయడం, ట్విస్టింగ్, కిక్కింగ్, డార్టింగ్... చేయాలి. తద్వారా 45నిమిషాలు ఆడితే దాదాపు 450–550 కేలరీలు ఖర్చవుతాయి.
రగ్బీ
► దీనిలో రెజ్లింగ్, రన్నింగ్ కూడా కలిసి ఉన్నాయి. మజిల్ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపకరిస్తుంది. ఇక కేలరీల ఖర్చు 40 నిమిషాల సేపు ఆడితే దాదాపు 400–600ల వరకూ ఉంటుంది.
►వయసేదైనా సరే వ్యాయామం అందుకోవాలంటే ఆటలాడడమే దారి. ఫిట్‌నెస్ నిపుణులు అంటున్న మాట ఇది. ఇంకేం... క్రికెట్ కిట్టో, టెన్నిస్ రాకెట్టో చేత పట్టండి. సచిన్‌నూ, సానియానూ తలచుకుంటూ ఆరోగ్యసాధనలో సెంచరీలు, రికార్డులు బద్దలు కొట్టండి. ఒన్... టూ...త్రీ... స్టార్ట్...
– యస్. సత్యబాబు,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి