కరోనావారి పెళ్లి పిలుపు | Spread of Coronavirus does not stopped but marriages are happening | Sakshi
Sakshi News home page

కరోనావారి పెళ్లి పిలుపు

Published Mon, Feb 10 2020 5:02 AM | Last Updated on Mon, Feb 10 2020 5:07 AM

Spread of Coronavirus does not stopped but marriages are happening - Sakshi

దక్షిణ కొరియా చర్చిలో సామూహిక వివాహాలు

కల్యాణం వచ్చినా, అదేదో ‘సమ్‌థింగ్‌..’ అదొచ్చినా ఆగదని అంటారు. కరోనా వైరస్‌ ఎంతగా వ్యాపిస్తున్నా ఎక్కడా పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. ‘వస్తే రానివ్వండి.. మా దగ్గర మాస్క్‌ లేకపోతే కదా..’ అని వధూవరులు రెడీ అయిపోతున్నారు. ‘పెళ్లంటే కరోనా భయపడాలి కానీ, కరోనా అంటే పెళ్లికేం భయం’ అని అనుభవజ్ఞులైన దంపతులు.. పెళ్లీడు పిల్లల్ని సపోర్ట్‌ చేస్తున్నారు. కరోనా న్యూస్‌లోకి వచ్చాక.. కరోనాతో పాటు న్యూస్‌లోకి వచ్చిన కొన్ని పెళ్లిళ్లివి. ఇవి.. చూసే పెళ్లిళ్లు కావు, చదివే పెళిళ్లు. కాబట్టి మీరు మూతికి మాస్క్‌ వేసుకోకుండానే  ముసిముసిగా చదువుకోవచ్చు.

వెనకే వస్తాం మీరెళ్లండి
అమ్మాయిది చైనా. అబ్బాయిది ఇండియా. ఇండో–చైనా సంబంధాలు బాగోలేవని, పెళ్లి సంబంధాలు కుదరకుండా ఉంటాయా! దేని దారి దానిదే. బుధవారం పశ్చిమ బెంగాల్‌లో మనబ్బాయికీ, మనబ్బాయిని ఇష్టపడి మన కోడలిగా రాబోతున్న చైనా అమ్మాయికి పెళ్లి జరిగింది. పెళ్లికి అమ్మాయి అమ్మానాన్న రాలేకపోయారు. అదేంటి.. అందరూ కలిసే కదా ముందొచ్చేస్తారు! అలా ఎలా జరిగింది? ‘‘ముందు అమ్మాయిని తీసుకెళ్లు బాబూ.. వెనకే మేం వచ్చేస్తాం’ అన్నారు అమ్మాయి పేరెంట్స్‌. సరేనని తీసుకొచ్చాడు. వీళ్లిలా ఇండియా రాగానే, కరోనా అలా చైనాను విజిట్‌ చేసింది. ఇండియా వచ్చే ఫ్లయిట్స్‌ అన్నీ రద్దయ్యాయి. ఫ్లయిట్‌లు రద్దయ్యాయని పెళ్లి రద్దవుతుందా! తన మానాన తను జరిగిపోయింది. పెళ్లి ఫోటోలు చైనా వెళ్లిపోయాయి. ‘‘మీరేమీ బాధపడకండి మమ్మీ..  మేమే చైనా వస్తాం.. అక్కడే గ్రాండ్‌గా ఫంక్షన్‌ కూడా చేసుకుందాం’’ అని పెళ్లి కూతురు కాల్‌ చేసి చెప్పేసింది. ‘‘వద్దొద్దు.. మేం చెప్పే వరకు రాకండి’’ అని కన్న హృదయాలు పెళ్లి ఫొటోలు ఉన్న సెల్‌ఫోన్‌లను గుండెలకు హత్తుకున్నాయి. ఆ హత్తుకున్న ఫొటోలు ఇటువైపు బట్వాడా అవగానే మళ్లీ ఇక్కడ పెళ్లి సందడి.

మాస్కులు తియ్యకండర్రా
 కుర్రాడు విన్లేదు. ‘‘ఆ దేవుడే కాపాడతాడు’’ అన్నాడు.  
పెళ్లికి అందరూ వచ్చేశారు. పెళ్లికొడుకు తరఫువారెవరో, పెళ్లికూతురు తరఫువారెవరో తెలియడం లేదు! అందరి ముఖాలకూ కరోనా మాస్క్‌లు ఉన్నాయి. పెళ్లికొడుకులెవరో, పెళ్లికూతుళ్లెవరో కూడా తెలియడం లేదు. సామూహిక పెళ్లిళ్లవి. అతిథులు, ఆహ్వానితులు ఓ 30 వేల మంది వరకు ఉన్నారు. వధూవరులు.. మార్చుకోవలసిన పెళ్లి ఉంగరాలు మర్చిపోయినా పర్వాలేదు. మాస్క్‌లు మాత్రం తీసేయొద్దు అని పెళ్లి జరిపించే పెద్దలు మాటాకోసారి హెచ్చరిస్తున్నారు. మాస్క్‌ లేకుండా చర్చిలో కనిపించిన 21 ఏళ్ల ఓ యూనివర్శిటీ విద్యార్థిని పట్టుకున్నారు. ‘‘నేను కట్టుకోను’’ అన్నాడు. ‘‘ఆఖరి నిముషంలో నువ్వు వధువును కట్టుకోనన్నా నష్టం లేదు. ఆఖరి నిముషాలు రాకుండా ఉండటం కోసం నీ మూతికి మాస్క్‌ కట్టుకోవడం తప్పనిసరి’’ అని హితవు చెప్పారు. ‘‘నేను పెళ్లి కొడుకును కాదు. పెళ్లికొచ్చినవాడిని’’ అన్నాడు కుర్రాడు. అయినా మూతికి మాస్క్‌ వేసుకోవలసిందే’’ అన్నా. కుర్రాడు విన్లేదు. ‘‘ఆ దేవుడే కాపాడతాడు’’ అన్నాడు. దక్షిణ కొరియా అది. పక్కనే చైనా ఉంది. చైనాలో కరోనా ఉంది. దేవుడు ఆ దగ్గర్లో లేడు. అయినా దేవుడు కాపాడతాడు అంటున్నాడంటే.. అతడి నమ్మకం కరోనా కంటే బలమైనది అనుకోవాలి. దక్షిణ కోరియా గపియోంగ్‌లో శుక్రవారం ఈ మూకుమ్మడి మాస్క్‌ల.. అయ్యో సారీ.. ఈ మూకుమ్మడి పెళ్లిళ్ల తంతు జరిగింది. పెళ్లంటే కరోనా భయపడాలి కానీ, కరోనా అంటే పెళ్లెందుకు భయపడుతుంది.. అని ఓ గుంపులో ఓ వృద్ధుడు తత్వాలు పాడుకుంటూ కనిపించడం కూడా అక్కడివారికి వినిపించింది. ఇప్పటికే పాతిక వరకూ కరోనా కేసులు పిలవని పెళ్లికి వచ్చిన వారిలా దక్షిణ కొరియాలో చొరబడ్డాయి.

సారీ.. మీరెవరో తెలీదు
ఈ మధ్యే.. కొత్త సంవత్సర వేడుకల కోసం సింగపూర్‌ నుంచి చైనా ట్రిప్‌కి వెళ్లొచ్చారు అతడు, ఆమె. జోసెఫ్‌ య్యీ, కాంగ్‌ టింగ్‌.. వాళ్ల పేర్లు. వీటిల్లో అమ్మాయి పేరేదో, అబ్బాయి పేరేదో గుర్తుపెట్టుకోవడం కష్టం కనుక అమ్మాయి, అబ్బాయి అని చెప్పుకోవడమే సుఖంగా ఉంటుంది. మన సుఖం మాట అలా వదిలేస్తే.. వాళ్లిద్దరికీ ఒక కష్టం వచ్చింది. ఇటీవలే.. చైనా నుంచి తిరిగొచ్చాక.. వాళ్ల పెళ్లయింది. పెళ్లి కాదు వాళ్లకొచ్చిన కష్టం. పెళ్లి రిస్పెషన్‌కి ఎవరూ రాకపోవడం! ‘వియ్‌ సాలిసిట్‌ యువర్‌ ప్రజెన్స్‌..’ అనగానే ‘సారీ.. మీరెవరో మాకు తెలీదు’ అని టక్కున ఫోన్‌ పెట్టేస్తున్నారు! కరోనా వైరస్‌ బంధుమిత్ర సమేతంగా తమ సంతోషాన్ని దెబ్బకొట్టేసిందని ఈ కపుల్‌కి అర్థమైంది. వెంటనే మళ్లీ అందరికి ఫోన్‌లు చేశారు. ‘‘మా పెళ్లి రిసెప్షన్‌కి మేము రాము. దూరంగా ఎక్కడో ఉండి స్క్రీన్‌లో మీకు కనిపిస్తుంటాం. మీరు మా పెళ్లి విందు భోజనాలు ఆరగిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు’’ అని రిక్వెస్ట్‌ చేశారు. ‘‘దానికేముంది బాబూ.. దానికేముందమ్మా.. పెళ్లన్నాక రిసెప్షన్‌ జరక్కుండా ఉంటుందా.. మేము రాకుండా పోతామా..’’ అని అంతా అడ్వాన్స్‌గా ఆశీస్సులు అందించి, వెంటనే రిసెప్షన్‌కి దిగిపోయారు. 

ఫోనొస్తే పక్కకెళ్లాడు 
పదే నిముషాల్లో పెళ్లయిపోయింది. డాక్టరుబాబు పెళ్లి కూతుర్ని వదిలిపెట్టి కరోనా డ్యూటీకి వెళ్లిపోయాడు.
అబ్బాయిది చైనా. అమ్మాయిదీ చైనా. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకే దేశం కాబట్టి పెద్దలూ పోనీలే అనుకున్నారు. అబ్బాయి మెడలో స్టెతస్కోప్‌ ఉంటుంది కానీ.. చూడ్డానికి కత్తిలా ఉంటాడు. అమ్మాయి సంగతి చెప్పక్కర్లేదు. చక్కదనాల చురకత్తి. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ‘‘మేమూ మీకు పెళ్లి చేయాలనుకున్నాం’’ అన్నారు పెద్దలు. పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. ముహూర్తం టైమ్‌కి వధూవరుల కన్నా ముందు, వధూవరుల అమ్మానాన్నల కన్నా ముందు కరోనా వైరస్‌ వచ్చి పెళ్లి మండపంలో కూర్చుంది. కూర్చొని, ‘‘భజంత్రీలు వాయించండి.. పురోహితులూ మీరు మంత్రాలు చదవండి..’’ అంది. అక్కడ పురోహితుడు లేడు. హితులూ లేరు. పెళ్లి కొడుకు కూడా కనిపించలేదు! ‘‘ఫోనొస్తే పక్కకెళ్లారు నాన్నా ఆయన’’ అంది పెళ్లికూతురు. పక్కకెళ్లిన పెళ్లికొడుకు పెళ్లికూతురు పక్కకొచ్చి ఇక కానివ్వండి అన్నాడు. పదే పది నిముషాల్లో అయిపోవాలి అని కూడా చెప్పాడు. అలాగే కానిచ్చేశారు. పెళ్లయిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని వదిలిపెట్టి డ్యూటీకి వెళ్లిపోయాడు. హాస్పిటల్‌కి కరోనా కేసులేవో వచ్చాయని అర్జెంట్‌ కాలొస్తే.. పెళ్లికి అతడు పెట్టిన తొందర అది! కుర్రాడంటే ఇలా ఉండాలి అన్నారు పెళ్లికొచ్చినవాళ్లు. మా ఆయన గ్రేట్‌ అన్నట్లు పెళ్లి కూతురు సిగ్గుల మొగ్గయింది.. మాస్క్‌ తియ్యకుండానే. కరోనా భయం ఉన్నా కూడా ఆ పెళ్లికి నలుగురైనా వచ్చారంటే.. పెళ్లి కొడుక్కన్నా గ్రేట్‌ అనాలి వాళ్లను. ఆ నలుగురూ.. అమ్మాయి అమ్మానాన్న. అబ్బాయి అమ్మానాన్న. 

గుండె ధైర్యం గల పిల్లాడే!
చైనా అబ్బాయిలకు ఇండియా అమ్మాయిలు దొరకట్లేదేమో.. ఎక్కడ చూసినా ఇండియా అబ్బాయి–చైనా అమ్మాయిల కాంబినేషన్‌ పెళ్లిళ్లే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ వచ్చాక.. ఇండియాలో మొదట జరిగిన ఇండో–చైనా పెళ్లి బహుశా ఈ ఇద్దరిదే కావచ్చు. ఫిబ్రవరి 2న మధ్యప్రదేశ్‌లోని మండ్సార్‌లో జరిగిన ఈ పెళ్లిలో.. అందరూ అబ్బాయి గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కొందరైతే ‘హవ్వ’ అని బుగ్గలు నొక్కుకుంటూ.. పెళ్లి కూతుర్ని తెచ్చుకున్నాడా, కరోనాను తెచ్చుకున్నాడా అని గుసగుసలాడుకున్నారు. మొత్తానికి పెళ్లి కన్నుల పండుగగా జరిగిపోయింది. అయితే ఆ పెళ్లిలో వధువు తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల మీద స్థానిక వైద్యాధికారుల కన్ను పడింది. వాళ్లలా చూడగానే, ‘‘అబ్బే మాకు అలాంటిదేమీ లేదు’’ అన్నారు వీళ్లు. డాక్టర్లు ఊరుకుంటేనా! పెళ్లన్నాక ఫార్మాలిటీలు లేకుండా ఉంటాయా, కరోనా అన్నాక వైద్య పరీక్షలు లేకుండా పోతాయా.. మీకు కరోనా ఉండదని మాకు మాత్రం తెలీదా..’’ అని వాళ్లను ల్యాబులకు లాక్కెళ్లారు. ‘‘ఏంటండీ ఇది!’’ అని అమ్మాయి కోపంగా చూసింది. ‘‘మనకెందుకు పోనిద్దూ’’ అన్నట్లు అబ్బాయి నవ్వుతూ చూశాడు. ‘మన’అనే ఆ మాట ఒక్కటి చాలదా.. భార్యాభర్తలు తమ దాంపత్య జీవితంలోని కరోనాల్లాంటి కష్ట కాలాలను ఎన్నిటినైనా దాటేయడానికి! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement