సవతి తల్లికీ మనోవర్తి చెల్లించవలసిందే!
కేస్ స్టడీ
భారతమ్మకు 60 సంవత్సరాలు. భర్త చనిపోయి మూడేళ్లయింది. చనిపోయేముందు ఆస్తిపంపకాలు చేసి, భార్య బాధ్యతను కొడుకులకు అప్పగించి వెళ్లాడామె భర్త. కొడుకులు భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన ప్రగాఢ నమ్మకం. అందుకే ఆమెకు చిల్లుగవ్వ కూడా ఇవ్వలేదు. దినవారాలు అయిన తర్వాత ముగ్గురు కొడుకులూ మూటాముల్లే సర్దుకుని ఎవరి ఊర్లకు వాళ్లు వెళ్లిపోయారు.
పనిలో పనిగా వారికి తండ్రి రాసిచ్చిన పొలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు తల్లి కోర్టుకు వెళుతుందనే భయంతో. ఇంటిగలాయన రెండు నెలలు చూసీ చూడనట్లుండి, అద్దె బకాయి పడగానే, ఇల్లు ఖాళీ చేయమని గొడవ ప్రారంభించాడు. పాపం భారతమ్మ పరిస్థితి ఘోరమైంది. కొడుకులపై మెయిన్‌టెనెన్స్ కేసు వేయమని ఎవరో సలహా ఇచ్చారు. అది కొడుకుల చెవిన పడింది. అసలు భారతమ్మ తమ కన్నతల్లి కాదని, సవతి తల్లి అనీ అందుకని ఆమెకు ఆ ఆస్తిలో భాగం రాదని ఆమెను హెచ్చరించారు.
కళ్లనీళ్ల పర్యంతమైంది భారతమ్మ. నిజమే, తాను వారి సవతి తల్లి. కానీ, వారి తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ల నాన్న రెండోపెళ్లి చేసుకున్నాడు తనను. అప్పటినుంచి వాళ్లే తమ బిడ్డలని కళ్లల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసింది. తనకు పిల్లలు వద్దని కూడా నిర్ణయించుకుంది. మరి స్వార్థపరుడైన భర్తవల్ల, ఆమె అమాయకత్వం వల్ల ఈనాడు ఆమెకు ఈ గతి పట్టింది. అసలు చట్టం ఏమి చెబుతుందో అని ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన న్యాయవాదిని అడిగింది. ఆమె చెప్పిన విషయాలేమిటంటే... సవతి తల్లి కూడా సెక్షన్ 125 సిఆర్‌పీసీని అనుసరించి మనోవర్తి పొందవచ్చు.
తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న స్త్రీలకు పిల్లలకు, తలిదండ్రులకు న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో ఈ నిబంధన ఏర్పరచడం జరిగింది. దీనిప్రకారం సవతి తల్లి కూడా అనాథగా మారకుండా చూడవలసిన బాధ్యత కొడుకుపై ఉంటుంది. అయితే సవతి తల్లి సవతి కొడుకు నుండి మనోవర్తి కోరేటప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. ఆమెకు వీరుగాక ఇతరత్రా ఎటువంటి సంతానం ఉండకూడదు. ఆమె విధవరాలు అయి ఉండాలి. భర్త జీవించి ఉంటే, అతడు పోషించలేని పరిస్థితుల్లో ఉండాలి.
భారతమ్మకు ముగ్గురూ సవతి కొడుకులే. ముగ్గురినీ మనోవర్తి కేసులో పార్టీలుగా చేయవచ్చని తెలుసుకుని కేసు వేయడానికి సహాయపడమని ఆ న్యాయవాదిని వేడుకుంది భారతమ్మ. తప్పకుండా కేసు వేస్తామని, ఆమెను ఆదుకుంటామరని మాటిచ్చారు వాళ్లు.