
సహనమే సాఫల్య సోపానం
సహనం ఓ సుగుణం, అది జీవిత సౌశీల్యం, సహనం జీవిత ప్రధాన అవసరం.
సహనం ఓ సుగుణం, అది జీవిత సౌశీల్యం, సహనం జీవిత ప్రధాన అవసరం. సహనమును కోల్పోయే పరిస్థితులు, ఆస్కారములు మన జీవితంలో అడుగడుగునా తారసపడుతుంటాయి. సహనం కోల్పోతే, మనకు కలిగే నష్టాలు, అనర్థాలు మనం ఈ జీవితంలో కోలుకోలేని, పూడ్చుకోలేని పరిణామాలకు దారితీస్తాయి. సహనం ఆరోగ్యవంతమైన మానసిక సమతుల్యతా స్థితికి నిదర్శనం. సహనం పరిస్థితులను జయించి తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. సహనమన్నది జీవిత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి బలమైన సూత్ర సాధనం. సహనం కోల్పోతే ఏ రంగంలోని వారమైనా జీవిత లక్ష్యాన్ని, ఆశయాన్ని సాధింపజాలరు.
సహనం ఓ అభ్యాసం, ఈ జీవిత పరిస్థితులు మనకు నేర్పే పాఠం. జీవితంలో కొన్ని అధిక్యతలు, అర్హతలు సాధించటానికి ఓ సోపానం. సహనాన్ని దైవసన్నిధిలో, దైవధ్యానంలో మనం అలవర్చుకొంటాము, అకళింపజేసుకుంటాము. అయితే సహనానికి మారు పేరు భూ దేవి. మన భక్తికి, మనం చేసే పూజలకు, మనం చేసే కృషికి, ప్రయత్నానికి సత్ ఫలితాన్ని ఎదురుచూడటానికి కూడా సహనం అవసరం.
సహనం ఓ అశక్తత కాదు, బలహీనత కాదు, చేవలేని తనం అసలే కాదు. కాదు. సోమరితనం అంతకన్నా కాదు, జీవిత బలం. అసహనం మన జీవితాలను, కుటుంబాలను, మన విలువల్ని, మనం సంపాదించుకున్న గౌరవ ప్రతిష్టలను, అప్రతిష్టపాలు చేస్తుంది. మన కుటుంబ సంబంధాలు, వైవాహిక సంబంధాలు, స్నేహసంబంధాలు, రక్త సంబంధాలు తదితర మానవ సంబంధాలన్ని ఆరోగ్యకరంగా, బలంగా ఉండాలంటే సహనమే ప్రధానం.
సహనంతోనే సంసార జీవితం ఒడుదుడుకుల మధ్య సైతం సాఫీగా సాగుతుంది. సహనం లేని చోట ప్రేమ పగగా మారుతుంది. సహనంతో సాధించలేనిది ఏది లేదు. ఒక్కమాట! ఈ జీవితంలోని విజయానికే కాదు, ఈ జీవితానంతరపు నిత్య జీవిత సాధన వరకు సహనమే సోపానం.