రోజూ ఒంగోలులో ఒక సన్నివేశం తప్పనిసరి. బస్‌స్టాండు సమీపంలోని అరవై అడుగుల రోడ్డు దగ్గర జనం కి టకిటలాడుతూ కనిపిస్తారు. వారి చేతుల్లో పచ్చని ఆకులు ఉంటాయి. వాటిలో తెల్లటి చందమామలు ఉంటాయి. నోటిలో వేసుకోగానే కరిగిపోయే ఈ చందమామల కోసం ఒక్కరోజు కూడా నాగా ఇవ్వకుండా అక్కడకు నిత్యం జనం వస్తూనే ఉంటారు. అది మస్తాన్ ఇడ్లీ మహిమ. అక్కడ ఉన్నది మస్తాన్ ఇడ్లీ షాపు.
సుమారు 30 సంవత్సరాల క్రితం మస్తాన్ అనే వ్యక్తి ప్రారంభించిన ఈ ఇడ్లీషాపు నేటికీ సూపర్‌హిట్‌గా నడుస్తోంది. ఎంత హిట్ అంటే ఎంసిఏ చదువుకుని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాల్సిన మస్తాన్ కుమారుడు మీరావలి ఆ ఉద్యోగం మానేసి, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకునేంత. తండ్రి తర్వాత ఆ షాప్ పరంపరను కొనసాగిస్తున్న మీరావలి... ‘మస్తాన్ ఇడ్లీషాపు’ ప్రయాణాన్ని సాక్షితో ఇలా పంచుకున్నారు...
‘‘మా నాన్నగారు మస్తాన్ పెద్దగా చదువుకోలేదు. కొంత కాలం టైలరింగ్ చే శారు. ఆ తరవాత ఐస్ ఫ్యాక్టరీలో పనిచేశారు. అక్కడా లాభం లేకపోయింది. ఆ తరవాత చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. ఎన్ని చేసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. కుటుంబ పోషణ కోసం కొంతకాలం బంధువుల హోటల్‌లో పనిచేశారు. కాని ఎంత కాలం పనిచేసినా సరిపడేన్ని డబ్బులు వచ్చేవి కాదు. ఎలాగూ అనుభవం వచ్చింది కనుక సొంతగా హోటల్ మొదలెట్టాలని అనుకున్నారు.
1980లో ఈ ఊళ్లో కర్నూలు రోడ్డులోని భారతి నర్సింగ్ హోమ్‌కి ఎదురుగా ఒక చిన్న పూరి గుడిసెను హోటల్‌గా చేసుకుని అక్కడే వ్యాపారానికి విత్తనం నాటారు. ఆ పూరి గుడిసెలోనే ఇడ్లీ, ప్లెయిన్ దోసె, స్పెషల్ కాఫీ తయారు చేసి సప్లయి చేయడం మొదలుపెట్టారు. సుమారు మూడు çసంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈ హోటల్‌ను కేవలం 1000 రూపాయలతో ప్రారంభించారు.
నేతిలా పేరుకుపోయింది
1988లో మా హోటల్ దశ తిరిగింది. ఇప్పుడున్న చోటుకు మస్తాన్ ఇడ్లీసెంటరును మార్చారు. చాలాకాలం హోటల్‌కి నేమ్‌బోర్డు కూడా లేదు. కాని అందరి నోళ్లలో మస్తాన్ పేరు, పేరుకున్న నేతిలా పేరుకుపోయింది.
ఇవీ ప్రత్యేకతలు...
నేతి ఇడ్లీ, నేతి దోసె మా ప్రత్యేకత. వెన్నపూసను స్వయంగా కరిగించి నెయ్యి తయారుచేయించి, ఆ నేతితోనే వంటకాలు తయారు చేస్తాము. జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు, మిరపకారం... వీటిని దోసె మీద వేసి తయారుచేస్తాము. ఈ ఆలోచన నాన్నగారి సొంతం. ఈ రుచికే వినియోగదారులు సాహో అనేశారు. 2002లో మేము బిర్యానీ పాయింట్ ప్రారంభించాము. కాని ఎక్కువ కాలం నడవలేదు. అచ్చి వచ్చిన ఇడ్లీయే మాకు అన్నం పెడుతోంది.
ఇద్దరం సంతానం...
నాన్నగారికి ఒక అబ్బాయి (నేను), ఒక అమ్మాయి. అమ్మాయి దివ్యాంగురాలు. హోటల్‌కి సంబంధించిన పనంతా నాన్న, అమ్మ, నేను చేసేవాళ్లం. 2003లో నాన్నగారు కాలం చేశారు. అప్పటి నుంచి అమ్మకి విశ్రాంతి ఇచ్చాను. పనివారిని నియోగించుకుని హోటల్ నడుపుతున్నాను. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటే లక్షల్లో ఒకడిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు మాత్రం మస్తాన్ ఇడ్లీ సెంటర్ ఓనర్‌ని. ఆ తృప్తి చాలు.
ఇవీ మస్తాన్ ఇడ్లీ వేళలు...
ఉదయం 8 – 11, సాయంత్రం 6 – 9.30 వరకు మస్తాన్ హోటల్ కిటకిటలాడు తుంటుంది. చుట్టుపక్కల వారంతా మస్తాన్ ఇడ్లీ షాపు దగ్గరే కనిపిస్తారు. దీనినొక మీటింగ్ పాయింట్‌గా చూస్తారు. స్వయంగా వచ్చి ఇడ్లీ రుచి చూడలేని రాజకీయ నాయకులు, పార్సిల్స్ తెప్పించుకుని తిని ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఇక్కడ కేవలం ఇడ్లీ, దోసె మాత్రమే దొరుకుతాయి. అన్నీ ఇంట్లోనే తయారుచేస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన మినప్పప్పు, బియ్యం ఉపయోగిస్తారు. క్వాలిటీ విషయంలో రాజీపడరు. నెలకోసారి వేటపాలెం వెళ్లి బస్తాడు జీడిపప్పులు హోటల్ కోసం తెచ్చుకుంటారు.
– డా. వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment