
పరిపాలన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది మంది మహిళా అధికారులకు కలెక్టర్‌లుగా బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద స్థాయిలో మహిళా కలెక్టర్లను నియమించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ వంటి మెట్రో పాలిటన్ నగరానికి యువ ఐఏఎస్ అధికారి శ్వేతా మహంతిని, కొత్తగా ఏర్పడిన పెద్దపల్లికి మరో యువ అధికారి సిక్తా పట్నాయక్‌ను కలెక్టర్‌లుగా నియమించారు. తక్కిన ఆరుగురు కూడా ఇప్పటికే పాలనలో తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ, సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ వస్తున్న ఆధికారులే. వీరంతా గత సోమవారమే కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా ‘సాక్షి’ ఈ ఎనిమిది మహిళా కలెక్టర్‌లతో మాట్లాడి, వారి ప్రాధాన్యాలను అడిగి తెలుసుకుంది -తెలంగాణ నెట్‌వర్క్, సాక్షి
ఫిర్యాదులకు ప్రాముఖ్యం
వెనుకబడిన నారాయణపేట జిల్లా ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తాను. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను అర్హులైన వారందరికి చేరేలా చూస్తాను. ఈ ప్రాంతంలో విద్య, వైద్యంతో పాటు గ్రామీణ, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. ప్రధానంగా భూ సమస్యలు, ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు, పచ్చదనం, పరిశుభ్రత, హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను.
– హరిచందన దాసరి, నారాయణపేట జిల్లా కలెక్టర్
విద్య, వైద్యం, భూ పరిరక్షణ
సమాజంలో మానవుడి మనుగడకు విద్య, వైద్యం ఎంతో అవసరం. అక్షరాస్యులైతే భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. వైద్య సేవలు అందుబాటులో ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు. అందుకే ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. అంగన్‌వాడీలను సైతం బలోపేతం చేస్తాను. జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కూడా మా లక్ష్యాలలో ఉంది.
– శ్వేత మహంతి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్
అవినీతి రహిత పాలన
ప్రజా సమస్యల పరిష్కారం నా తొలి ప్రాధాన్యం. ప్రభుత్వ శాఖల వారీగా.. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తాం. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూస్తాం. అవినీతి రహిత పాలన అందిస్తాం. అభివృద్ధిలో జిల్లాను ప్రథమశ్రేణిలో నిలిపేందుకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సమష్టిగా పని చేస్తాం.
– షేక్ యాస్మిన్ బాషా, వనపర్తి జిల్లా కలెక్టర్
పల్లె ప్రగతికి ప్రాధాన్యం
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే నా ప్రాధాన్యత. ప్రస్తుతం పల్లె ప్రగతికి తొలి ప్రాముఖ్యం. మెరుగైన పాలనను అందిస్తా. కొత్త జిల్లాలతో పరిపాలన ప్రజలకు చేరువైంది. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్దిదారులకు చేరేలా చూస్తాం. అవినీతి అనే దానికి ఆస్కారమే లేదు. సీఎం కేసీఆర్ తరహాలోనే ఒక విజన్ తో పనిచేస్తాం. అధికారులపై వేధింపులుండవు. అలాగని విధుల్లో రాజీ పడేది లేదు.
– సిక్తా పట్నాయక్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్
బాలికలకు మార్షల్ ఆర్ట్స్
నేను సివిల్ సర్వీసులోకి రావడానికి మా నాన్న కారణం. అమెరికాలో ఉంటే ఇక్కడకు తీసుకువచ్చారు. 2009లో గ్రూప్ –1 రాసి తొలి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యాను. కలెక్టర్ గా జనగామ నాకు మొదటి పోస్టింగ్. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేస్తోంది. మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, పల్లె ప్రగతి, హరితహారం, వైద్యం, విద్య వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకుపోవడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. విద్యలో జిల్లాను మొదటి వరుసలో నిలిపేందుకు ప్రయత్నిస్తాం. బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడంపై దృష్టి పెడతాం. జిల్లా అక్షరాస్యత ను పెంచడానికి కృషి చేస్తాను.
– కె. నిఖిల, జనగామ జిల్లా కలెక్టర్
అన్ని రంగాల్లో జిల్లా ప్రగతి
ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలా అంకిత భావంతో, నిబద్ధతతో పని చేస్తాను. జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమస్థానంలో నిలబెట్టేలా చూస్తాను. ప్రజలు, అధికారులతో మమేకం అయి పని చేస్తాను. ప్రభుత్వ పథకాలను సఫలీకృతం చేసేందుకు పని చేస్తాను. అందరూ ఉత్సాహంగా పని చేస్తే ఆదర్శవంతమైన జిల్లాగా మనకు పేరొస్తుంది.
– శ్రీదేవసేన, అదిలాబాద్ జిల్లా కలెక్టర్
మౌలిక సదుపాయాల కల్పన
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాను. పరిపాలన యంత్రాంగంతో పారదర్శకంగా, నిబద్ధతతో కలిసి ముందుకు సాగుతాను. జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తాను. పారిశుధ్యం, హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకుంటాం. పల్లెప్రగతిలో చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యమిస్తాం.
– శృతి ఓఝా, గద్వాల జిల్లా కలెక్టర్
పంటలకు ప్రోత్సాహం
వ్యవసాయ, ఉపాధి రంగాలకు తొలి ప్రాధాన్యం. అలాగే గ్రామీణాభివృద్ధి, పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి పెడతాం. వికారాబాద్ హైదరాబాద్ కు సమీపంగా ఉన్నందున ఉద్యానవన పంటలైన కూరగాయలు, పూలకు ఎక్కువగా మార్కెటింగ్ అవకాశాలు వుంటాయి కనుక రైతులు ఉద్యానవన పంటలు సాగుచేసేలా ప్రోత్సహిస్తాం.
– పౌసమి బసు, వికారాబాద్ జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment