చేపకు చక్రాల కుర్చీ... Strange vintintai | Sakshi
Sakshi News home page

చేపకు చక్రాల కుర్చీ...

Published Fri, Oct 2 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

చేపకు చక్రాల కుర్చీ...

చేపకు చక్రాల కుర్చీ: పుట్టుకలోని లోపం వల్ల గానీ, ప్రమాదవశాత్తు గానీ మన ఇంట్లో వాళ్లెవరికైనా కాళ్లు దెబ్బతింటే ఊరికే వదిలేస్తామా? ఆస్పత్రుల చుట్టూ తిరిగి, ఆపరేషన్లు చేయిస్తాం. అవకాశం ఉంటే, కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయిస్తాం. తిరిగి నడవగలిగే పరిస్థితి వచ్చేంత వరకు వీల్‌చైర్‌ను ఏర్పాటు చేస్తాం. మనుషుల విషయంలో ఇదంతా మామూలు ప్రక్రియే. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘రెడిట్’ యూజర్ ఒకరు మాత్రం తన ఇంట్లో పెంచుకుంటున్న చేపకు వీల్‌చైర్ ఏర్పాటు చేశాడు. ఇతగాడు ఏ దేశానికి చెందినవాడో తెలియదు గానీ, ఇతడి యూజర్ నేమ్ ‘లీబిలిటీ’. నీటితొట్టెలో మిగిలిన చేపలతో పాటే పెంచుకుంటున్న గోల్డెన్ ఫిష్ ఈదడానికి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించి, ఈ వీల్‌చైర్‌ను రూపొందించి, అమర్చానని, ఇప్పుడిది ఈజీగా ఈదులాడుతోందంటూ వీడియో, ఫొటోలతో పోస్ట్ పెట్టాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.
 
ఐరన్ లంగ్‌ః62

పుట్టుకతో ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులు ఉన్నా, నిండు నూరేళ్లూ ఊపిరి నిలిచి ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండర్ అనే ఈ ఆసామి వయసు ఇప్పుడు 68 ఏళ్లు. ఆరేళ్ల వయసులో పక్షవాతం సోకి, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతిన్నాయి. అప్పుడు వైద్యులు అతడికి ఐరన్ లంగ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి... అంటే, గత 62 ఏళ్లుగా ఐరన్‌లంగ్‌తో ఊపిరి నిలుపుకుంటూ వస్తున్నాడు. ఈ ఐరన్ లంగ్‌లో మనిషి పూర్తిగా పడుకుంటేనే శ్వాస ఆడుతుంది. అలెగ్జాండర్ ఘనత ఇదొక్కటే కాదు. ఈ ఐరన్‌లంగ్‌తో ఊపిరి తీసుకుంటూనే మూడు డిగ్రీలు పూర్తి చేశాడు. లా కోర్సు కూడా పూర్తిచేసి, లాయర్‌గా ప్రాక్టీసూ ప్రారంభించాడు. ఐరన్‌లంగ్‌లో ఉంటూనే, వాలంటరీ బ్రీతింగ్‌ను సాధన చేశాడు. ఇప్పుడు ఐరన్‌లంగ్ నుంచి కొన్ని గంటల సేపు బయట ఉండగలుగుతున్నాడు. వాలంటరీ బ్రీతింగ్‌ను విజయవంతంగా సాధించడం వల్లే రోజూ కొన్ని గంటల సేపు లాయర్‌గా కోర్టుకు హాజరు కాగలుగుతున్నాడు.
 
అక్కడ దొరికే వజ్రాలు మీవే...
ఔను! అక్కడ దొరికే వజ్రాలు అచ్చంగా మీవే. అయితే, ఆ గనిలో వాటిని మీరే ఏరుకోవాలి. ఇంతకీ ఈ వజ్రాల గని ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంది. అక్కడ మర్‌ఫ్రీబరోలో ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ వజ్రాల గనికి ఎవరైనా వెళ్లవచ్చు. ఓపిక ఉన్నంత సేపు వజ్రాల వేట సాగించవచ్చు. ఒకటో రెండో... ఎన్నో కొన్ని వజ్రాలు దొరికితే మీ పంట పండినట్లే! వాటిని ఎవరికీ ఇవ్వక్కర్లేదు. వాటిపై ఎలాంటి పన్నులూ కట్టక్కర్లేదు. ఇక్కడ వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు మొట్టమొదటి సారిగా 1906లో కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గనిలో 75 వేలకు పైగా వజ్రాలు దొరికాయి. దీనిని 1972లో స్టేట్ పార్క్‌గా మార్చి, ప్రజలందరికీ ప్రవేశం కల్పించారు. అప్పటి నుంచి ఈ పార్కును సందర్శించిన వారిలో కొందరు అదృష్టవంతులు దాదాపు 19 వేలకు పైగా వజ్రాలను చేజిక్కించుకున్నారు. మీకూ ఈ వజ్రాలు కావాలా? అయితే, చలో అర్కాన్సాస్!
 
గులాబీ యాపిల్...

యాపిల్ అంటే ఎర్రగా నిగనిగలాడే పండు రూపమే మనకు గుర్తుకొస్తుంది. మార్కెట్‌లో ఎక్కువగా కనిపించేవి కూడా ఎర్రని యాపిల్సే. ఎర్ర ఎర్రని యాపిల్‌ను కోసి చూస్తే తెల్లగా కనిపిస్తుంది. ఎర్రని యాపిల్సే కాదు, ఆకుపచ్చని యాపిల్స్, పసుపుపచ్చని యాపిల్స్... ఇలాంటి ఎన్ని రకాల యాపిల్స్‌ను కోసి చూసినా, లోపలంతా తెల్లగానే ఉంటుంది. బ్రిటన్‌లో పండే ఈ విచిత్రమైన యాపిల్స్ మాత్రం చూడటానికి లేత కాషాయ ఛాయ కలగలసిన పసుపు రంగులో కనిపిస్తాయి. వీటిని కోసి చూస్తే మాత్రం, లోపల గుజ్జంతా గులాబీ రంగులో కనిపిస్తుంది. రుచిలో ఈ గులాబీ యాపిల్స్ కూడా మామూలు యాపిల్స్ మాదిరిగానే ఉంటాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement