artificial organs
-
సృజన భళా... ఆరోగ్య మేళా...
సాక్షి, హైదరాబాద్: సూది గుచ్చడం దగ్గర నుంచి సర్జరీ దాకా అవసరమైన సందర్భాల్లో నొప్పి తెలీకుండా చేసే ఉత్పత్తి ఏదైనా ఉంటే? మనం ఇంట్లో కూర్చుని ఓ వైపు మన పని మనం చేసుకుంటుండగానే మన హార్ట్ బీట్, బ్లడ్‌షుగర్ స్థాయిలు వైద్యునికి తెలిసిపోతూ ఉంటే..? ఆకాశమే హద్దుగా ఆరోగ్యరంగంలో వెల్లువెత్తుతున్న సృజన సాకారం చేస్తున్న అద్భుతాలివి... వీటన్నింటికి అద్దం పడుతోంది నగరంలో జరుగుతున్న బయో ఆసియా సదస్సు. ఇందులో విజేతలుగా నిలిచిన స్టార్టప్‌లు చేసిన ఆవిష్కరణలు ఇలా.. అందుబాటు ధరలో కృత్రిమ అవయవాలు వైకల్య బాధితులను దృష్టిలో పెట్టుకుని అత్యంత తేలికగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఉత్పత్తులు రూపొందించాం. ప్రస్తుతం మేము చేతులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. త్వరలో ప్రధాన అవయవాలనూ అందుబాటులోకి తెస్తాం. సహజమైన శరీర భాగాల తరహాలోనే ఇవి పనిచేస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్పత్తులు రూ7 లక్షల వరకుంటే.. మా ఉత్పత్తులు రూ.1.50 లక్షల్లోనే లభిస్తున్నాయి. – మునీష్ కుమార్, ఎగ్జోబొట్ డైనమిక్స్ సంస్థ సీఈఓ కేన్సర్ మందుల సృష్టితో... అంతర్జాతీయ మార్కెట్ కోసం కేన్సర్ మందులను తయారు చేసే సంస్థని మూడేళ్ల క్రితం ప్రారంభించాం. ఫస్ట్ ఇన్ క్లాస్ మెకానిజమ్‌తో దేశంలోనే మాది తొలి సంస్థ. లంగ్ కేన్సర్, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ కేన్సర్‌కు డ్రగ్‌ను అభివృద్ధి చేశాం. దీనిని త్వరలోనే మనుషుల మీద ప్రయోగించనున్నాం. దేశంలో ఇంతవరకు ఎవరూ చేయని మెకానిజమ్‌ను అనుసరిస్తూ ఈ డ్రగ్‌ను తెస్తున్నందుకే మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. –సీఎస్ఎన్ మూర్తి, సీఈఓ సత్య ఫార్మా ఇన్నోవేషన్స్, హైదరాబాద్ ఆరోగ్యం చెప్పే మెషీన్ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కనిపించే వెయింగ్ మెషీన్ తరహాలో ఓ అధునాతన మెషీన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని హైదరాబాద్‌కు చెందిన పల్స్ యాక్టివ్ స్టేషన్స్ నెట్వర్క్ రూపొందించింది. ఈ మెషీన్ మీదకు ఎక్కి స్క్రీన్ ముందు నిలబడి మొబైల్ నంబర్ తదితర వివరాలు ఎంట్రీ చేస్తే చాలు. మన ఆరోగ్య వివరాలు వాట్సాప్‌కు వచ్చేస్తాయి. ఇందులో మన బరువు, ఎత్తు, బీఎంఐ, బీపీతోపాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని, ఫిట్నెస్ స్థాయిని, డయాబెటిస్ అవకాశాల్ని కూడా అంచనా వేస్తుంది. మెషీన్‌ని పూర్తిగా తెలంగాణలోనే తయారు చేశామని భవిష్యత్తులో అన్ని ఆసుపత్రుల్లో బహిరంగ ప్రదేశాల్లో అమర్చేలా ప్రయత్నిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో జోగిందర్ తనికెళ్ల చెప్పారు. ధర రూ.2.50 లక్షలు. నేరుగా వైద్యుడికి నివేదికలు.. ఆరోగ్య పరీక్షలు సొంతంగా చేసుకోవడంతోపాటు ఆ పరీక్షల ఫలితాలు నేరుగా మన వైద్యునికి చేరేలా ఉత్పత్తులు సృష్టించారు ‘ఆబో 1008 డిజిటల్ హెల్త్ కేర్’ సంస్థకు చెందిన నగరవాసి సత్యదేవ్. పల్స్ రేట్, బీపీ, ఈసీజీ, శరీర ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర శాతం ఇవన్నీ కలిపి హెల్త్ బోట్ డివైజ్ ద్వారా పరీక్షించుకునే సదుపాయాన్ని తెచ్చారు. అలాగే నిద్రలేమి సమస్యలు, ఒత్తిడి స్థాయిలు, మహిళల రుతుక్రమ సమస్యలు తెలుసుకునే ఉంగరం మాదిరి ఉండే పరికరాన్నీ రూపొందించారు. చర్మ పరీక్షలు, చెవి, గొంతు సమస్యలు తెలుసుకోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యల్ని గుర్తించడానికి ఆబో వన్ డివైజ్‌లను తయారుచేశారు. ఇంట్లో చేసుకున్న ఈ పరీక్షల రిపోర్టులు నేరుగా వైద్యునికి చేరేలా అప్లికేషన్ రూపొందించామన్నారు. విద్యుత్ అవసరం లేని ‘ఫ్రీజర్’.. కొన్ని రకాల వైద్య చికిత్సల్లో ఉపయోగించే ఉత్పత్తుల్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో భధ్రపరచాల్సి ఉంటుంది. దీని కోసం ఇప్పటిదాకా థర్మాకోల్‌తో చేసిన బాక్స్‌లనే ఉపయోగిస్తుండగా, బయోస్యూర్ పేరుతో షిప్పర్ బాక్స్‌లను మ్యాక్ఫై అనే సంస్థ రూపొందించింది. విద్యుత్ అవసరం లేకుండా రోజుల తరబడి ఫ్రీజర్ సేవల్ని అందించే ఈ బాక్స్‌ను వెజిటబుల్స్ దాచుకోవడానికీ వాడొచ్చని సంస్థ చెప్పింది. పేస్ ఛేంజ్ మెటీరియల్ ఉపయోగించి దీన్ని చార్జ్ చేయాల్సి ఉంటుందని, ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే నిర్ణీత ఉష్ణోగ్రతను 24గంటలపాటు ఉంచుతుందని పేర్కొంది. అందరికీ ప్రాథమిక వైద్యం కోసం... ప్రాథమిక వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్నది మా హెల్త్ కాన్ అండ్ మెడ్ టెక్ స్టార్టప్ లక్ష్యం. ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రజలకు డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ సొల్యూషన్స్, మొబైల్ హెల్త్ సొల్యూషన్స్, అనలటిక్స్ ద్వారా హెల్త్‌కేర్‌ను చేరువ చేస్తున్నాం. అపోలో టెలీ హెల్త్‌తో కలిసి దేశవ్యాప్తంగా 440 కేంద్రాలు ఏర్పాటు చేశాం. దాదాపు 3 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. బయో ఆసియాలో లభించిన ఈ గుర్తింపు మా సేవలకు మరింత స్ఫూర్తినిస్తుంది. – డా.ప్రణయ్ కార్గ్, ప్రతిభ హెల్త్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే ఇట్టే గుర్తించే పేపర్ ఆధారిత డివైజ్... రాంజా జీనో సెన్సర్ కూడా టాప్ 5లో నిలిచింది. అమెరికాలోని ఎండీ ఆండర్సన్ కేన్సర్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్‌కు చెందిన ల్యాంబ్డజెన్ థెరప్యూటిక్స్ కూడా ఈ జాబితాలో నిలిచింది. -
మెడ్‌టెక్ జోన్లో కృత్రిమ అవయవాల తయారీ
సాక్షి, విశాఖపట్నం: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కృత్రిమ అవయవాల తయారీపై దృష్టిసారించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేసిన ఐసీఎంఆర్.. తాజాగా విశాఖలోనూ ప్రారంభించింది. ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. మరోవైపు, వైద్య ఉపకరణాలకు వేదికగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్లో మరో తయారీ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. చక్కెర స్థాయిల్ని తెలిపే బీజీఎంఎస్ పరికరాల తయారీ ప్రాజెక్టుకు యాక్యూరెక్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్లో వైద్య పరికరాల తయారీ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్లో 100కి పైగా సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా యాక్యురెక్స్ సంస్థ కూడా తమ పరికరాల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. బ్లడ్ గ్లూకోజ్ మోనిటరింగ్ సిస్టమ్(బీజీఎంఎస్) పరికరాల్ని మెడ్‌టెక్‌జోన్‌లో ఇక నుంచి తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన పరిశ్రమని ఇటీవల ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా.రాజీవ్‌భాల్, ఏఎంటీజెడ్ సీఈవో, ఎండీ డా.జితేంద్రశర్మ ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి యూరిన్ స్ట్రిప్స్ తయారీ సంస్థగా రికార్డు సృష్టించామని, భవిష్యత్తులో మరిన్ని నూతన పరికరాల్ని తయారు చేసేందుకు విశాఖ కేంద్రంగా అడుగులు వేస్తున్నామని యాక్యురెక్స్ ఎండీ అభినవ్ ఠాకూర్ తెలిపారు. -
దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు
కర్నూలు(టౌన్): దివ్యాంగుల పునరావాస యోజన కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్ అందిస్తున్నట్లు భారత్ వికాస్ పరిషత్ ఆంధ్ర ప్రాంత సహ కార్యదర్శి బీవీ బాలసుబ్రమణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలిమేర వేణుగోపాల్, కామాక్షమ్మ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో జైపూర్ కాలు కంటే నాణ్యమైన కృత్రిమ కాలును ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 14వ తేదీ లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94404 41447 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
మొహినుద్దీన్‌కు డబ్బులొచ్చాయ్..
- విద్యుదాఘాతంతో కాళ్లు, చేతులు కోల్పోరుున మొహినుద్దీన్ - ‘సాక్షి’ కథనంతో కృత్రిమ అవయవాల కోసం నగదు అందజేసిన బ్యాంకు మేనేజర్ సాక్షి, హైదరాబాద్: విద్యుదాఘాతంతో రెండు చేతులు, రెండు కాళ్లు పోగొట్టుకుని కృత్రిమ అవయవాలతో అవస్థ పడుతున్న ఖాజా మొహినుద్దీన్ నగదు పొందేందుకు పడుతున్న అవస్థపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి బ్యాంకు అధికారులు స్పందించారు. కొద్ది నెలల కింద ఇంటి వద్ద మర మ్మతు పనులు చేస్తుండగా ఇనుప కడ్డీ హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి విద్యుదాఘా తానికి గురైన ఖాజా రెండు చేతులు, రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు వాటిని తొలగించి తాత్కాలికంగా కృత్రిమ అవయవాలు అమర్చారు. అవి పగిలిపోతుండటంతో వైద్యులను సంప్రదించగా పూర్తిస్థాయి కృత్రిమ అవయవాలు అమర్చాలని సూచించారు. ఇందుకు రూ.25 వేలు ఖర్చ వుతుందని చెప్పగా నాలుగు రోజుల కింద విజయనగర్ కాలనీలో ఉన్న ఎస్బీఐకి వచ్చాడు. బ్యాంకు సిబ్బంది రూ.4 వేలే ఇచ్చారు. అవి సరిపోకపోవటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అతని దుస్థితిపై ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. బుధవారం బ్యాంకుకు వచ్చిన ఖాజాకు కృత్రిమ అవయవాలు అమర్చుకునేందుకు ఆ బ్యాంకు మేనేజర్ రామస్వామి అవసరమైన మిగిలిన మొత్తాన్ని అందజేశారు. -
చేపకు చక్రాల కుర్చీ...
చేపకు చక్రాల కుర్చీ: పుట్టుకలోని లోపం వల్ల గానీ, ప్రమాదవశాత్తు గానీ మన ఇంట్లో వాళ్లెవరికైనా కాళ్లు దెబ్బతింటే ఊరికే వదిలేస్తామా? ఆస్పత్రుల చుట్టూ తిరిగి, ఆపరేషన్లు చేయిస్తాం. అవకాశం ఉంటే, కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయిస్తాం. తిరిగి నడవగలిగే పరిస్థితి వచ్చేంత వరకు వీల్‌చైర్‌ను ఏర్పాటు చేస్తాం. మనుషుల విషయంలో ఇదంతా మామూలు ప్రక్రియే. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ‘రెడిట్’ యూజర్ ఒకరు మాత్రం తన ఇంట్లో పెంచుకుంటున్న చేపకు వీల్‌చైర్ ఏర్పాటు చేశాడు. ఇతగాడు ఏ దేశానికి చెందినవాడో తెలియదు గానీ, ఇతడి యూజర్ నేమ్ ‘లీబిలిటీ’. నీటితొట్టెలో మిగిలిన చేపలతో పాటే పెంచుకుంటున్న గోల్డెన్ ఫిష్ ఈదడానికి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించి, ఈ వీల్‌చైర్‌ను రూపొందించి, అమర్చానని, ఇప్పుడిది ఈజీగా ఈదులాడుతోందంటూ వీడియో, ఫొటోలతో పోస్ట్ పెట్టాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఐరన్ లంగ్ః62 పుట్టుకతో ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులు ఉన్నా, నిండు నూరేళ్లూ ఊపిరి నిలిచి ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండర్ అనే ఈ ఆసామి వయసు ఇప్పుడు 68 ఏళ్లు. ఆరేళ్ల వయసులో పక్షవాతం సోకి, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతిన్నాయి. అప్పుడు వైద్యులు అతడికి ఐరన్ లంగ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి... అంటే, గత 62 ఏళ్లుగా ఐరన్లంగ్తో ఊపిరి నిలుపుకుంటూ వస్తున్నాడు. ఈ ఐరన్ లంగ్‌లో మనిషి పూర్తిగా పడుకుంటేనే శ్వాస ఆడుతుంది. అలెగ్జాండర్ ఘనత ఇదొక్కటే కాదు. ఈ ఐరన్లంగ్తో ఊపిరి తీసుకుంటూనే మూడు డిగ్రీలు పూర్తి చేశాడు. లా కోర్సు కూడా పూర్తిచేసి, లాయర్‌గా ప్రాక్టీసూ ప్రారంభించాడు. ఐరన్లంగ్లో ఉంటూనే, వాలంటరీ బ్రీతింగ్‌ను సాధన చేశాడు. ఇప్పుడు ఐరన్‌లంగ్ నుంచి కొన్ని గంటల సేపు బయట ఉండగలుగుతున్నాడు. వాలంటరీ బ్రీతింగ్‌ను విజయవంతంగా సాధించడం వల్లే రోజూ కొన్ని గంటల సేపు లాయర్‌గా కోర్టుకు హాజరు కాగలుగుతున్నాడు. అక్కడ దొరికే వజ్రాలు మీవే... ఔను! అక్కడ దొరికే వజ్రాలు అచ్చంగా మీవే. అయితే, ఆ గనిలో వాటిని మీరే ఏరుకోవాలి. ఇంతకీ ఈ వజ్రాల గని ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంది. అక్కడ మర్ఫ్రీబరోలో ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ వజ్రాల గనికి ఎవరైనా వెళ్లవచ్చు. ఓపిక ఉన్నంత సేపు వజ్రాల వేట సాగించవచ్చు. ఒకటో రెండో... ఎన్నో కొన్ని వజ్రాలు దొరికితే మీ పంట పండినట్లే! వాటిని ఎవరికీ ఇవ్వక్కర్లేదు. వాటిపై ఎలాంటి పన్నులూ కట్టక్కర్లేదు. ఇక్కడ వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు మొట్టమొదటి సారిగా 1906లో కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గనిలో 75 వేలకు పైగా వజ్రాలు దొరికాయి. దీనిని 1972లో స్టేట్ పార్క్‌గా మార్చి, ప్రజలందరికీ ప్రవేశం కల్పించారు. అప్పటి నుంచి ఈ పార్కును సందర్శించిన వారిలో కొందరు అదృష్టవంతులు దాదాపు 19 వేలకు పైగా వజ్రాలను చేజిక్కించుకున్నారు. మీకూ ఈ వజ్రాలు కావాలా? అయితే, చలో అర్కాన్సాస్! గులాబీ యాపిల్... యాపిల్ అంటే ఎర్రగా నిగనిగలాడే పండు రూపమే మనకు గుర్తుకొస్తుంది. మార్కెట్లో ఎక్కువగా కనిపించేవి కూడా ఎర్రని యాపిల్సే. ఎర్ర ఎర్రని యాపిల్‌ను కోసి చూస్తే తెల్లగా కనిపిస్తుంది. ఎర్రని యాపిల్సే కాదు, ఆకుపచ్చని యాపిల్స్, పసుపుపచ్చని యాపిల్స్... ఇలాంటి ఎన్ని రకాల యాపిల్స్‌ను కోసి చూసినా, లోపలంతా తెల్లగానే ఉంటుంది. బ్రిటన్‌లో పండే ఈ విచిత్రమైన యాపిల్స్ మాత్రం చూడటానికి లేత కాషాయ ఛాయ కలగలసిన పసుపు రంగులో కనిపిస్తాయి. వీటిని కోసి చూస్తే మాత్రం, లోపల గుజ్జంతా గులాబీ రంగులో కనిపిస్తుంది. రుచిలో ఈ గులాబీ యాపిల్స్ కూడా మామూలు యాపిల్స్ మాదిరిగానే ఉంటాయి. -
ధీమా పెంచే బ్లేడ్స్...
కష్టమొచ్చిందని చింతిస్తే కష్టాలు తీరవు... రోగమొచ్చిందని ఏడిస్తే అది నయం కాదు... అంగవైకల్యం ఉందని బాధపడుతూ కూర్చుంటే జీవితం ముందుకు సాగదు... 39 ఏళ్ల కిందట ఓ ప్రమాదంలో మోకాలి కింది వరకు కాలు కోల్పోయి జీవితాన్ని నెట్టుకొస్తున్న బయో మెడికల్ డిజైన్ ఇంజనీర్ వాన్ ఫిలిప్స్ ఆలోచనా విధానం అంగవైకల్యం ఉన్నవారి భవిష్యత్తునే మార్చేసింది. కాలు కోల్పోయిన వాళ్లు తిరిగి మామూలు మనిషిలా నడవడంతో పాటు... క్రీడల్లోనూ పాల్గొనేందుకు వీలుగా ఆయన కార్బన్ ఫైబర్ బ్లేడ్లను తయారు చేశాడు. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ఆస్కార్ పిస్టోరియస్.. 28 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా అథ్లెట్ బ్లేడ్ రన్నర్‌గా అందరికీ సుపరిచితమే. ఫిబ్యులర్ హెమిమెలియా (ఒకరకమైన అంగవైకల్యం) (రెండు కాళ్లలో తేడా)తో జన్మించాడు. దీంతో పదేళ్ల వరకు జీవితాన్ని అలాగే నెట్టుకొచ్చాడు. అయితే 11 ఏళ్ల వయసులో పిస్టోరియస్ తన రెండు కాళ్లను మోకాలి కింది వరకు తీసేయించుకున్నాడు. అప్పటి నుంచి అతని గమ్యం మారింది. కారణం అతను బ్లేడ్ల సాయంతో క్రీడాకారుడిగా రాణించడమే. అయితే అవి అలాంటి ఇలాంటి కృత్రిమ కాళ్లు కావు.. చిరుతలా పరుగెత్తించే కార్బన్ ఫైబర్‌తో తయారుచేసిన బ్లేడ్లు... ఇవే పిస్టోరియస్ జీవితాన్ని మార్చేశాయి. ఆ మాటకొస్తే... అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న వాళ్లు వీటితోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. బ్లేడ్లు తయారు చేసేదిలా.. కాళ్లు కోల్పోయిన వాళ్లు.. చేతులు కోల్పోయిన వాళ్లు సాధారణంగా కృత్రిమ అవయవాలతో ఎలాగోలా జీవితాన్ని గడిపేస్తారు. అయితే తనలా ఎదుటివాళ్లు కష్టాలు అనుభవించొద్దన్న ఉద్దేశంతో... క్రీడల్లో రాణించాలనుకుంటున్న వారికోసం వాన్ ఫిలిప్స్ అనే బయో మెడికల్ డిజైన్ ఇంజనీర్ చిరుతలా పరుగెత్తే బ్లేడ్లను రూపొందించారు. వీటిని ఫ్లెక్స్-ఫూట్ చీతా అని కూడా అంటారు. ఇవి కార్బన్ ఫైబర్‌తో తయారు చేస్తారు. మామూలు కృత్రిమ కాళ్లు గట్టిదనాన్ని కలిగి ఉంటే.. కార్బన్ ఫైబర్‌తో రూపొందించిన బ్లేడ్లు గట్టిదనంతో పాటు వంగే గుణం కలిగి ఉంటాయి. స్టీల్ కన్నా ఇవి బలంగా ఉంటాయి. ఈ బ్లేడ్లు వెంట్రుక కన్నా మందంగా 80 పొరలతో తయారవుతాయి. తేలికైన బరువును కలిగి ఉంటాయి. పోటీల్లో పాల్గొన్నప్పుడు గతిశక్తి (కెనైటిక్ ఎనర్జీ)తో పాటు స్ప్రింగుల్లా కూడా పనిచేస్తాయి. ఫలితంగా వీటిని ఉపయోగించే వాళ్లు ఎవరైనా చిరుతలా పరుగెత్తే వీలుంటుంది. అందుకే అంగవైకల్యం ఉన్న క్రీడాకారులు బ్లేడ్లను ధరించి రాణిస్తున్నారు. అయితే ఈ బ్లేడ్లు అందరికీ ఒకేలా ఉండవు. అంగవైకల్యం పరిస్థితి ఆధారంగా రూపొందిస్తారు. దక్షిణాఫ్రికా అథ్లెట్ ప్రిస్టోరియస్ ధరించే బ్లేడ్లు 147 కేజీల బరువును సైతం తట్టుకుంటాయి. బ్లేడ్లతో అన్ని క్రీడలు? అంగవైకల్యం ఉన్న వాళ్లు కార్బన్ ఫైబర్ బ్లేడ్లు ధరించి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రాణించిన సందర్భాలు బోలెడు. దక్షిణాఫ్రికా స్ప్రింటర్ ఆస్కార్ పిస్టోరియస్ ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే. చాలా మంది పారా అథ్లెట్లు బ్లేడ్ల సాయంతో పరుగు పందాల్లో రాణిస్తున్నారు. అయితే బ్లేడ్ల సాయంతో క్రీడల్లో సత్తా చాటడం కేవలం అథ్లెటిక్స్కే పరిమితం కాలేదు. బేస్‌బాల్, ఫుట్‌బాల్, సాఫ్ట్‌బాల్, రగ్బీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్రీడల్లో అంగవైకల్యం ఉన్నవాళ్లు బ్లేడ్ల సాయంతో అదరగొడుతున్నారు. బ్లేడ్లతో పాటే వివాదాలు... కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన బ్లేడ్లు కాళ్లు కోల్పోయిన క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపినప్పటికీ... అదే సమయంలో ఇవి వివాదాలకూ కేంద్రబిందువులయ్యాయి. స్ప్రింగుల్లా ఉండే బ్లేడ్ల వల్ల అంగవైకల్య క్రీడాకారులకు అదనపు ప్రయోజనం కలుగుతుందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వివాదాలకు పిస్టోరియసే కారణమయ్యాడు. 2007లో అతను శారీరక వైకల్యం లేని అథ్లెట్లతో పోటీపడేందుకు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) అనుమతినిచ్చింది. బ్లేడ్లతో అంగవైకల్య అథ్లెట్లకు పోటీల్లో ప్రయోజనం కలుగుతుందని భావించిన ఐఏఎఫ్ మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. స్ప్రింగ్‌లు, చక్రాలతో పాటు అథ్లెట్లకు అనుకూలంగా ఉండే సాధనాలను పోటీల్లో వాడకూడదని నిర్ణయించింది. అయితే బ్లేడ్ల ద్వారా అంగవైకల్యం ఉన్న వారికి అదనపు అనుకూలత కలిగే అవకాశాలు లేవని పరిశోధనలో తేలడంతో పిస్టోరియస్ మళ్లీ సాధారణ అథ్లెట్లతో పోటీపడే అవకాశం దక్కింది. రెండేళ్ల కిందట లండన్‌లో జరిగిన ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో బ్లేడ్లతో పోటీల్లో పాల్గొనే అర్హత సాధించాడు. వీటి సాయంతో పోటీల్లో పాల్గొంటున్న పిస్టోరియస్ 2012 పారా ఒలింపిక్స్ సందర్భంగా వివాదానికి తెరలేపాడు. టీ 44 విభాగం 200 మీటర్ల పరుగులో తిరుగులేని పిస్టోరియస్ను బ్రెజిల్‌కు చెందిన ఒలివెరా వెనక్కి నెట్టి బంగారు పతకం సాధించాడు. అయితే ఒలివెరా ఉపయోగించిన బ్లేడ్లు తనకన్నా పొడవుగా ఉన్నాయని.. అందుకే అతను విజేతగా నిలిచాడని వ్యాఖ్యానించి దుమారం రేపాడు. కానీ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. ఖరీదైనవే ! అంగవైకల్య క్రీడాకారులు ధరించే కార్బన్ ఫైబర్ బ్లేడ్లు ఖరీదైనవే. వీటి కనీస ధర లక్ష రూపాయల పైమాటే. సాధారణంగా అథ్లెట్లు ఒస్సుర్ కంపెనీ తయారు చేసిన బ్లేడ్లను ఉపయోగిస్తారు. ప్రధానంగా ఇవి నాలుగు రకాలు. చీతా ఎక్స్టెండ్, చీతా ఎక్స్ట్రీమ్, ఫ్లెక్స్ రన్, ఫ్లెక్స్ ఫూట్ చీతా.. అథ్లెట్లు పాల్గొనే క్రీడాంశాల ఆధారంగా నాలుగు రకాల బ్లేడ్లను ధరించి పోటీల్లో పాల్గొంటారు. భవిష్యత్తుపై ధీమా కాళ్లు కోల్పోయినా.. కార్బన్ ఫైబర్ బ్లేడ్లతో అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన, రాణిస్తున్న వాళ్లు కోకొల్లలు.. తమకు అంగవైకల్యం ఉందని ఏ మాత్రం బాధపడకుండా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకునే వాళ్లకు ఈ బ్లేడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అందుకే అంగవైకల్య క్రీడాకారులకు ఇవి ఎంతగానో ధీమా కల్పిస్తున్నాయి. ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ సారా సారా రీనర్ట్సెన్.. అమెరికా ట్రయాథ్లాన్ క్రీడాకారిణి... అత్యంత క్లిష్టమైన ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్లో పాల్గొన్న తొలి మహిళా అంగవైకల్య క్రీడాకారిణి. బ్లేడ్ సాయంతోనే ఆమె ఈ పోటీలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. పుట్టుకతోనే రెండు కాళ్ల మధ్య తేడా ఉండటంతో సారా ఏడేళ్ల వయసులో తన ఎడమకాలిని తీయించేసుకుంది. 12 ఏళ్ల వయసులో ఫ్లెక్స్ ఫూట్ (కార్బన్ ఫైబర్ బ్లేడ్) ధరించడంతో ఆమె జాతకమే మారిపోయింది. వీటి సాయంతోనే ట్రయాథ్లాన్లో రాణించింది. వీటిని వేసుకుని పోటీల్లో పాల్గొన్నప్పుడు సారాకు మేఘాల్లో తేలిపోయినట్లుగా ఉండేదట. వాన్ ఫిలిప్స్.. ది గాడ్ కార్బన్ ఫైబర్ కాళ్ల (బ్లేడ్ల) సృష్టికర్త అమెరికాకు చెందిన వాన్ ఫిలిప్స్.. అంగవైకల్య క్రీడాకారులకు అతనో దేవుడు. ప్రస్తుతం ఆరు పదుల వయసు దాటిన ఫిలిప్స్.. తాను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాటర్ స్కీయింగ్ ప్రమాదంలో కాలును కోల్పోయారు. రబ్బరు కాళ్లతో నడవడం మొదలుపెట్టిన ఫిలిప్స్ వీటి వల్ల కలిగే ఇబ్బందులను స్వయంగా గమనించారు. వీటిని అధిగమించాలన్న ఆయన ఆలోచన కార్బన్ ఫైబర్ బ్లేడ్ల తయారీకి బీజం పడేలా చేసింది. ఉతా యూనివర్సిటీలో బయో మెడికల్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేసిన ఫిలిప్స్... అంగవైకల్యం ఉన్న వారి కోసం కార్బన్ ఫైబర్ బ్లేడ్లను రూపొందించారు. ఇంగ్లిష్ అక్షరం ‘సి’ ఆకారంలో తయారు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రహించారు. ఆరంభంలో కార్బన్ ఫైబర్ బ్లేడ్లు విఫలమయ్యాయి. అయినా పట్టు వీడలేదు. వాటిపై ప్రయోగాలు కొనసాగించి చివరికి విజయవంతమయ్యారు. ఈ ప్రయత్నంలో రెండేళ్లలో తను తయారుచేసిన 100 బ్లేడ్లు విరిగిపోయాయి. చివరికి 1984 నుంచి ఫ్లెక్స్ ఫూట్ కంపెనీ పేరుతో ఫిలిప్స్ బ్లేడ్ల అమ్మకం మొదలుపెట్టారు. అయితే 2000లో వీటి హక్కులను ఒస్సుర్ అనే సంస్థకు అమ్మేశారు. గత 14 ఏళ్లుగా ఇప్పుడు ఈ కంపెనీ బ్రాండ్‌పైనే బ్లేడ్లు అమ్ముడవుతున్నాయి. ఈ సంస్థ ఇప్పుడు కాళ్లు కోల్పోయిన క్రీడాకారులకు అండగా నిలుస్తూ వారిని ప్రోత్సహిస్తోంది.