
ఆ వేదిక అనువైనది కాదు..
లండన్ : మానసిక సమస్యలకు వైద్య చికిత్సను ఆశ్రయించకుండా సోషల్ మీడియా సైట్లు యువతను తప్పుదారిపట్టిస్తున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. 14 నుంచి 30 ఏళ్ల లోపు యువత తమ మానసిక రుగ్మతల పరిష్కారానికి వైద్య చికిత్సకు వెళ్లకుండా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారని అథ్యయనం చేపట్టిన రాయల్ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ గుర్తించింది. 1,34,000 మంది యువతపై సంస్థ ఈ అథ్యయనం నిర్వహించింది.సోషల్ మీడియాలో అదే పనిగా కూరుకుపోవడంతో యువత తమ మానసిక సమస్యలకూ ఆన్‌లైన్‌లోనే పరిష్కారం వెతుక్కుంటున్నారని ఇది తప్పుడు సలహాలు, అవాస్తవ సమాచారానికి దారితీస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి ఆన్‌లైన్ వేదికలు యువతకు సరైన మార్గనిర్ధేశం చేయాలని సూచిస్తున్నారు. మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు సోషల్ మీడియా ప్రజలకు వేదికగా నిలుస్తోందని అయితే చివరికి సోషల్ మీడియానే ఒక రుగ్మతగా తయారైందని పరిశోధకులు టామ్ హారిసన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, పురుషులు ఆన్‌లైన్‌లో ఎక్కువగా కుంగుబాటు గురించే చర్చిస్తున్నారని పరిశోధకులు వెల్లడించారు.
పురుషులు ఎక్కువగా నిద్రలేమి, అలసట గురించి పోస్ట్‌లు చేస్తుంటే మహిళలు ఆత్మహత్య, కుంగుబాటు, హెల్ప్ వంటి కీవర్డ్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇలాంటి వేదికలపై యువత తమ సమస్యలను నివేదిస్తే అనవసర పేజీలు, గ్రూపులను వారు సంప్రదించే అవకాశం మినహా ఎలాంఇ ఉపయోగం లేదని గుర్తించాలన్నారు.
యువతలో పేరొందిన స్టూడెంట్ రూమ్ అనే ఫోరంలో విద్యార్ధులు ఎక్కువగా ఆత్మహత్యల గురించి చర్చిస్తున్నారని, ఇది వీరిలో నెలకొన్న మానసిక రుగ్మతలు ఏస్ధాయిలో ఉన్నాయనే సంకేతాలు పంపుతోందని పరిశోధకులు స్పష్టం చేశారు. కుటుంబంలో ఒత్తిడి, విద్య, స్నేహం వంటి అంశాలు వీరిని విపరీతంగా యాంగ్జైటీకి లోనయ్యేలా చేస్తున్నాయని, వీటికి వైద్యపరంగా పరిష్కారాన్ని అన్వేషించాలని, చర్చలతో ఇవి సమసిపోవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.