ఒక్క హౌస్‌ఫుల్‌ చాలు అనుకున్నా | Sudeep Special Interview With Sakshi | Sakshi
Sakshi News home page

ఒక్క హౌస్‌ఫుల్‌ చాలు అనుకున్నా

Published Sun, Nov 17 2019 3:01 AM | Last Updated on Sun, Nov 17 2019 1:19 PM

Sudeep Special Interview With Sakshi

ఎక్కువ ఊహించుకుంటే.. తక్కువగా కోరుకోలేం. సుదీప్‌ ఊహలకు రెక్కలు కట్టుకునే మనిషి కాదు. అందుకే ఏనాడూ.. తక్కువైందని బాధపడే అవసరం రాలేదు. అవసరం ఎందుకు రాలేదంటే ఎక్కువగా కోరుకోలేదు! ఒక్క హౌస్‌ ఫుల్‌ ఉంటే చాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. కన్నడలో ఇప్పుడు స్టార్‌ హీరో! స్టార్‌ కాకపోయుంటే? అసలు హీరోనే అవకపోయుంటే? కనీసం కాఫీ కప్పులైనా అందిస్తుండేవారట! అంతిష్టం.. సుదీప్‌కి సినిమా అంటే. ప్రస్తుతం ‘దబాంగ్‌ 3’లో యాక్ట్‌ చేస్తున్నారు. ఆ విశేషాలకేం గానీ.. సుదీప్‌లో ఇంకో సుదీప్‌ని కనిపెట్టింది ‘సాక్షి’! ఆ ఇంకో సుదీప్‌ ఎవరో చదివి మీరూ కనిపెట్టండి.
 

మీరు జిమ్‌ చేయరని, యోగా మీద ఆసక్తి లేదని విన్నాం. కానీ ఈ మధ్య విడుదలైన ‘పహిల్వాన్‌’ కోసం జిమ్‌ చేశారట?
ఫిట్‌నెస్‌ అంటే జిమ్, యోగా మాత్రమే కాదు. జాగింగ్, స్పోర్ట్స్‌ వల్ల కూడా  ఫిట్‌గా    ఉండొచ్చు. అలా నేనెప్పుడూ ఫిట్‌గా ఉన్నాను. నాకిష్టం లేకపోయినా ‘పహిల్వాన్‌’కు జిమ్‌ చేయాల్సి వచ్చింది. స్పోర్ట్స్‌ నాకు కొత్త కాదు కానీ జిమ్‌ కొత్తగా అనిపించింది.

మరి జిమ్‌ వల్ల కొత్తగా అలవర్చుకున్న విషయాలేమైనా?
మంచి ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్రపోవడం వల్ల కోరుకున్నట్టుగా బాడీ మారిపోతుంది. బ్యాలెన్స్‌తో ఉంటాం. నేను 89 ఉండేవాణ్ణి. ఇప్పుడు 74 కేజీలు ఉన్నాను. చాలా తేలికగా అనిపిస్తుంది. నా డ్రెస్‌లన్నీ మారిపోయాయి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అయితే నేను జిమ్‌కి ఎందుకు దూరంగా ఉంటానంటే.. రోజూ ఒకే టైమ్‌కి నిద్రలేవాలి. ఒక టైమింగ్‌ ప్రకారం జిమ్‌ చేయాలి. అది నాకు కష్టంగా ఉంటుంది (నవ్వుతూ). అదే స్పోర్ట్స్‌ అనుకోండి మన ఇష్టం వచ్చినప్పుడు ఆడుకోవచ్చు.

బరువు తగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అన్నారు. బరువుకి, కాన్ఫిడెన్స్‌కి సంబంధం ఏటి?
స్లిమ్‌గా ఉంటే స్క్రీన్‌ మీద సన్నివేశం కోసం షర్ట్‌ తీయాల్సి వచ్చినప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉంటాం. ఒక ఆర్టిస్ట్‌గా ఇలాంటి సీన్స్‌లో కాన్ఫిడెంట్‌గా కనిపించాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే.  నా సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. నా బలం నా విజయాలు. దానికి మించిన ఆత్మవిశ్వాసం ఏం ఉంటుంది? ఆ సంగతి అలా ఉంచితే ఫిట్‌నెస్‌ అనేది అందరికీ చాలా ముఖ్యమైనది. మెదడు షార్ప్‌గా ఉన్నట్టే బాడీ కూడా ఫిట్‌గా ఉంటే ప్లస్‌.

‘స్లిమ్‌’గా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. లావుగా ఉన్నవాళ్లను కొందరు ‘బాడీ షేమింగ్‌’ చేస్తుంటారు. దాని గురించి?
బాడీ షేమింగ్‌ తప్పు. అది ఆ మాటలు పడేవాళ్ల పర్సనాలిటీ కంటే షేమింగ్‌ చేసేవాళ్ల పర్సనాలిటీ ఏంటో చెబుతుంది. బరువుగా ఉన్నారే అనుకుందాం. వాళ్లకి ఏ ఇబ్బందీ లేకుండా ఉన్నప్పుడు మధ్యలో నీ సమస్య ఏంటి? అంత కఠినంగా ఎందుకు వాళ్లను హేళన చేయాలి. మనలోనే బోలెడు తప్పులు ఉంటాయి. బాడీ ఫిట్‌గా ఉండొచ్చు. కానీ బ్రెయిన్‌ సరిగ్గా లేకపోవచ్చుగా? మనం కామెంట్‌ చేసేవాళ్లకు ఫిట్‌ బాడీ లేదేమో. ప్రపంచంలోనే బెస్ట్‌ బ్రెయిన్‌    ఉంటే? అప్పుడు వాళ్లకన్నా మనం తక్కువే కదా.

ప్రస్తుతం నా బాడీ ఫిట్‌గా ఉండటం నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఎందుకంటే సల్మాన్‌ ఖాన్‌ సార్‌తో ‘దబాంగ్‌ 3’ సినిమా చేస్తున్నాను. ఇద్దరం షర్ట్‌ లేకుండా ఓ ఫైట్‌ సీన్‌ ఉంది. ‘పహిల్వాన్‌’ కోసం ఫిట్‌గా మారడం వల్ల ఆ ఫైట్‌ చేయగలి   గాను. íసినిమా యాక్టర్‌ని కాబట్టి నేను స్లిమ్‌గా ఉండటం అవసరం. అదే బయటివాళ్లు లావుగా ఉండి, వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోతే వాళ్లు కాన్ఫిడెన్స్‌గా ఉండొచ్చు. ఆరోగ్యానికి   మించిన ఆత్మవిశ్వాసం ఏం ఉంటుంది? అయితే నా ఉద్దేశం ఏంటంటే.. మనిషిగా ఉన్నంతకాలం వేరేవాళ్లను కామెంట్‌ చేయకూడదు. ఎందుకంటే మనిషి అంటేనే ఏదో ఓ వీక్‌నెస్‌ ఉంటుంది. అందుకే మనం మనుషులం. దాన్ని కవర్‌ చేసుకు   నేంత తెలివిని మనకు దేవుడు ఇచ్చాడు.

ప్రతి దశను ఎంజాయ్‌ చేస్తూ, సూపర్‌ స్టార్‌ స్టేజ్‌ని చేరుకునే క్రమంలో మీరు ఎన్ని చేదు అనుభవాలను దాటారు?
ఒక్క హౌస్‌ఫుల్‌ ఉంటే చాలు అని నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ఫస్ట్‌ సినిమా రిలీజ్‌ అప్పుడు థియేటర్‌లో 15 మంది ఉన్నారు సుమారుగా. ఆల్రెడీ రెండు మూడు సినిమాలు ఆగిపోయాయి కూడా. అయితే నిరాశపడలేదు. ఎందుకంటే లక్ష్యం అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండాలి.

మనం కూడా ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉండాలి. ఆలోచనల్ని ఎదగనిస్తూనే      ఉండాలి. ప్రస్తుతం ఉన్న మూమెంట్‌లో ఉండటం  నేర్చుకోవాలి. ప్రస్తుతంలో బతకలేనప్పుడు మన జీవితాల్లో గ్రోత్‌ ఎక్కడ ఉంటుంది? అందుకే అప్పటి ఆ చేదు అనుభవాలను నన్ను నేను ముందుకు పుష్‌ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. సంతోషం ఎక్కడో లేదు. మనలోనే     ఉంటుంది. వేరే వాళ్లలో వేరే వస్తువుల్లో వెతికితే ఫూల్స్‌ కిందే లెక్క.

మీ మాటలన్నీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.. బహుశా అనుభవాలు నేర్పించిన పాఠాలేమో?
అవును. టైమ్‌ ప్రతీది మనకు నేర్పిస్తుంది. అయితే ఆ టైమ్‌కి జరగాల్సినవి జరుగుతున్నప్పుడు ఆ మూమెంట్‌లో లేకపోవడం వల్ల గతంలో నేను చాలా విషయాలను మిస్‌ అయ్యాను. మా పాప ఎదగడాన్ని నేను గ్రహించే ముందే ఎదిగిపోయింది. సడెన్‌గా చూస్తే.. మన పాప ఇంత పెద్దది అయిపోయిందా అనిపిస్తుంది. నటుడిగా బిజీ అయిపోయి పాప ఎదిగే క్రమాన్ని ఆస్వా  దించలేదు. మన మూమెంట్‌ని ఎంజాయ్‌ చేయడం ముఖ్యం అని ఆ తర్వాత తెలిసింది.

హౌస్‌ఫుల్స్, వరుస బ్లాక్‌బస్టర్స్‌ చూస్తూనే ఉన్నారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు?
ఏదీ ఆశించడంలేదు. ప్రతి రోజూ ఉదయాన్నే లేవగానే ఇదే మన ఆఖరి రోజు అని ఫీల్‌ అయి పని చేయడమే. ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆఖరి రోజే అవుతుంది. నేను హీరో అవ్వాలనుకున్నాను. అసాధ్యం అన్నది చాలామంది అభిప్రాయం. కానీ అయ్యాను కదా (నవ్వుతూ). నన్ను నేను నమ్మాను. ప్రయత్నించాను. అయ్యాను.

నాకు సినిమాలంటే ఇష్టం. సినిమాల్లో ఉండాలనుకున్నాను. యాక్సిడెంటల్‌గా హీరో అయ్యాను. ఒకవేళ హీరోక ఆకపోయి ఉంటే.. సినిమా స్టూడియోల్లో కాఫీలు ఇస్తూ అయినా ఉండేవాణ్ణి. సినిమా అంటే అంత ఇష్టం. టాలెంట్‌ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లు ఇక్కడికి రాలేకపోయారు. నేను వచ్చాను కదా. ఇంకా ఏం కోరుకోవాలి? మనం వచ్చాం అని ఆనందం వేస్తుంది, భయం కూడా వేస్తుంది.

సినిమాల్లో రఫ్‌గా కనిపించే సుదీప్‌కి భయమా?
(నవ్వుతూ) భయమే ఒక మనిషిని కాన్ఫిడెంట్‌గా మార్చుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ భయాన్ని అధిగమించాలని కష్టపడుతుంటాం. నా ఇవాళ్టి భయాలు రేపటికి నా భయాలు కావు. ఎందుకంటే రేపు ఉదయానికల్లా దాన్ని అధిగమించేసి ఉంటాను కాబట్టి. అందరూ అలా ఆలోచించాలని కోరుకుంటాను. లేకపోతే జీవితాంతం పరిగెట్టడమే. ఎంతకాలం పరిగెడతావు? ప్రయత్నించు. ఒకటి అది నిన్ను ఓడించాలి లేదా నువ్వు దాన్ని ఓడించాలి. అంతేకానీ చేస్తే ఏమవుతుందో అనే ఆలోచనల్లో ఉండిపోకూడదు. కొన్ని టిని అంగీకరించాలి, కొన్నిటిని అధిగమించాలి.

అవునూ.. మీరు పుట్టినరోజు (సెప్టెంబర్‌ 2)లు చేసుకోరట? కారణం ఏంటి?
ఒకప్పుడు చేసుకునేవాడిని. ఆ తర్వాత అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఆపేశాను. నాక్కూడా మొదట్లో నా బర్త్‌డేను చాలామంది మధ్యలో జరుపుకోవాలని, పాపులర్‌ అవ్వాలి అని, పూలమాలలు, కటౌట్స్‌ ఏర్పాటు చేయాలనీ ఉండేది. అదంతా ఓ ఫేజ్‌. ఓ రోజు నా బర్త్‌డే హంగామా అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న పాప రోడ్డు మీద పడిపోయిన కేక్‌ ముక్కను ఏరుకొని తినడం కనిపించింది. ఆ దృశ్యం నన్ను చాలా బలంగా తాకింది. నాక్కూడా ఓ కూతురు ఉంది.

నా లగ్జరీ ఒకరికి ఒక పూట    తిండి. ఇక కేక్‌ కటింగులు, కటౌటులు వద్దనుకున్నా. ఫ్యాన్స్‌కి కూడా చెప్పాను. ఆ తర్వాతి సంవత్సరం ఇంట్లో లేకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాను. చాలా మంది తిట్టారు. కోపగించుకున్నారు. అంత దూరం నుంచి నీ ఇంటికి వస్తే ఇంట్లో లేకుండా వెళ్లిపోతావా? అన్నారు. అవన్నీ తీసుకున్నాను. రెండు రోజులు వాళ్లను తిట్టనిచ్చాను. ఆ తర్వాత ఓ వీడియో నా సోషల్‌  మీడియాలో పోస్ట్‌ చేశాను. ‘నన్ను సంతోషపెట్టడానికే మీరు ఇక్కడికి వస్తే నా కోసం ఏదీ తేవద్దు. అవన్నీ తీసుకొస్తానంటే నేను కలవను.

అంతగా ఇవ్వాలనుంటే ఓ కేక్‌ కొని మీ వీధిలో వాళ్లకు పంచండి. నన్ను ప్రేమిస్తే అలా చేయండి అన్నాను. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ తర్వాత అర్థమయింది. ఫ్యాన్స్‌ అందరూ మంచి పనులు చేయడం గమనించాను. ఒక్క రోజా పువ్వు కూడా తేలేదు. జీవితంలో ఒక స్టేజ్‌కి వచ్చాక పూలమాలలు, కటౌట్లు మనల్ని ఎగ్జయిట్‌ చేయవు. నేను అద్భుతాలు చేయలేకపోవచ్చు. కానీ నాకు ఉన్న దానిలో నాకు చేతనైనంత  చేయగలను. నాకోసం వృథా ఖర్చు చేయడం మానేశాను. నా దగ్గర ఉండేవన్నీ 200, 300 ఖరీదు గల వస్తువులే. నా బట్టలు కూడా అంతే.  200, 300 టీషర్ట్స్‌ వేసుకుంటాను.

మీ భార్య, మీ పాప ఏమీ అనరా?
నా వైఫ్‌ చాలా స్వీట్‌. నా కూతురు కూడా సింపుల్‌గా బతకడానికే ఇష్టపడుతుంది. చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతుంటుంది. లగ్జరీ లైఫ్‌ పట్ల ఆసక్తి చూపించదు. ఇద్దరూ సంప్రదాయాలకు విలువ ఇస్తారు.

ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై... ఇలా ఎక్కువ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు? ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?
 ఏదో ఒకరోజు ప్రతి ఒక్క హీరో ఆడియన్స్‌కి బోర్‌ కొడతారు. ఏదో ఒకరోజు ప్రతి హీరో వెనక్కి వెళ్లక తప్పదు. అలాంటప్పుడు మనకు పని ఉన్నప్పుడు వదులుకోకూడదు. నేను కష్టపడుతున్నాను అని అనుకోకూడదు. ఇష్టపడుతూ పని చేసినప్పుడే పనిని ఎంజాయ్‌ చేయగలం. వరుసగా పది ఫ్లాప్‌లు వచ్చినా ఓ హీరోకి ఏం కాదు. కానీ నీ కోసం ఎవరూ స్టోరీ రాయకపోతే మన పని అయిపోయినట్లే.

మన కోసం ఎవరూ స్టోరీ రాయడం లేదని తెలిసినప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఒకరు ఒక స్టోరీ ప్రిపేర్‌ చేసుకుంటున్నప్పుడు యాక్టింగ్‌ విషయంలో నీ పేరు ఒక్కసారి అయినా వారి ఆలోచనల్లోకి వచ్చి పోవాలి. దాని అర్ధం ఏంటంటే ప్రతి పాత్రకు నువ్వు సూట్‌ అవుతావని. అయితే ఒక్క విషయం ఏంటంటే.. నేను ఇండస్ట్రీకి ఖాళీగా వచ్చాను. సో.. నేను దేనికీ భయపడాల్సిన అవసరం లేదు.

కన్నడంలో స్టార్‌ హీరో అనిపించుకుని, తెలుగు ‘ఈగ’లో విలన్‌గా చేసిన అనుభవం గురించి?
ఆ సినిమా ప్రాసెస్‌ను ఎంజాయ్‌ చేయకుండా అయ్యో ఈ సినిమాలో మనం హీరో కాదు...  వెంటనే తెలుగులో హీరోగా పెద్ద సినిమా చేయాలి అని ఆలోచిస్తే కుదరదు. టిఫిన్‌ తినడానికి కూర్చుని దాన్ని ఆస్వాదించకుండా లంచ్‌కి ఆలోచిస్తున్నట్టుంటుంది. ఇడ్లీలు వడ్డించగానే ‘ఆ లంచ్‌ ఏంటి? అంటే.. ఆ ఇడ్లీ తయారు చేయడానికి నీ భార్య,  తల్లి లేక వేరే ఎవరో ఎంతో కష్టపడి ఉంటారు. దాన్ని తయారు చేయడానికి ఉదయాన్నే వాళ్లు నిద్రలేచి చేస్తే, దాన్ని ఆస్వాదించకుంటే వాళ్లను గౌరవించనట్టే లెక్క.

మీరు మీ వీక్‌నెస్‌లను ఎలా కవర్‌ చేసుకుంటారు?
నేను లుక్స్‌ పరంగా ది బెస్ట్‌ కాకపోవచ్చు. నా కంటే లుక్స్‌లో అద్భుతంగా ఉండేవాళ్లు ఉండొచ్చు. కానీ నేనెక్కడున్నా నా ప్రెజెన్స్‌ తెలిసేంత కాన్ఫిడెంట్‌గా ఉండగలను. మనకంటే బెస్ట్‌ వాళ్లతో పోల్చుకుని బాధపడటం ఎందుకు? బెటర్‌గా మారేందుకు కష్టపడదాం. అన్నీ అరచేతిలో ఉండి కూడా ఇంకా ఏదో కావాలని ఏడుస్తాం. అది పర్సనాలిటీ డిజార్డర్‌. ఆ వీక్‌నెస్‌ ఉంటే కష్టం. లక్కీగా నాకది లేదు. నాతో నన్ను పోల్చుకుని బెటర్‌ అవడానికి ట్రై చేస్తుంటాను. ఇతరులను పట్టించుకోను.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement