వండిపెట్టే వాళ్లను బాధపెడుతున్నామా?
మాధవ్ శింగరాజు
ప్రేమగా వడ్డించకపోతే... తినే వాళ్లకు, ప్రియంగా తినకపోతే... వండిపెట్టినవాళ్లకు మనసు చివుక్కుమంటుంది. అంతిమంగా దేవుడు హర్ట్ అవుతాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక దేవుడంటే ఉండే భక్తిశ్రద్ధలే, ఆహారం మీద కూడా ఉండాలి. రుచిగా వండి విస్తరి వెయ్యడం భక్తి అయితే... ఆవురావురుమని తినడం శ్రద్ధ అవుతుంది.
క్షుద్బాధలో దేవుడు కనిపిస్తాడు. క్షుద్బాధను తీర్చడంలో దైవసాక్షాత్కారం కలుగుతుంది. అడిగి అడిగి పెట్టమని ఆర్యులు చెప్పినా, మాటల మెతుకులు చిందకుండా మౌనంగా తినమని మన పెద్దవాళ్లు చెప్పినా ఇందుకే. ఇవి రెండూ దైవకార్యాలు. వీటి విషయంలో నిర్లక్ష్యంగానీ, అలక్ష్యంగానీ ఉండకూడదు. వేడివేడి అన్నం కంచంలో మన కోసం ఎదురు చూస్తూ ఉంటే... మనం టీవీ చానళ్లను వేళ్లతో కలుపుకుంటూనో, స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ని కదుపుకుంటూనో ఉండడం అంటే దేవుణ్ణి మన కోసం వెయిట్ చేయించడమే. ఎంత అపరాధం! మామూలు అపరాధం కాదు, ఆయన్ని ఆకలితో ఉంచినంత అపరాధం. ఇద్దరం కలసి భోంచేద్దాం ఆగమని చెప్పి, ఆయనతో ఒక సెల్ఫీ దిగి, ‘భోజనానికి మా ఇంటికి దేవుడొచ్చాడు చూడండహో’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, లైకుల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడమంత అపరాధం.
స్మార్ట్ ఫోన్‌లు వచ్చాక మనుషులు ‘ఫీల్’ అవడం మానేసి ‘పోస్ట్’ అవుతున్నారు! భోజనం విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. రెస్టారెంట్‌లకు వెళ్లిన వాళ్లు ఘుమఘుమల్ని ఆస్వాదించడం మాని, ఫుడ్ ఐటమ్స్‌ని క్లిక్‌మనిపిస్తున్నారట. ఇలా భోజనంపై ధ్యాస లేకుండా, ఫొటోలు తీసుకుని సోషల్ మీడియా సైట్‌లకు పోస్ట్ చేసే ధోరణిని ‘ఫుడ్ పోర్నోగ్రఫీ’ అని అంటున్నారు హెస్టన్ బ్లుమెంథాల్. ఇది ఆయన అసహనంగా అన్న మాట కాదు. అవేదనతో అన్నది. ఫుడ్డు జిహ్వ చాపల్యం కలిగిస్తుంది. పోర్నోగ్రఫీ దేహ చాపల్యాన్ని రేపుతుంది. ఈ రెంటినీ కలిపి జీర్ణించుకోవడం ఇండియన్స్‌గా మనకి కష్టం కాబట్టి ‘ఫుడ్ పోర్నోగ్రఫీ’ అనే హెస్టన్ మాటకు ‘ఆహారంతో ఆటలాడడం’ అనే అర్థం చెప్పుకుందాం.
హెస్టన్ బ్రిటన్‌లో పేరున్న చెఫ్. ఆ దేశంలోని అతిపెద్ద నాలుగు రెస్టారెంట్‌లలో ఆయనదీ ఒకటి. పేరు ‘ఫ్యాట్ డక్’. ఈమధ్య ఆయన తన రెస్టారెంట్‌లో కఠినమైన నిబంధన ఒకటి పెట్టారు. ‘తినడానికి వచ్చిన వారు తినడం మాత్రమే చేయాలి. తినే ఐటమ్స్‌ని ఫొటోలు తీసుకోడానికి లేదు’ అని. తిరుమల గర్భగుడిలో మనల్ని ఫొటోలు తియ్యనివ్వరు కదా... అలా! ఈ నిబంధన కొందరు కస్టమర్లకు మింగుడు పడలేదు. ‘‘ఫొటోలు తీసుకుంటే మీకొచ్చిన నష్టం ఏమిటి?’’ అని అడిగారు.
‘‘నష్టం కాదు, అవమానం’’ అంటారు హెస్టన్. ‘‘ఎంతో కష్టపడి, రుచికరంగా వండి, వేడివేడిగా మీ టేబుల్ మీదికి తీసుకొస్తాం. ఆ వేడి మీద మీరు ఆబగా తింటుంటే మాకు తృప్తిగా ఉంటుంది. అలా కాకుండా తాపీగా ఫొటోలు తీసుకుంటూ... తినేందుకు తాత్సారం చేస్తుంటే మమ్మల్ని అవమానించినట్లే ఫీల్ అవుతాం’’ అని ఎంతో బాధగా చెప్తారు హెస్టన్. ఆయన దగ్గర ఇంకో పాయింట్ కూడా ఉంది. ‘‘మీరిక్కడ ఫొటోలు తీసుకుంటుంటే, మీ పక్క టేబుళ్ల మీది భోజన ప్రియుల ఆరగింపు దీక్షకు భంగం కలక్కుండా ఎలా ఉంటుంది? ’’అంటారు హెస్టన్.
మాలెక్యులర్ గ్యాస్ట్రానమీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు హెస్టన్. రుచికరంగా వండడం ఎలాగో, రుచికరంగా తినడం ఎలాగో నేర్పించే శాస్త్రం అది. అవి రెండూ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టే భోజన మర్యాదలకు ఆయన అంత విలువ ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే హెస్టన్‌ను బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాల్లోని పెద్ద పెద్ద రెస్టారెంట్‌ల యజమానులు అనుసరిస్తున్నారు. ‘నో ఫ్లాష్ ప్లీజ్’ అని డైనింగ్ హాళ్లలో బోర్డులు పెడుతున్నారు. మరి కస్టమర్లు తగ్గిపోరా? ‘‘పోనివ్వండి, మా కిచెన్ గౌరవాన్ని మాత్రం తగ్గనివ్వం’’ అంటున్నారు ఈ స్టార్ చెఫ్‌లంతా.
చిన్న సందేహం. ఇదే గౌరవాన్ని మన ఇంట్లో వాళ్లు కూడా కోరుకుంటున్నారా?! ‘చేసి పెట్టిన వంటను బాగుందని మెచ్చుకోనవసరం లేదు... ఏ ధ్యాసా లేకుండా తింటే చాలు’ అని గానీ అనుకోవడం లేదు కదా? ఎలా తెలుస్తుంది! స్మార్ట్ ఫోన్లు పైపైన కనిపించే పప్పు దినుసులను మాత్రమే ఫొటో తియ్యగలవు. వంట తయారీకి ఖర్చయిన శ్రమను, అందులో కలగలిసి ఉన్న లవ్ అండ్ అఫెక్షన్‌ను అవి క్యాచ్ చెయ్యలేవు. ఎలా?!