మేన్లీగా... మేనుకు హాయిగా...
ముస్తాబు
ఎండ చుర్రుమంటుంటే!
చెమట చుట్టమై, ఉక్కపోత నేస్తమై ఆప్యాయంగా అంటిపెట్టుకుని ఉండే కాలం. వంటి మీద దుస్తుల్ని మించిన శతృవులు లేవనిపించే కాలం. వేసవి అంటేనే వేడికి విడిది. ఈ సీజన్‌లో ఫ్యాషన్లను అనుసరించడమంటే... మంటేనంటారు చాలా మంది. అయితే అటు సమ్మర్‌పై వార్ చేస్తూనే ఇటు ఫ్యాషన్ల హుషార్ అనిపించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు ప్రసిద్ధ డిజైనర్ సాహిల్‌గులాటి. మేనును మెరిపించే ఫ్యాషన్లను ‘మే’నెలలో కూడా హాయిగా ఫాలో అయిపోవచ్చునంటున్నారు.
చెమటకు చెక్... చొక్కా...
పొడుగు చేతుల చొక్కా మరీ అలవాటైతే తప్ప ఈ సీజన్‌లో వదిలేయడం మంచిది. మరీ ఫ్యాషన్‌ను అనుసరించే వారు కాకపోతే... టైట్ ఫిట్ షర్ట్స్‌కు బదులు కొంచెం వదులుగా ఉండేవి వాడవచ్చు. ఫ్యాషన్ ప్రియుల కోసం స్మాల్ ప్రింట్స్, ఫ్లోరల్ ప్రింట్స్, జామెట్రికల్ ప్రింట్స్ వంటి వెరైటీలు తాజా ట్రెండ్ గా, సీజన్‌కు నప్పేలా అందుబాటులోకి వచ్చాయి. వేసవిలో హాయిగా ఉండవచ్చు కానీ ప్రస్తుతం కుర్తా ఫ్యాషన్ కాదని గమనించాలి. టీషర్ట్స్ ధరించేవారు స్లిమ్‌ఫిట్, రౌండ్‌నెక్‌ను ఎంచుకోవచ్చు.
చల్లదనానికి ఫ్యా‘బ్రిక్స్’...
ఈ సీజన్‌లో సిల్క్‌లూ, సింథటిక్‌ల జోలికి పోకపోవడం ఎంతైనా ఉత్తమం. ఒకప్పుడైతే కాటన్‌ను మించి సమ్మర్‌కు నప్పే ఫ్యాబ్రిక్ మరొకటి లేదు కాని... ఇప్పుడు మరికొన్ని కూడా దానితో పోటీపడుతూ సమ్మర్‌ను ఫ్యాషనబుల్‌గా మారుస్తున్నాయి. అలాంటివాటిలో లినెన్‌ది అగ్రస్థానం. లినెన్‌తో తయారైన దుస్తులు అటు చల్లదనాన్ని అందిస్తూనే ఇటు ఫ్యాషన్‌కూ పెద్ద పీట వేస్తున్నాయి. కాటన్, లినెన్ తర్వాత ఎంచుకోదగ్గ ఫ్యాబ్రిక్ వాయిల్.
లేత రంగులే... లే‘టేస్టు’గా...
ఎండాకాలంలో ధరించే దుస్తులకు సంబంధించి రంగులను ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. ముదురు రంగులకు గుడ్‌బై చెప్పి లేతరంగులనే ఎంచుకోవాలి. అంతమాత్రాన తెలుపు వంటి ఒకటీ అరా రంగులకే పరిమితం కావాలని అనుకోవద్దు. ప్రస్తుత ఫ్యాషన్‌లకు అనుగుణంగా, విభిన్న రకాల లైట్-బ్రైట్ కలర్స్ సీజన్‌కు తగ్గట్టు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ... ఇంకా పలు నియోన్ కలర్స్‌ను వినియోగించవచ్చు. వేసవికి నప్పే రంగుల్లో నెంబర్‌వన్ అయిన తెలుపును అంతగా ఇష్టపడని వారు మిల్క్‌వైట్‌కు ఓటేయవచ్చు.
షార్ట్ అండ్ కూల్...
కాస్త ఆధునికంగా డ్రెస్ చేసుకోవడం అలవాటైన వారైతే హాయిగా షార్ట్స్‌కు జైకొట్టవచ్చు. ఇప్పుడు రకరకాల బెర్ముడాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అటు ఫ్యాషనబుల్‌గానూ, ఇటు సీజన్‌కు సరిగ్గా సరిపోయేట్టుగానూ ఇవి ఉపకరిస్తాయి. ఈ షార్ట్స్‌లో కాటన్, లినెన్ మాత్రమే కాకుండా డెనిమ్ ఫ్యాబ్రిక్‌లో కూడా వెరైటీలున్నాయి. ఇక ట్రౌజర్స్ విషయానికి వస్తే... తెలుపు, బేజ్, మస్టర్డ్, క్రీమ్, బ్లూ... రంగుల్లో కాటన్, లినెన్, ఫేడెడ్ డెనిమ్స్ నుంచి ఎంచుకోవచ్చు.
అవీ ఇవీ...
కాళ్లకు చెప్పులు కేవలం రక్షణ మాత్రమే కాదు వేసవిలో అత్యవసరం కూడా. పాదరక్షలు అటు మన ఫ్యాషన్ స్పృహను కూడా పరిరక్షించాలంటే క్యాజువల్ శాండిల్స్‌తో పాటు లోఫర్స్, స్నీకర్స్ వంటి వాటికి ఓటేయాలి. అలాగే తక్కువ హెయిర్, పొట్టిజుత్తులే ఈ సీజన్‌కు నప్పేవి. అలా కాదు లాంగ్‌హెయిర్ తప్పదంటే పోనీటెయిల్‌ని ట్రై చేయవచ్చు. అటు ఫ్యాషన్, ఇటు సీజన్ రెండూ సమన్వయం చేసుకోవాలంటే స్పైక్ స్టైల్ హెయిర్‌కి జై కొట్టాల్సిందే.
స్పైక్‌లో విభిన్న రకాల వెరైటీలున్నాయి కాబట్టి... తమ తమ అభిరుచులకు, ముఖవర్ఛస్సుకు తగ్గట్టు ఎంచుకోవచ్చు. క్లీన్‌షేవ్ లేదా యాక్సెసరీస్ విషయానికి వస్తే సహజంగానే అతి తక్కువగా ఫంకీగా ఉండే జంక్ జ్యుయలరీని వాడాలి. గోల్డ్ చెయిన్‌లు, బ్రాస్లెట్‌ల వంటివి ఈ కాలానికి నప్పవు. ఉడెన్ జ్యుయలరీని ఎంచుకోవచ్చు.
ఇప్పుడు ఫ్యాషన్ పరంగా ఆకట్టుకుంటున్న క్లచ్‌బ్యాగ్స్‌ను వినియోగిస్తే అటు మోడ్రన్‌గానూ, ఇటు ఉపకరించే యాక్సెసరీగానూ ఉంటుంది. మగవాళ్లకు క్యాప్స్ ధరించేందుకు సమ్మర్ ఒక అద్భుతమైన అవకాశం. ఈ సీజన్‌లో దాదాపు రోజంతా క్యాప్ పెట్టుకున్నా లుక్ ఓకె అనిపిస్తుంది. ఇక చివరిదైనా చాలా ముఖ్యమైనవి గాగుల్స్. అతినీల లోహిత కిరణాలు కంటికి హాని చేయకుండా ముఖానికి నప్పే గాగుల్స్‌ని తప్పనిసరిగా వినియోగించాల్సిందే.
- ఎస్. సత్యబాబు