మారు మనువుకోసం మతం మారడం శిక్షార్హమే!
కేస్ స్టడీ
అజయ్ సుమలది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇద్దరివీ మంచి ఉద్యోగాలే. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఏమైందో ఏమో అజయ్ తన క్లాస్‌మేట్ రజియాతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆమె అతని మాజీ ప్రేయసి. పెద్దలు వివాహానికి అంగీకరించకపోతే గత్యంతరం లేక సుమను పెళ్లాడాడు అజయ్. రజియా ఒక ఎన్నారైని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. తన భర్త దుర్మార్గుడనీ, అతనితో ఉండలేక, అజయ్‌ని మరువలేక విడాకులిచ్చి ఎంచక్కా ఇండియాకు వచ్చాననీ అజయ్‌ని కూడా సుమకు విడాకులివ్వమని వత్తిడి చేయసాగింది.
రజియాతో చాటుమాటుగా సంసారం చేస్తున్నాడుగానీ, సుమకు విడాకులిచ్చే ధైర్యం చేయలేకపోయాడు అజయ్. పైగా కోర్టులు, వరకట్నపు కేసులు, బైగమీ కేసులంటే భయం. ఇటువంటి సమయంలో ఒక ఐడియా వచ్చింది అజయ్‌కు. ముస్లింలు నాలుగు వివాహాలు చేసుకోవచ్చనీ, వారి పర్సనల్ లా ప్రకారం అది తప్పుకాదని. ఇంకేం, తనకు హిందూమతం అంటే నమ్మకం లేదని, ఇస్లాంమతం స్వీకరిస్తానని సుమదగ్గర చెప్పడం ప్రారంభించాడు. అతని ఆంతర్యం అర్థం కాని సుమ మౌనంగా ఉండిపోయింది. త్వరగానే అజయ్ మతం మారాడు. మరో పదిరోజుల్లో తను రజియాను పెళ్లిచేసుకున్నానని కుండబద్దలు కొట్టేశాడు.
ఇంత మోసం జరుగుతుందని ఊహించలేదు. నయవంచనకు లోనైన బాధతో న్యాయవాదిని కలిసింది సుమ. మతమార్పిడి బహుభార్యత్వానికి పర్మిషన్ ఇస్తుందా? అది కూడా మతంపై ప్రేమతో కాదు, రెండోపెళ్లిపై మోజుతో అది సాధ్యమవుతుందా? అని అడిగింది. న్యాయవాది సుమకు ధైర్యం చెప్పి, మహమ్మదీయ వివాహాల గురించి స్పష్టత కలిగించారు. షరియత్ లా ప్రకారం పోషించగలిగిన స్తోమత కలిగి, అందరినీ సమానంగా ఆదరించగలిగిన పురుషుడు మాత్రమే ఒకరికన్నా ఎక్కువమందిని వివాహమాడవచ్చును.
అందువల్ల వివాహితుడైన అన్యమతస్థుడు తన భార్యకు విడాకులివ్వకుండా, ఇస్లాం మతం స్వీకరించి, మరొక స్త్రీని వివాహం చేసుకోవడం చెల్లదు. అతడు బహుభార్యత్వం కింద శిక్షార్హుడే. అతని మొదటి వివాహం కూడా ఇస్లాం ప్రకారం జరిగితే బైగమీ నుండి మినహాయింపు ఉంటుందని తెలియజేశారు. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది సుమ. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసుల్లో స్పష్టం చేసింది.