
భక్తి త్యాగాల ప్రతీక
బక్రీద్ పండుగ వస్తూనే మనకొక మహత్తరమైన సంఘటన గుర్తుకు తెస్తుంది. దేవుని ప్రియ ప్రవక్త హ॥(అ) తన ఏకైక సంతానాన్ని దైవానికి సమర్పించుకున్న అపూర్వ...
- ఇస్లాం వెలుగు- సందర్భం-5న బక్రీద్
బక్రీద్ పండుగ వస్తూనే మనకొక మహత్తరమైన సంఘటన గుర్తుకు తెస్తుంది. దేవుని ప్రియ ప్రవక్త హ॥(అ) తన ఏకైక సంతానాన్ని దైవానికి సమర్పించుకున్న అపూర్వ, చారిత్రక సన్నివేశం ఒక్కసారిగా హృదయంలో కదలాడుతుంది. నేటికి దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ప్రస్తుత ఇరాక్ దేశంలో ఇబ్రహీం జన్మించారు. ఆ రోజుల్లో నమ్రూద్ అనే రాజు తాను సూర్యచంద్రుల వంశానికి చెందినవాడిననీ, దైవాంశ సంభూతుడిననీ ప్రకటించుకుని నిరంకుశంగా పాలన సాగిస్తుండేవాడు. అలాంటి వాతావరణంలో ఇబ్రహీం, నమ్రూత్ రాజు స్వయం కల్పిత దైవత్వాన్ని వ్యతిరేకించడంతో ఇబ్రహీంకు దేశ బహిష్కార శిక్ష విధిస్తాడు.
దీంతో ఇబ్రహీం దంపతులు దైవ సందేశాన్ని ప్రచారం చేస్తూ మక్కా చేరుకుంటారు. వయసు పైబడుతున్న కొద్దీ తన తదనంతరం సందేశ కార్యభారాన్ని నిర్వర్తించడానికి సంతానం ఉంటే బాగుంటుందని ప్రార్థన రూపంలో ఇబ్రహీం, దేవునికి విన్న వించుకుంటారు. దైవం ఆయన వేడుకోలును మన్నించి పండంటి మగ బిడ్డను ప్రసాదిస్తాడు.
అయితే దేవుడు ఆయనకు మరో పరీక్షను పెడతాడు. భార్యను, కొడుకును జన సంచారం లేని ఎడారిలో వదిలేసి రమ్మంటాడు. అలాగే చేస్తాడు ఇబ్రహీం. దైవాదేశానుసారం ఆయన అలా వారిని వదిలేసి వెళుతుంటే, భార్య హాజీరా (అ) ‘‘నన్ను, నా బిడ్డను నిస్సహాయస్థితిలో ఇలా వదిలేసి వెళ్లిపోతున్నారేమిటి?’’ అని ప్రశ్నిస్తుంది. ‘‘ఇది దైవాజ్ఞ’’ అంటారు ఇబ్రహీం. నాలుక తడుపుకోడానికి సైతం చుక్క నీరు కరువైన ఆ ప్రదేశంలో చిన్నారి ఏడుస్తూ కాళ్లతో భూమిని రాసిన చోట దైవాజ్ఞతో అక్కడ ఒక నీటి ఊట వెలుస్తుంది. ‘జమ్ జమ్’ అనే పేరు గల ఆ నీటితోనే ఆనాడు ఆ తల్లీబిడ్డలు తమ దాహం తీర్చుకుంటారు. ఆ నీటినే ఈనాటికీ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ ‘అబెజంజం’గా సేవిస్తున్నారు. (ఆనాటి నిర్జీవ ఎడారి ప్రదేశమే నేడు సుందర మక్కా నగరంగా రూపాంతరం చెంది, ప్రపంచ ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది).
తర్వాత కొంతకాలానికి దైవాదేశం మేరకు ఇబ్రహీం మక్కా తిరిగొచ్చి భార్యాబిడ్డల్ని కలుసుకుంటారు. తనయుడు ఇస్మాయిల్‌తో కలసి కాబా గృహాన్ని నిర్మిస్తారు. అయితే తర్వాత దైవం ఆయనకు మరో పరీక్ష పెడతాడు! అది మామూలు పరీక్ష కాదు. మానవజాతి చరిత్రలోనే కనీవినీ ఎరుగని పరీక్ష. ఈసారి దైవం ఏకంగా కన్న కొడుకునే త్యాగం చేయమని ఇబ్రహీంను స్వప్నంలో ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు కూడా ఇబ్రహీం వెనుకా ముందూ ఆలోచించకుండా భార్యను సంప్రదిస్తారు. ఆమె సంతోషంగా అంగీకరిస్తారు. తనయుణ్ణీ సంప్రదిస్తారు. అతడూ అంగీకరిస్తాడు.
ఆ తర్వాత తండ్రీకొడుకులిద్దరూ నిర్ణీత ప్రదేశానికి వెళ్లి దైవాదేశ పాలనకు ఉపక్రమించగానే, దేవుని ప్రసన్నత పతాక స్థాయికి ప్రసరిస్తుంది. ‘‘నా ప్రియ ప్రవక్తా.. ఇబ్రహీం! నువ్వు కేవలం స్వప్నంలో చూసిన దానినే నిజం చేసి చూపించావు. నా ఈ పరీక్షలో నీవు అగ్రశ్రేణిలో ఉత్తీర్ణత సాధించావు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలి తతంగంతో నాకు నిమిత్తం లేదు. ఇప్పుడు మీరు పూర్తి విశ్వాసులైపోయారు. అందుకని ఈ శుభ సందర్భంగా మీ త్యాగశీలతకు గుర్తింపుగా నా స్వర్గం నుండి ఒక దుంబాను పంపుతున్నాను’’ అని అదృశ్యవాణి పలుకుతుంది. వెంటనే ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రె పొట్టేలు ప్రత్యక్షమౌతుంది. దాన్ని జుబహ్ చేస్తారు హజ్రత్ ఇబ్రహీం(అ).
నేడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు జరుపుకుంటున్న ఈదుల్ అజ్ హా (బక్రీద్) పండుగ ఆ మహనీయుల త్యాగ స్మరణే. అదే రోజు సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో హజ్ ఆరాధన జరుగుతుంది.
- యం.డి.ఉస్మాన్‌ఖాన్