భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్‌లో ఘుమఘుమలను వెదజల్లే తాజ్ హోటల్ హైదరాబాదీల నోటికి రుచికరమైన వంటలు అందిస్తోంది. ఈ హోటల్ ప్రయాణం ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. గోల్డ్ షాపులు, పాదరక్షల దుకాణాలు, స్కూల్స్‌తో నిత్యం అబిడ్స్‌ప్రాంతం రద్దీగా, హడావుడిగా కనిపించేది, ఇప్పటికీ అలాగే కనిపిస్తోంది. అందుకే ఈ హోటల్ విజయ ప్రయాణం సాఫీగా సాగింది.
నిత్యం జనంతో...
ఈ హోటల్‌లోకి అడుగుపెట్టగానే గలగలమంటూ కబుర్లు వినిపిస్తాయ. నిత్యం జనాలతో నిండుగా కళకళలాడుతూ కిటకిటలాడుతూ కనిపించే ఈ హోటల్‌లో భోజన ప్రియులు అన్నం తింటూ, మరికొందరు గప్‌చుప్‌లు తింటూ కనిపిస్తారు. కాలేజీ విద్యార్థులు, మధ్యవయస్కులు, మహిళలు, మగవారు ఒకరేమిటి... హడావుడిగా ఉండే వృత్తి వ్యాపారుల నుంచి వృద్ధుల దాకా అందరూ ఇక్కడి భోజనం రుచి చూడాల్సిందే. ఇంటి నుంచి దూరంగా ఉండే విద్యార్థులకు తాజ్ హోటల్ అమ్మ చేతి భోజనాన్ని తలపిస్తుంది. ఆప్యాయతకు చిరునామాగా మారింది నిలిచిన అబిడ్స్ బ్రాంచి తాజ్‌లో భోజనం చేయడానికి భాగ్యనగరవాసులు ఆసక్తి చూపుతారు.
పొట్ట చేత పట్టుకుని, ఉడిపి నుంచి భాగ్యనగరానికి వచ్చిన ఆనందరావు, ఫుడ్ ప్రొడక్షన్‌లో నైపుణ్యం సంపాదించిన బాబురావుతో కలిసి 1942లో సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం దగ్గర చిన్నప్రదేశాన్ని అద్దెకు తీసుకుని ‘అంబా భవన్’ అని పేరుపెట్టి వ్యాపారం ఆరంభించారు. కొంతకాలానికే బాబూరావు సోదరుడు సుందర్ రావు కూడా చేరడంతో ముగ్గురూ కలిసి 1948లో సికింద్రాబాద్‌లో తాజ్‌హోటల్ ప్రారంభించి, 1950 నాటికి ఆబిడ్స్‌లో మరో బ్రాంచి ప్రారంభించే స్థాయికి చేరుకుంది వ్యాపారం అంటారు సుందర్‌రావు కుమారుడు చంద్రశేఖర్ రావు.
నాటి నుంచి నేటి వరకు...
ఆదివారాలు, స్కూల్ సెలవు రోజుల్లో తండ్రితో కలిసి హోటల్‌కి వచ్చేవాడినని చంద్రశేఖరరావు బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు. మసాలాల ఘాటు లేకుండా, సాత్త్వికంగా ఉండే ఆహారం తాజ్ ప్రత్యేకత కావడంతో ఇక్కడ భోజనం చేయడానికి అందరూ ఆసక్తి చూపేవారు. అందరికీ అందుబాటులో లభించే దక్షిణాది భోజనం అందించాలన్నదే వీరి లక్ష్యం. రెడీమేడ్‌గా దొరికే మసాలాలను నేటికీ వీరు ఉపయోగించట్లేదు.
నేటికీ అదే కాఫీ పొడి...
మొదటి రోజు నుంచి నేటివరకు అదే కాఫీ రుచి, అదే కాఫీ పొడి. ఆరు దశాబ్దాలుగా ఒకే అమ్మకం దారు దగ్గర కాఫీ పొడి కొనుగోలు చేస్తూ, కాఫీ ప్రియులను ఆకర్షిస్తోంది తాజ్. పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం వీరి ప్రత్యేకత. హోటల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కస్టమర్లను ప్రేమగా పలకరిస్తూ, పెదవుల మీద చెక్కుచెదరని చిరునవ్వుతో కొసరి కొసరి వడ్డిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు సేవల విషయంలో ఎటువంటి మార్పు లేదు.
ఇది పుట్టిల్లు...
సెలబ్రిటీలకు తాజ్ హోటల్ పుట్టింటితో సమానమంటారని చెబుతారు చంద్రశేఖరరావు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ తనకు ఇష్టమైన బటన్ ఇడ్లీ, సాంబారు కోసం ఇక్కడకు వచ్చి ఈ హోటల్‌లోనే సేద తీరేవారని గుర్తుచేసుకుంటారు చంద్రశేఖర్. అక్కినేని నాగేశ్వరరావు, జమున వంటి వారికి ఇక్కడకు వస్తే, సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుందని అనేవారట. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు మెథడిస్టు స్కూల్‌లో జరిగినప్పుడు, తాజ్ హోటల్ వారే క్యాటరింగ్ చేశారంటారు చంద్రశేఖరరావు.
రెండో తరం వివాహాలూ ఇక్కడే...
దశాబ్దాల క్రితం రూఫ్ గార్డెన్‌లో వివాహం చేసుకున్నవారు, వారిపిల్లల వివాహాలు కూడా ఇక్కడే చేయడం చాలా ఆనందం అంటారు చంద్రశేఖరరావు. హోటల్ ముందర ఉన్న చెట్టుని అదృష్ట వృక్షంగా భావిస్తారని, ఆ చెట్టు కింద నిలబడి భూ వ్యవహారాలు మాట్లాడుకున్నవారికి మంచి జరిగిందని , ఇక్కడే పెళ్లిసంబంధాలు కూడా నిశ్చయించుకున్నారని చెబుతారు వారు.ఇప్పుడు చంద్రశేఖర్ కుమారుడు ఆదిత్య, ఆదర్శ్‌లు కలిసి ఈ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తున్నారు. వారి నరాలలో రక్తానికి బదులు సాంబారు ప్రవహిస్తోందని చెబుతారు వీరు. ఆ మాట నూటికి నూరు శాతం నిజం అంటారు వినియోగదారులు.
Comments
Please login to add a commentAdd a comment