ఏమండీ డాగ్ గారూ... కాస్త టీ తాగుతారా?
కొత్త వస్తువు
పై వాక్యం సరదా కోసం రాసింది కాదు. నిజ్జంగానే నిజం! ఇంతకీ విషయం ఏమిటంటే, బ్రిటీష్ కంపెనీ ఒకటి శునకాల కోసం ప్రత్యేకమైన టీ బ్యాగులను తయారుచేసింది. ఏడు వెరైటీలతో తయారుచేసిన ఈ టీ బ్యాగులు శునకాల ఆరోగ్యానికి మేలు చేస్తాయని, ముఖ్యంగా తాజా శ్వాసకు ఈ టీ బ్యాగులు ఉపయోగపడతాయని ‘వూఫ్ అండ్ బ్రూ’ కంపెనీ చెబుతోంది.
‘‘ఇప్పటికే యజమానుల నుంచి టీ బ్యాగులకు మంచి స్పందన వస్తోంది’’ అంటున్నాడు టీ బ్యాగుల సృష్టికర్త స్టీవ్ బెన్నెట్. నలభై ఎనిమిది సంవత్సరాల స్టీవ్‌కు బిల్లి, ఏంజెల్ అనే ముద్దుగారే శునకాలు ఉన్నాయి. వాటికి ఆయన తయారుచేసిన టీ తెగ నచ్చేసిందట. దాంతో ఇప్పటి వరకు రెండు వందలకు పైగా శునకాలకు ఈ టీ రుచి చూపించాడు స్టీవ్. ‘‘మొదటి ఆమోదం నా పెంపుడు శునకాల నుంచి లభించింది. ఇక తిరుగు లేదు అనిపించింది’’ అని మురిసిపోతున్నాడు స్టీవ్. విశేషమేమిటంటే శునకాల కోసం ప్రత్యేకంగా కెఫేలు పెట్టడం గురించి కూడా ఆలోచిస్తున్నాడు స్టీవ్.
‘‘నేను టీ తాగుతున్నప్పుడల్లా మా శునకం ఆశగా నా వైపు చూసేది. కానీ ఎలా తాగిస్తాం? టీలో ఉండే కెఫిన్, పాలు వాటి ఆరోగ్యం మీద దుష్ర్పభావాన్ని కలిగిస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం భేషుగ్గా వాటితో టీ తాగించవచ్చు’’ అంటున్నాడు ఒక యజమాని ఆనందంగా. కాగా, ఈ ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే సన్నాహాల్లో ఉంది ‘వూఫ్ అండ్ బ్రూ’ కంపెనీ.
‘అతిథి మర్యాదలు’లాగే రాబోయే రోజుల్లో ‘శునక మర్యాదలు’ కూడా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించవచ్చు. అంటే ఏమీ లేదు, మీ పొరుగింటాయన తన శునకంతో సహా మీ ఇంటి వచ్చినప్పుడు ఆ శునకం కోసం ప్రత్యేకంగా టీ కాచి ఇవ్వడమన్నమాట!