
ఆ నేడు 2 అక్టోబర్, 1869
మనలోకి మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రయాణం నుంచి తిరిగొస్తూ కొన్ని ‘పాఠాలు’ వెంట తీసుకురావాలనుకున్నప్పుడు .....
మహాత్ముడు పుట్టిన దేశం...
మనలోకి మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రయాణం నుంచి తిరిగొస్తూ కొన్ని ‘పాఠాలు’ వెంట తీసుకురావాలనుకున్నప్పుడు మహాత్ముడి చరిత్రను కళ్లకద్దుకొని చదవాలి. మనలో కొత్త వెలుగొకటి ప్రసరించినట్లు అనిపిస్తుంది. అది మహిమాన్వితమైన వెలుగు. జీవితంలో మనకు దారి చూపే వెలుగు. మనిషి మహాత్ముడుగా ఎలా మారతాడు అనడానికి గాంధీజీ జీవితం ఒక ఉత్తేజిత ఉదాహరణ. ‘పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది’ అనే మాటకు అక్షరాలా సరిపోయే జీవితం ఆ మహాత్మునిది. గాంధీజీ తండ్రి కరమ్‌చంద్ గాంధీ పోర్‌బందర్ సంస్థానంలో ‘దివాన్’గా పని చేశాడు.
ఆర్థికంగా సామాజికంగా అంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా పేదవాడి గురించి ఆకలి గురించి నిరాడంబరతలోని ఔన్నత్యం గురించి ఆలోచించినవాడు గాంధీజీ. శత్రువును ఓడించడానికి కావాలసింది హింస కాదు అహింస అని ప్రకటించి ఆయన అందించిన ఆ ఆయుధం మరింత గట్టిగా మరింత దృఢంగా స్వీకరించాల్సిన అవసరం ఇవాళ ప్రపంచ మానవాళి అంతటికీ ఉందని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. హింస ఉన్న ప్రతి చోటా విరుగుడుగా గాంధీజీ మాట అవసరం ఉంది. విలువలు పతనమైన ప్రతి చోటా విరుగుడుగా ఆయన అనుసరించిన మార్గం అవసరం ఉంది. మానవత్వం మృగ్యమైన ప్రతి చోటా విరుగుడుగా ఆయన ప్రసరింపజేసిన అవసరం ఉంది. అక్టోబర్ 2 ఒక తేదీ మాత్రమే. వాస్తవానికి ఆయన నిత్య స్మరణీయుడు.