హింసకు దారి తీసిన (వాట్సాప్) సోనియాగాంధీ ఫోటో..
జబల్పూర్ః కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభ్యంతరకర ఫోటో వాట్సాప్ లో కనిపించడం హింసాత్మకంగా మారింది. పోలీస్టేషన్ కు చేరిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చినికి చినికి గాలివానై ఒకరి మృతికి కారణమవ్వడంతోపాటు ఆరుగురు తీవ్రంగా గాయపడేట్టు చేసింది.
జబల్పూర్ లో రెండు వాట్సాప్ వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో ఒకరు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి చెందిన ఓ అభ్యంతర కర ఫోటోను వాట్సాప్ మెసెంజెర్ గ్రూప్ లో పోస్టు చేయడంతో అసలు వివాదం ప్రారంభమైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదంలో 33 ఏళ్ళ వ్యక్తి చనిపోగా, తీవ్ర గాయాలైన ఉమేష్ వర్మ అనే వ్యక్తి స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ఏరియా సిటీ ఎస్పీ ఇంద్రజీత్ బల్సావర్ తెలిపారు. తాము ఫిర్యాదు చేసేందుకు విజయనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళేసమయానికి ప్రత్యర్థి బృందం తమపై కత్తులతో దాడి చేయడంతో పరిస్థితి హింసాత్మకంగా మారినట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ జతిన్ రాజ్ ఆరోపించారు.
విజయ నగర్ ఫ్రెండ్స్ పేరిట రాజ్.. తమ ప్రాంతంలోని వారితో కలిసేందుకు వీలుగా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. కాగా ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి ఆ గ్రూప్ లో సోనియా గాంధీ పాత్రలు తోముతున్నట్లుగా ఉన్న ఓ వ్యంగ్య చిత్రాన్ని పోస్టు చేయడంతోపాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే సోనియాకు ఆ పరిస్థితి రావడానికి కారణమన్నట్లుగా అర్థం వచ్చే ఓ క్యాప్షన్ కూడ పెట్టడం అసలు వివాదానికి తెరలేపింది. గత రాత్రి అహింసా చౌక్ లో ఇరువర్గాల సభ్యులు కలుసుకొని ఫోటో పోస్టు చేయడంపై తీవ్రంగా వాదించుకోవడం కూడ జరిగింది. అదే సమయంలో అక్కడికి చేరిన పోలీసులు వివాదాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఇరువర్గాల సభ్యులను పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిచారు. దీంతో పోలీస్ స్టేషన్ కు చేరిన వర్గాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకోవడంతోపాటు, దాడులకు దిగడంతో ఉమేష్ వర్మకు తీవ్ర గాయాలయ్యాయని, అతడ్ని ఆసుపత్రికి తరలించినట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ బృందంలోని సభ్యుడైన అనిమేష్ ఆరోపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, ఆ గొడవ పోలీస్ స్టేషన్ లో జరగలేదని, ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ కు వచ్చే దారిలోనే గొడవ జరిగిందని సీఎస్పీ బల్సావర్ చెప్తుండగా... పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను బయట పెడితే అసలు నిజం బయట పడుతుందని అనిమేష్ డిమాండ్ చేస్తున్నాడు. ఇరు వర్గాలపైనా కేసు నమోదు చేశారని, తదుపరి దర్యాప్తు జరుగుతున్నట్లు కొద్దిపాటి గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది నాయక్ తెలిపారు.