ఆధునిక యోగ పితామహుడు
యోగి కథ
ఆధునిక యుగంలో హఠయోగానికి విశేష ప్రాచుర్యం కల్పించిన గురువుగా తిరుమల కృష్ణమాచార్య ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. అప్పటి మైసూరు రాజ్యంలోని చిత్రదుర్గ జిల్లా ముచికుందాపురంలో 1888 నవంబర్ 18న జన్మించిన ఆయన షడ్దర్శనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితుడు. పదేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకోవడంతో మైసూరు చేరుకున్నారు. మైసూరులోని చామరాజ సంస్కృత కళాశాల నుంచి ‘విద్వాన్’ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తర్క, వ్యాకరణ, వేదాంతాలలోనే కాకుండా, ఆయుర్వేదంలోనూ అసాధారణ నైపుణ్యాన్ని సాధించారు. హఠయోగంలో విశేష సాధన చేసిన కృష్ణమాచార్యను అప్పటి మైసూరు మహారాజా నాలుగో కృష్ణరాజ వడయార్ ఎంతగానో ప్రోత్సహించారు. వడయార్ ఆర్థిక సహాయంతో కృష్ణమాచార్య భారతదేశంలోని నలుమూలలా పర్యటించి, సనాతన యోగవిద్యకు ప్రాచుర్యం కల్పించారు. హఠయోగ సాధనలో పలువురికి శిక్షణ ఇచ్చారు. బి.కె.ఎస్.అయ్యంగార్ వంటి సుప్రసిద్ధ యోగ గురువులు కృష్ణమాచార్య వద్ద శిక్షణ పొందినవారే.
క్లిష్టమైన యోగవిద్యను సుబోధకం చేసేందుకు కృష్ణమాచార్య ‘యోగమకరంద’, ‘యోగాసనగళు’ (యోగాసనాలు), యోగరహస్య, యోగావళి అనే యోగవిద్యా గ్రంథాలను రచించి, ఆధునిక యోగ పితామహుడిగా ప్రసిద్ధి పొందారు. మైసూరులో కొన్నాళ్లు యోగ శిక్షణ సాగించిన తర్వాత కొద్దికాలం బెంగళూరులో గడిపారు. తర్వాత 1952లో మద్రాసుకు తరలిపోయి, అక్కడే స్థిరపడ్డారు. మద్రాసులోని వివేకానంద కాలేజీలో లెక్చరర్‌గా చేరి, అక్కడి విద్యార్థులకు యోగ విద్యను బోధించారు. తన 96వ ఏట ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరిగినా, శస్త్రచికిత్సకు నిరాకరించి, తనకు తెలిసిన యోగ, ఆయుర్వేద విద్యలతోనే నయం చేసుకున్నారు. నిండు నూరేళ్లు జీవించిన ఆయన 1989లో కోమాలోకి జారుకున్న కొద్దిరోజులకే తుదిశ్వాస విడిచారు.