
టీవీలో కనిపించిన తొలి అధ్యక్షుడు
ఇప్పుడంటే బుల్లితెర మీద గల్లీ లీడర్లు కూడా గంట గంటకూ కనిపిస్తున్నారు గానీ, గత శతాబ్ది పూర్వార్ధంలో టీవీలో కనిపించడం చాలా అపురూపంగా ఉండేది. అమెరికాలో టీవీ వచ్చిన కొత్తలో అయితే, దేశాధ్యక్షుడు టీవీలో కనిపించడం సైతం అరుదైన దృశ్యంగానే ఉండేది. అలాంటి రోజుల్లో 1947 అక్టోబర్ 5న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ తొలిసారిగా బుల్లితెరపై దర్శనమిచ్చాడు. రెండో ప్రపంచయుద్ధం నుంచి యూరోపియన్ రైతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారని, అందువల్ల అమెరికన్ పౌరులందరూ ఆహార వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరుతూ హితబోధాత్మక ప్రసంగం చేశాడు.
ఈ ప్రసంగం అమెరికా అంతటా ప్రసారమైంది. అంతకు ముందు అధ్యక్షుడిగా పనిచేసిన ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ బుల్లితెరపై కనిపించేందుకు ముచ్చటపడ్డాడు. ఆయన హయాంలో వాషింగ్టన్‌లో ఒక అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటైనప్పుడు జనాలను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ ప్రసంగాన్ని అందరూ తిలకించేందుకు వీలుగా ప్రదర్శన ఏర్పాటు చేసిన మైదానంలో బుల్లితెరలు పెట్టించాడు. అయితే, ఆ ప్రసారం అక్కడి వరకే పరిమితమైంది. తొలిసారిగా జాతీయస్థాయిలో బుల్లితెరపై కనిపించిన ఘనత మాత్రం హ్యారీ ట్రూమన్‌కే దక్కింది.