
మూడు రోజుల పెళ్ళి అమ్మాయి బంధువులకు నో ఎంట్రీ!
తెలుగునాట ఒకప్పుడు అయిదు రోజుల పెళ్ళిళ్ళు... మూడు రోజుల పెళ్ళిళ్ళు... ఆనవాయితీ! ఇప్పటికీ మూడు రోజుల పెళ్ళిళ్ళు చూడాలంటే... ఛలో చెచెన్యా! రోజుల్లోనే కాదు... సంప్రదాయం విషయంలోనూ మనకూ, అక్కడికీ పోలికలున్నాయి. సంప్రదాయ చెచెన్ వివాహమంటే... స్నేహితులంతా కలసి అమ్మాయిని అందంగా సిద్ధం చేస్తారు. అయితే, ఇక్కడే ఒక తిరకాసు. అంతగా తయారైన పెళ్ళికూతురు అన్నీ చూస్తూ ఉండాలే కానీ, ఈ ఆటలు, పాటల కోలాటంలో పాల్గొనకూడదని సంప్రదాయమట! పెళ్ళికొడుకు తరఫు కుటుంబానికి గౌరవం చూపిస్తూ ఉండిపోవాలట! వేడుకకు అమ్మాయి కుటుంబం రాకూడదు! చెచెన్యాలో సంప్రదాయం ప్రకారం పెళ్ళి కూతురి వయసు కేవలం 17 నుంచి 18 ఏళ్ళ లోపుండాలి. పెళ్ళి కొడుకు వయసేమో 20 ఏళ్ళ చిల్లర ఉండాలి. పెళ్ళి ఖర్చంతా వరుడి తరఫు వాళ్ళదే! కానీ, వరుడి కుటుంబమే తప్ప, వధువు తరఫువాళ్ళు హాజరు కాకూడదు.
చెచెన్యా రాజధాని గ్రోజ్నీలో జరిగిన ఓ పెళ్ళిలో కారెక్కి, పెళ్ళి మండపానికి వెళుతూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటున్న నవ వధువు ఫోటో పక్కనే చూస్తున్నారుగా! దేశాలు, ప్రాంతాలు మారినా, ఆడపిల్ల మనసు, ఆ మనసులోని ప్రేమానురాగాలు ఒకటే కదూ! కానీ, అక్కడి సంప్రదాయం కూడా ఇక్కడ లానే పితృస్వామ్య భావజాలంతో ఉండడమే విచారకరం!