థైరాయిడ్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు
మా పాప వయసు 18. ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల కొంతకాలంగా నెలసరి సరిగా రావడం లేదు. బరువు పెరుగుతోంది. జుట్టు ఊడిపోతోంది. అసహనంగా ఉంటోంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే కొన్ని పరీక్షలు చేయించి, థైరాయిడ్ వచ్చిందని, జీవితాంతం మందులు వాడాలని చెప్పారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దీనికి హోమియోలో మందులున్నాయా? చెప్పగలరు.
- పద్మజ, చల్లపల్లి
థైరాయిడ్ అనేది మానవ శరీరంలోని ఒక ముఖ్యమైన గ్రంథి. ఇది ఉత్పత్తి చేసే థైరాయిడ్ హార్మోన్ శారీరక ఎదుగుదలకు, వివిధ జీవక్రియలకు సహకరిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో అసమతుల్యత వల్ల హైపో థైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్, గాయిటర్ అనే సమస్యలు తలెత్తుతాయి.
హైపో థైరాయిడిజమ్: థైరాయిడ్ హార్మోన్లు కావలసిన దానికంటే తక్కువ అయితే ఇది వస్తుంది. ఏ వయసులోని వారైనా దీనికి గురి కావచ్చు. పిల్లలు, స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
లక్షణాలు: నిస్సత్తువ, బలహీనత, చర్మం పొడిబారడం, బరువు పెరగడం, నెలసరి సరిగా రాకపోవటం, జుట్టు రాలడం, మతిమరపు, మలబద్ధకం, అజీర్ణం, పిల్లల్లో ఎదుగుదల లోపించడం, ఆడపిల్లల్లో అయితే రజస్వల ఆలస్యంగానో లేదా ముందుగానో రావడం, వృద్ధుల్లో కుంగుబాటు, మతిమరపు వంటివి కనిపిస్తాయి.
హైపర్ థైరాయిడిజమ్: థైరాయిడ్ హార్మోన్లు అవసరాని కన్నా ఎక్కువగా ఉత్పత్తి అవడాన్ని హైపర్ థైరాయిడిజమ్ అంటారు. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. దీన్ని త్వరగా గుర్తించలేకపోయినా, నిర్లక్ష్యం చేసినా దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయి.
లక్షణాలు: బరువు తగ్గటం, నిద్రలేమి, గుండెదడ, అధిక చెమటలు, చిరాకు, అస్థిమితం, విరేచనాలు, చేతులు వణకడం, నీరసం, నెలసరి సమస్యలు కనిపిస్తాయి.
గాయిటర్: గొంతు కింద ఉండే థైరాయిడ్ గ్రంథి అసహజంగా వాస్తే దాన్ని గాయిటర్ అని అంటారు. ఇది ముఖ్యంగా అయోడిన్ లోపం వల్ల వస్తుంది.
కారణాలు... గ్రేవ్స్ డిసీజ్, టాక్సిక్ అడినోమా, సబ్ అక్యూట్ థైరాయిడైటిస్, పిట్యూటరీ గ్రంథి సరిగా పని చేయకపోవడం లేదా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ రావడం, హషిమోటోస్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథిని తొలగించటం, కొన్ని రకాల మందులు ఎక్కువ మొత్తంలో అయోడిన్‌కి ఎక్స్‌పోజ్ అవడం వల్ల థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి.
నిర్థారణ: రక్తపరీక్ష, రక్తంలోని టిఎస్‌హెచ్ శాతాన్ని పరీక్షించడం, థైరాయిడ్ యాంటీబాడీస్, అల్ట్రా సౌండ్ స్కాన్, అల్ట్రా సౌండ్ నెక్, రేడియో యాక్టివ్ అయోడిన్ పరీక్ష, బయాప్సీ ల ద్వారా.
హోమియోకేర్ వైద్యం: థైరాయిడ్ సమస్యకు జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా ఈ సమస్య రావడానికి గల మూలకారణాన్ని గుర్తించి, వ్యక్తిత్వానికి అనుగుణంగా సరైన హోమియో వైద్యం చేయడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ సమస్యలను నయం చేయవచ్చు.
గుండెకూ విద్యుత్ సరఫరా!
నా వయసు 42 ఏళ్లు. మార్నింగ్ వాక్ చేస్తూ అకస్మాత్తుగా ఆయాసం వచ్చి పడిపోయాను. వెంటనే ఆసుపత్రికి తరలిస్తే డాక్టర్లు పరీక్షించి, టాకీకార్డియా సమస్య అని చెప్పారు. టాకీ కార్డియా అంటే ఏమిటి? నాకు సమస్య పూర్తిగా తగ్గుతుందా?
- సంజీవరావు, వరంగల్
గుండెజబ్బు అనగానే మనకు గుర్తుకు వచ్చేది గుండెపోటే. నిజానికి గుండెకు సంబంధించిన సమస్యలు చాలా ఉంటాయి. అందులో ఒకటి... గుండెకు అందాల్సిన విద్యుత్‌కు సంబంధించిన సమస్య. మన గుండె ఒక పంపులా పనిచేస్తూ... శరీరంలోని అన్ని భాగాలకూ రక్తం సరఫరా అయ్యేలా చూస్తుంది. మామూలుగా పంపులు పనిచేయడానికి విద్యుత్ అవసరమైనట్లే, మన గుండె కొట్టుకోడానికి కూడా నిరంతరం శక్తి కావాలి. ఇందుకోసం గుండె పైభాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ నోడ్, ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ అనే కేంద్రాలుంటాయి. ఈ గదుల్లో నుంచి ఎప్పటికప్పుడు విద్యుత్ ప్రేరణలు వస్తుంటాయి. సైనో ఏట్రియల్ నోడ్ నుంచి వెలువడే విద్యుత్ ప్రేరణలు గుండె పై గది అయిన కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికకు చేరుతాయి. అప్పుడు ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ నుంచి వెలువడే విద్యుత్ ప్రేరణలు కింది గదులైన జఠరికలు మూసుకుపోయేలా చేస్తాయి. ఇలా నిరంతరం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుండటం వల్ల రక్తనాళాల్లోకి రక్తం పంప్ అవుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో రకరకాల సమస్యల వల్ల విద్యుత్ ప్రేరణలు గతి తప్పితే... గుండె లయ దెబ్బతినవచ్చు. దీంతో గుండెకొట్టుకునే వేగం క్రమంగా తగ్గుతుంది. ఒక్కొక్కసారి అనూహ్యంగా పెరగవచ్చు కూడా. ఇలా గుండె స్పందనల్లో తేడా వచ్చే సమస్యను టాకికార్డియా అంటారు.
వేగం తగ్గితే:రక్తసరఫరా కూడా తగ్గి, మెదడుకు తగినంత రక్తసరఫరా కాదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుందివేగం పెరిగితే:గుండెదడ వస్తుంది స్పృహ తప్పవచ్చు.తల తిరిగినట్లుగా అనిపిస్తుంది. చికిత్స: గుండె వేగం తగ్గినప్పుడు ఛాతీ పైభాగంలో చర్మం కింద పేస్‌మేకర్ అమర్చి, గుండె స్పందనలు ఒకేలా జరిగేలా సమస్యను చక్కదిద్దుతారు. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్ అనే గుండె లయను క్రమబద్ధీకరించే మందులు ఇస్తారు.
స్పాస్టిసిటీ తగ్గేదెలా?
నా వయసు 52. ఒక యాక్సిడెంట్‌లో నా మెడ భాగంలో వెన్నెముకకు గాయమైంది. సర్జరీ చేశారు. అప్పటినుంచి నా కాళ్లు, చేతులు బలహీనంగా మారాయి. మల, మూత్ర విసర్జనలపై కూడా నా నియంత్రణ లేదు. కాళ్లూ, చేతులు బిగుతుగా మారినట్లుగా ఉండటం నాకున్న పెద్ద సమస్య. దీనివల్ల నేను కాళ్లూ చేతులు కదిలించలేకపోవడంతో పాటు కూర్చోలేకపోవడం, నిలబడలేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. కాళ్లు, చేతులు కదిలించే ప్రయత్నంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ఫిజియోథెరపీ చేయించుకొమ్మని కొందరు చెబుతున్నారు. దయచేసి సలహా చెప్పగలరు.
- విశ్వేశ్వరరావు, విజయవాడ
రోడ్డు ప్రమాదాలలో వెన్నెముకకు అయ్యే గాయాలు, వాటి వల్ల మీరు పేర్కొన్న సమస్యలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. మెడదగ్గర వెన్నెముక భాగంలో గాయాలైతే మీరు పేర్కొన్నట్లుగా కాళ్లూ చేతులపై నియంత్రణ కోల్పోవడం జరగవచ్చు. ఈ ప్రాంతంలో ఎంత బలంగా గాయాలైతే... వాటిని అనుగుణంగా మన శరీరంలోని చాలా భాగాలు నియంత్రణలో లేకుండా పోయే అవకాశం ఉంది. ఒక్కోసారి కాళ్లూ, చేతులు, మొండెం భాగం కూడా నియంత్రణలో లేకుండా పోవచ్చు. మీరు పేర్కొన్న భాగంతోపాటు అంతకంటే కింద భాగంలోనూ వెన్నెముకకూ దెబ్బ తగిలితే మలమూత్ర విసర్జనలపై నియంత్రణలేకుండా పోతుంది. మీరు పేర్కొన్న లక్షణాలను బట్టి చూస్తే మీకు స్పాస్టిసిటీ వచ్చి ఉంటుందని తెలుస్తోంది. అంటే... నరాలు దెబ్బతిని కాళ్లూ, చేతులు మొదలైన శరీర భాగాలపై నియంత్రణ కోల్పోవడంతో పాటు మీ ప్రమేయం లేకుండానే కండరాలు వాటంతట అవి నేరుగా కదులుతుండటం జరుగుతోందన్నమాట. మీరు నిల్చోలేకపోవడం, కూర్చోలేకపోవడం... ఆ ప్రయత్నంలో మీకు తీవ్రమైన నొప్పి రావడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది. స్పాస్టిసిటీ వల్ల మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల మీ జీవనశైలి దెబ్బతింటుంది. జీవననాణ్యత తగ్గుతుంది. మీ శరీరంలోని అవాంఛిత కదలికలను (స్పాస్టిసిటిని) రీహ్యాబిలిటేషన్ చికిత్స ద్వారా తగ్గించవచ్చు.
ముందుగా మీరు న్యూరాలజిస్ట్ లేదా న్యూరోసర్జన్‌ను సంప్రదించండి. వారు ముందుగా రోగిని నిశితంగా పరీక్షిస్తారు. రోగిలోని స్పాస్టిటిటీ తీవ్రతను బట్టి వారు నోటి ద్వారా ఇవ్వదగిన యాంటీ-స్పాస్టిసిటీ మందులను, మోతాదును నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ తర్వాతే రీహ్యాబిలిటేషన్ నిపుణుడిని కలిస్తే, ఆ మందు ప్రభావం, రోగిలోని స్పాస్టిసిటీ తీవ్రత... వీటన్నింటినీ అంచనా వేసి, దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన ఫిజియో చికిత్సను నిర్ణయిస్తారు. మందులతో పాటు ఇచ్చే రీహ్యాబిలిటేషన్ ప్రక్రియ మీకు మరింత ఉపకరిస్తుంది. నోటిద్వారా తీసుకునే యాంటీ స్పాస్టిసిటీ మందుల తీవ్రత ఎక్కువైనా కూడా కాళ్లు, చేతుల కండకాలలో బలహీనత పెరిగే అవకాశం ఉంది. ముందుగా న్యూరాలజిస్ట్‌ను కలిసిన తర్వాత న్యూరోఫిజియోథెరపిస్ట్‌నూ కలిస్తే... మీకు ఇచ్చిన మందుల ప్రభావం వల్ల మీలో కలిగిన మార్పుల ఆధారంగా న్యూరోఫిజియోథెరపిస్ట్ చికిత్స చేస్తారు.
గుండెకూ విద్యుత్ సరఫరా!
Published Sun, Sep 6 2015 11:30 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement