ఇస్లాం/ప్రవక్త జీవితం
వ్యాపార విజయంతో ఒంటెలనిండా సామగ్రి నింపుకుని వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఒంటెలు బాగా నీరసించాయి. అడుగుతీసి అడుగేయడమే కనాకష్టమైపోయింది. సహప్రయాణీకులు ముందుగానే చకచకా వెళ్లిపోయినా వీళ్లు మాత్రం వెనుకబడిపోయారు.
ముహమ్మద్ నిజాయితీ, వ్యాపార దక్షతల కారణంగా ఆ సంవత్సరం ఊహించినదానికన్నా అనేకరెట్లు లాభాలు, శుభాలు సమకూరాయి. గతంలో ఎప్పుడూ ఇంతగా లాభాలు గడించిన దాఖలాలు లేవు. దీంతో ఆమె మరింతగా ప్రభావితమయ్యారు. అన్నిటికీ మించి ముహమ్మద్ వ్యక్తిత్వం, హుందాతనం, నీతి నిజాయితీలు ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి.
ఇంతలో మైసరా కూడా వచ్చేశాడు. వాహనాల నిండా సరకు, సరంజామా పుష్కలంగా ఉంది. మైసరా వ్యాపార సామగ్రితోబాటు బోలెడన్ని కబుర్లు కూడా మోసుకొచ్చాడు. మైసరా నోట అనేక విషయాలు తెలుసుకున్న ఖదీజా హృదయం సంతోషంతో పులకించి పోయింది. ప్రయాణ విశేషాలతోబాటు, ముహమ్మద్ వ్యక్తిత్వాన్ని గురించి, వ్యాపార లావాదేవీల్లో ఆయన చూపిన నీతి, నిజాయితీ, సామగ్రి పరిరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తదితర విషయాలన్నీ వివరించాడు మైసరా.
అంతేకాదు, ప్రయాణ సమయంలో సంభవించిన అద్భుతాలను కూడా ఒక్కొక్కటి వరుసగా చెప్పుకొచ్చాడు ప్రయాణంలో ముహమ్మద్ (స) సహప్రయాణీకులతో మెలిగిన ప్రశంసనీయమైన తీరు, మోడువారిన చెట్టు పచ్చగా చిగురించి నీడ కల్పించడం, ప్రఖ్యాత పండితుడు వస్తూరా వినిపించిన భవిష్యవాణి తదితర విషయాలన్నీ చెప్పాడు. తరువాత తిరుగు ప్రయాణంలో జరిగిన మరో అద్భుతాన్ని వివరించాడు. వ్యాపార విజయంతో ఒంటెలనిండా సామగ్రి నింపుకుని వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఒంటెలు బాగా నీరసించాయి. అడుగుతీసి అడుగేయడమే కనాకష్టమైపోయింది. సహప్రయాణీకులు ముందుగానే చకచకా వెళ్లిపోయినా వీళ్లు మాత్రం వెనుకబడిపోయారు. అప్పుడు మైసరా ముహమ్మద్‌తో, ‘చూడండి, సహప్రయాణీకులు మనకంటే ముందే వెళ్లిపోయారు. మన ఒంటెలు బాగా అలసిపోయాయి. ఇక ఎంతమాత్రం ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడేం చేద్దాం’ అంటూ తలపట్టుకున్నాడు. అప్పుడు ముహమ్మద్‌గారు, అలసిపోయి, చతికిలపడ్డ ఒంటెల కాళ్లను ఒకసారి తమ పవిత్ర హస్తాలతో నిమిరి, వాటిని అదిలించారు. వెంటనే అవి ఎక్కడలే ని ఉత్తేజం పొందినట్లుగా పరుగులాంటి నడక ప్రారంభించి, అందరికన్నా ముందే గమ్యానికి చేరుకున్నాయి. ఈ విధంగా మైసరా ముహమ్మద్‌ను గురించి అనేక విషయాలు చెప్పాడు.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్
(మిగతా వచ్చేవారం)