
సాక్షి, చెన్నై : ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుష్బూ సుందర్ తన పేరును మార్చేసుకున్నారు. ఆమె అసలు పేరు కుష్బూ కాదన్న విషయం కొందరికి తెలిసే ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో ఆమె తన పేరును మార్చుకుని కుష్భుగా సినీ రంగంలోకి ప్రవేశించారు. అయితే ఆమె అసలు పేరు నఖట్ ఖాన్ అనే విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ రాజకీయం చేయటం ప్రారంభించింది.
‘కుష్భూ తన గుర్తింపును దాస్తున్నారు. ఆమె తన మతాన్ని కించపరుస్తూ.. బయటపెట్టడం లేదు. దీనిపై ఆమె వివరణ ఇవ్వాలి’ అంటూ సోషల్ మీడియాలో చిన్నపాటి ఉద్యమాన్నే నడిపింది. అయితే అనూహ్యంగా చాలా మంది ఆమెకే మద్ధతు పలికారు. అయినప్పటికీ కుష్భూ మాత్రం తన పేరును ట్వీటర్‌లో మార్చేశారు. ‘కుష్బూసుందర్... బీజేపీ కోసం నఖట్‌ఖాన్’ అంటూ పేరును ఉంచారు.
ఇక ఈ అంశంపై ఆమె స్పందిస్తూ.. ‘సమస్యలను పరిష్కరించాల్సిన నేతలు.. తోటివారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నఖట్ నా తల్లిదండ్రులు పెట్టిన పేరు. మతంతో రాజకీయాలు చేయటం బీజేపీ వారికి అలవాటైన పనే. వారికి బుద్ధి చెప్పటానికే పేరు మార్చుకున్నా’ అని కుష్భూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment