
ఎప్పటికీ గ్రేట్!
సంక్షిప్తంగా... మహమ్మద్ అలీ
మహమ్మద్ అలీ మనవాడిలా అనిపిస్తాడు. కానీ అమెరికన్. అలీ అలియాస్ కాస్సియెస్ మార్సెలస్ క్లే తన 22వ యేట 1964 ఫిబ్రవరిలో సోనీ లిస్టన్‌తో తలపడి ప్రపంచ బాక్సింగ్ యోధుడిగా టైటిల్ గెలిచిన ఏడాదే.. తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన ‘మహమ్మద్ అలీ’ అనే టైటిల్‌నీ ఎంతో గర్వంగా ధరించాడు. బాక్సింగ్ టైటిల్ అతడిని జగదేకవీరుడిని చేస్తే, భక్తితో స్వీకరించిన ‘అలీ’ అన్న టైటిల్ అతడిని జగద్విదితం చేసింది. అయితే ఇస్లాం మతాన్ని స్వీకరించినందుకు క్రైస్తవ మూలాలు ఉన్న ఈ ‘త్రీ-టైమ్’ వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్... సంప్రదాయవాదుల ఆధ్యాత్మిక ముష్టి ఘాతాలను ఏళ్లపాటు ఎదుర్కొనవలసి వచ్చింది.
నిజానికి వివక్ష అన్నది అతడితో పాటు దెయ్యపు నీడలా ఎదిగింది. పద్దెనిమిదేళ్ల వయసులో రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొని లైట్ హెవీ వెయిట్ చాంపియన్‌గా బంగారు పతకంతో సంతోషంగా తిరిగి వచ్చిన క్లే కి అమెరికాలో వివక్ష మాత్రమే స్వాగతం పలికింది. విజేతను ప్రశంసించాల్సింది పోయి, పట్టనట్టు ఉండిపోవడం అతడినేమీ కలచివేయలేదు కానీ, ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన ఒక పరిణామం అతడికి విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించింది. క్లే హాజరైన ఓ విందు వేడుకలో అతడికి వడ్డించేందుకు అక్కడివారు నిరాకరించడంతో క్లే బయటికి వచ్చి ఎప్పుడూ తన వెంట ఉంచుకునే ఒలింపిక్ పతకాన్ని తీసి ఓహియో నదిలోకి విసిరికొట్టాడు. తనను గౌరవించని దేశంలో ఆ దేశం తరఫున సాధించిన పతకాన్ని గౌరవించడం తనకు అవమానకరం అని అతడు భావించాడు కనుకే అలా చేశాడు.
అలీ దేవుడికి తప్ప మరెవరికీ కట్టుబడి లేడు. అదే ఆయన్ని అనేకసార్లు చిక్కుల్లో పడేసింది. వియత్నాం యుద్ధ సమయంలో యు.ఎస్. ఆర్మీ నుంచి అలీకి ‘కన్‌స్క్రిప్షన్’ నోటీసు వచ్చింది... వెంటనే వచ్చి యుద్ధంలో చేరమని. అలీ తిరస్కరించాడు. జాతి గర్వించే ఒక క్రీడాకారుడిగా కన్‌స్క్రిప్షన్‌ను తిరస్కరించే హక్కు అతడికి ఎలాగూ ఉంటుంది. అయితే తన మత నిబంధనలు ఏ విధమైన హింసనూ అనుమతించవన్న కారణం చూపి సైన్యంలో చేరడానికి అతడు నిరాకరించడంతో అమెరికా ఆగ్రహించింది. అతడికి పది వేల డాలర్ల జరిమానా, ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. తర్వాత అలీ తరఫున వచ్చిన అభ్యర్థనలను మన్నించి కారాగారవాసాన్ని రద్దు చేసినప్పటికీ అతడి బాక్సింగ్ టైటిల్‌ను వెనక్కు తీసేసుకుంది. బాక్సింగ్ లెసైన్స్‌నీ (తాత్కాలికంగా) లాగేసుకుంది.
అలీ తన నలభయ్యవ యేట 1981లో బాక్సింగ్ నుంచి తప్పుకున్నారు. తర్వాత మూడేళ్లకు వైద్యులు అతడిలో పార్కిన్‌సన్ వ్యాధిని గుర్తించారు. బాక్సింగ్‌లో తలకు అయిన గాయాల కారణంగా వచ్చిన వ్యాధి అది. అలీ వైవాహిక జీవితం కూడా నాలుగు పెళ్లిళ్లతో నలతకు గురయినట్లే ఉంది. ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులకు తండ్రి అయిన అలీ ప్రస్తుతం యు.ఎస్. కెంటకీలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్ గేమ్స్‌కి క్రీడాజ్యోతిని చేత పట్టుకోవలసింది అలీనే అయినా అరోగ్య కారణాల వల్ల ఆయన జ్యోతి పక్కన కేవలం అలా కొద్దిసేపు నిలబడగలిగారు.
గత నెల 22న అట్లాంటాలో జరిగిన ‘హెరిటేజ్ ఆక్షన్’ వేలంలో మహమ్మద్ అలీ 1964 ఫిబ్రవరి 25న తొలిసారి ఛాంపియన్‌షిప్ గెలిచినప్పటి గ్లవుజులు 8,36,500 డాలర్ల విలువను దక్కించుకున్నాయి. యాభై ఏళ్ల క్రితం ఆరోజున బాక్సింగ్‌లో గెలవగానే అలీ తన ఉద్వేగాన్ని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయకుండా ‘‘ఐయామ్ ది గ్రేటెస్ట్. ఐ షుక్ అప్ ది వరల్డ్’’ అని అరిచారు. ఆనాటి అలీ గ్లవుజులు ఇప్పుడు 5 కోట్ల 18 లక్షల రూపాయలను మించి పలకడం చూస్తే ఇవాళ్టికీ బాక్సింగ్‌లో ఆయనే గ్రేట్ అనిపించడంలో వింతేముంది?!