సన్మార్గంలోకి మళ్లడమే నిజమైన మార్పు
శాంతియుత సహజీవనం కోసం భారత రాజ్యాంగం తన పౌరులకు కల్పించిన ఒక వెసులుబాటు ఏమిటంటే... మత స్వేచ్ఛ. దీని ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. అయితే మనలోనే కొందరు బలవంతపు మార్పిడి ప్రయత్నాల ద్వారా ఈ హక్కుకు భంగం కలిగిస్తున్నారు. అటువంటి మరొక ప్రయత్నమే... ‘మార్పిడుల పేరిట జరుగుతున్న గందరగోళాన్ని అరికట్టడానికంటూ’ మత మార్పిడి వ్యతిరేక చట్టం తీసుకురావాలని కొందరు చేస్తున్న వాదన! మతం మీద, దైవ చిత్తం మీద సరైన అవగాహన లేనివారే ఇలాంటి ప్రయత్నాలను చేస్తుంటారని మనం గుర్తించాలి.
వాస్తవానికి ఒక విశ్వాసాన్ని అవలంబింపజేయాలంటే మతం మార్పించే అవసరం లేదు. అలాగే వ్యక్తి పేరును ఫలానా మతాన్ని గుర్తుకు తెచ్చే విధంగా మార్చుకునే పనీ లేదు. ఎంచేతంటే - ఏ మతము కూడా బాహ్య రూపానికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. అంతర్గత స్వచ్ఛతే దైవానికి కావలసింది. దుష్ట తలంపుల నుండి, దురలవాట్ల నుండి, దుర్మార్గం నుండి పరివర్తన చెంది సన్మార్గంలోకి, దేవుని సన్నిధిలోకి రావడమే నిజమైన మార్పిడి. సన్మార్గమే దేవుని అభిమతం. ప్రతి ప్రబోధకుడు మతాలకు అతీతంగా పౌరుల మనస్సులను సన్మార్గం వైపు మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ప్రస్తుతం భారతీయ సమాజంలో ఏర్పడిన మత అస్థిమితానికి ఆస్కారం ఉండదు. మతం పేరుతో ఒకరి పట్ల ఒకరు విద్వేషాలు పెంచుకోకుండా, పరస్పర గౌరవాభిమానాలతో మెలిగిన నాడు దేవుని దృష్టిలో ప్రశంసలు పొంది, సుఖశాంతులతో జీవించగలుగుతాం.
- యస్. విజయ భాస్కర్