దైవం మెచ్చే ఆరాధన ‘హజ్’ | The Story of Hajj | Sakshi
Sakshi News home page

దైవం మెచ్చే ఆరాధన ‘హజ్’

Published Wed, Oct 16 2013 12:29 AM | Last Updated on Sat, Aug 18 2018 9:28 PM

దైవం మెచ్చే ఆరాధన ‘హజ్’ - Sakshi

దైవం మెచ్చే ఆరాధన ‘హజ్’

 దైవం తన ప్రియ ప్రవక్త హ. ఇబ్రాహీం(అ)ను ఒక పరీక్షకు గురి చేశాడు. దైవాదేశ పాలనలో ప్రేమకు, మమకారాలకు, ఆత్మీయతకు ఏమాత్రం చోటు లేదని చాటి చెప్పిన అనుపమానమైన పరీక్ష ఇది. ఒకరోజు హ.ఇబ్రాహీం(అ) ఒక కలగన్నారు. స్వహస్తాలతో తన కొడుకు గొంతు కోస్తున్నట్లు ఆయన ఆ కలలో చూశాడు. దీన్ని దైవాదేశంగా భావించిన ఆయన లేక లేక కలిగిన సంతానాన్ని త్యాగం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం అటు భార్యతోనూ, ఇటు కొడుకుతోనూ సంప్రదించగా... వారిద్దరూ సంతోషంగా అంగీకరించారు. తరువాత ఇస్మాయీల్‌ను నిర్ణీత ప్రదేశానికి తీసుకెళ్లి, దైవనామ స్మరణ చేస్తూ తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు ఇబ్రాహీం (అ). దీంతో తన ప్రియ ప్రవక్త పట్ల దైవప్రసన్నత పతాకస్థాయిలో ప్రసరించింది. దైవవాణి  ‘నా ప్రియ ప్రవక్తా! నువ్వు కేవలం స్వప్నంలో చూసిన దాన్ని నిజం చేసి చూపించావు. 
 
నా ఆజ్ఞాపాలనలో మీరు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడనయ్యాను. నా ఈ పరీక్షలో మీరు సంపూర్ణంగా ఉత్తీర్ణులయ్యారు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలి తతంగంతో నాకు నిమిత్తమే లేదు. మీరు నా ఆదేశాలను తు.చ. తప్పక పాలించడంలో పరిపూర్ణులయ్యారు. ఈ శుభసమయంలో మీ త్యాగనిరతికి గుర్తుగా ఒక స్వర్గ పొట్టేలును పంపుతున్నాను’ అని పలికింది. వెంటనే చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో గొర్రెజాతికి చెందిన ఒక పొట్టేలు ప్రత్యక్షమైంది. దాన్ని జిబహ్ చేశారు హ. ఇబ్రాహీం (అ). ఈ తండ్రీ తనయుల దైవాజ్ఞ పాలనాక్రమంలో షైతాన్ వీరికి మూడుసార్లు అడ్డుపడతాడు. ఈ మూడుసార్లూ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్లు ఆ దుష్ట షైతాన్‌పై రాళ్లు విసిరి తరిమి కొడతారు. వీరిద్దరినీ షైతాన్ లోబరచుకోవడానికి ప్రయత్నించిన మూడుచోట్లా మూడు స్తంభాలున్నాయి. ఈ షైతాన్ స్తంభాలపై హాజీలు చిన్న చిన్న రాళ్లు విసిరి దుష్టశక్తులపై ధార్మిక చింతనాపరుల ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తారు. దుష్టశక్తులు, ధర్మ విరోధులు ఎప్పుడు ఎక్కడ ఎదురైనా వారిని ఎదిరించడంలో ఎప్పుడూ ముందుంటామని ప్రకటించడమే ఈ రాళ్లు విసరడంలోని ముఖ్యోద్దేశం. 
 
 ‘హజ్’ ఒక విశ్వజనీన, విశ్వ వ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేదభావం మచ్చుకైనా ఉండదు. మానవులంతా ఒక్కటే అన్న భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం.  పవిత్ర హజ్ ఆరాధన జరిగే మక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ, కోనల మధ్య నిర్మానుష్యంగా ఎలాంటి వనరులూ లేక నిర్జీవంగా పడి ఉన్న ఎడారి ప్రాంతంలో మహనీయ హ. ఇబ్రహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హ.హాజిరా(అ)తోపాటు పాలబుగ్గల పసికందు, ఆ పుణ్యదంపతుల ఏకైక సంతానమైన హ. ఇస్మాయీల్‌ను వదిలేసి వెళ్లిపోతారు. అప్పుడు ‘నన్నూ, నా బిడ్డనూ ఈ జన సంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోతున్నారేమిటి? అని హ. హాజిరా ( అ) అడిగితే, ‘ఇది దైవాజ్ఞ. 
 
అందుకే వదిలి వెళుతున్నాను. అని చెప్పి, దైవంపై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్లిపోతారు హ. ఇబ్రాహీం. కనీసం నాలుక తడుపుకోవడానికి సైతం చుక్కనీరులేని ఆ ప్రదేశంలో చిన్నారి పసికందు ఇస్మాయీల్ గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో, ఆయన కాలి మడిమెలు రాసుకుపోయిన చోట దేవుని ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట వెలిసింది. ‘జమ్ జమ్’ అనే పేరుగల ఆ పవిత్ర జలంలో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆనాడు కేవలం రెండు ప్రాణాలకోసం వెలసిన ఆ నీరు ఈనాడు ‘హజ్’ యాత్రకోసం మక్కా వెళ్లే లక్షలాదిమంది ప్రజలకు సమృద్ధిగా సరఫరా అవుతూ, యాత్రికులు తమ స్వస్థలాలకు తెచ్చుకున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం దేవుని మహిమకు నిదర్శనం. ఆనాడు నిర్జన ఎడారి ప్రాంతంగా ఉన్న కీకారణ్యమే ఈనాడు సుందర మక్కానగరంగా రూపుదిద్దుకుని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. 
 
 తరువాత కొంతకాలానికి దైవాదేశం మేరకు హ. ఇబ్రాహీం (అ)మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకుని, తనయుడు ఇస్మాయీల్ సాయంతో ‘కాబా’ను నిర్మించారు. చతురస్రాకారంలో ఉన్న ఆ రాతి కట్టడాన్ని హ.ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్లు దైవానికి సమర్పించుకోవడంతో, అది ‘కాబా’ దైవగృహంగా పేరు పొందింది.   కాబాగృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనారీతులన్నీ పరిపూర్ణతను సంతరించుకున్నాయి. యాత్ర, నిరాడంబర సాధువస్త్రధారణ, దైవప్రార్థన, వ్రతనిష్ట, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతూ ఉంటాయి. అందుకని, కాబా గృహ సందర్శనార్థం చేసుకునే ‘హజ్’ వల్ల ఉపాసనా రీతులన్నింటినీ ఆచరించి దైవానుగ్రహం పొందినట్లే అవుతుంది. ఇందుకోసమే దైవవిశ్వాసులైన వారందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా ‘హజ్’ చేయాలని... ఆ మహాభాగ్యం కోసం ఉవ్విళ్లూరుతుంటారు. 
 
 హజ్ నియమాలు
 సాధారణంగా హజ్ చేయాలనుకునేవారు ఒక నాయకుని ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడతారు. హజ్ సంకల్పంతోనే మనస్సునూ, దేహాన్ని నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మనోవాంఛలను వదులుకుని, అసభ్య ప్రసంగాలకు దూరంగా ఉంటారు. కొంతకాలం వరకు దాంపత్య సంబంధాలను సైతం త్యజించి, నిరంతర దైవధ్యానంతో జీవితం గడుపుతారు. ఈ విధంగా హజ్ ఆరాధన మనిషిని అన్ని రకాల దుర్గుణాలకూ దూరంగా ఉంచి, పరమ పునీతుల్ని చేస్తుంది.  హజ్ కోసం వచ్చే యాత్రికులంతా మక్కా మరికొన్ని మైళ్ల దూరం ఉండగానే నిరాడంబర వస్త్రధారణ చేయాలి. ధార్మిక పరిభాషలో దీన్ని ‘ఇహ్రాం’ అంటారు. అంతకుముందు రకరకాల వస్త్రధారణల్లో ఉన్న వివిధ దేశాలకు చెందిన వారంతా ‘ఇహ్రామ్’తో ఒక్కటై పోతారు. ధనికులు, పేదలు, అధికులు అధములు అన్న తేడాలేకుండా అందరూ కలసిపోతారు. ‘ఇహ్రామ్’ అంటే ఒక లుంగీ, ఒక దుప్పటి, పాదరక్షలు మాత్రమే ధరించడం. ఇహ్రాం ధరించిన తరువాత అన్ని ఆడంబరాలూ త్యజించాలి. అలంకారాలు మానుకోవాలి. కేశసంస్కారంతోపాటు కనీసం గోళ్లు కూడా కత్తిరించుకోకూడదు. ‘తఖ్వా’ అంటే దైవ భీతిని అలవరచుకుని నమాజు, జిక్ ్రతప్ప మరో ప్రాపంచిక విషయంవైపు మనస్సు మళ్లకుండా జాగ్రత్తపడాలి. నియమ నిష్ఠలతో చేసిన హజ్ యాత్ర దైవం మెచ్చే ఆరాధన. 
 - యండీ ఉస్మాన్‌ఖాన్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement