ప్రేరణ
విజయం వైపు సాగిపోయేలా నిత్యం స్ఫూర్తిని రగిలించే ఒక కథానాయకుడి(హీరో)ని ఆదర్శంగా తీసుకోవడం ప్రతి వ్యక్తికీ ఎంతో అవసరం. ఎందుకంటే.. గొప్ప కలలు కనేలా హీరోలు మనల్ని ప్రేరేపిస్తారు. ప్రేరణ అందిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా మనోస్థైర్యం కలిగిస్తారు. ఒకవేళ మనం నిరాశ అనే సంద్రంలో మునిగిపోయినప్పుడు వారు తమ హిత వచనాలతో ధైర్యం నింపుతారు. నిక్షేపంగా బయటకు రావడానికి అవసరమైన గుండెనిబ్బరాన్ని మనలో కల్గిస్తారు.
ఎల్లప్పుడూ ఒక్కరేనా!
మన ఆదర్శ కథానాయకుడు ఎల్లప్పుడూ ఒక్కరే ఉండాలనే నియమం లేదు. జీవితంలో నానాటికీ మారిపోయే పరిణామాలు, పరిస్థితులను బట్టి హీరోలు సైతం మారుతుంటారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. హీరోలు పరిపూర్ణులుగా ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. అలా కోరుకుంటే నిరాశ చెందక తప్పదు. మనకు అసలు హీరోలే వద్దనుకొనే దశ రావడం బాధాకరం!
మొదటి హీరో.. నాన్న
నా హీరో ఎవరనే ప్రశ్న తరచుగా మనసులో మొలకెత్తుతూ ఉంటుంది. నా జీవితంలో పలువురు కథానాయకులున్నారు. వారిలో కొందరు ముఖ్యుల గురించి ప్రస్తావించడం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నా..! జీవితంలోని మొదటి హీరోల్లో ఒకరు నా తండ్రి. మనలో చాలామందికి మొదటి హీరో తండ్రే కావడంలో ఆశ్చర్యం లేదు. నా తండ్రి చేసే పనుల నుంచి ఒక బాలుడిగా నేను ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను పొందేవాడిని. మా నాన్న కేరళలోని ఓ కుగ్రామం నుంచి ముంబై మహానగరానికి వచ్చారు. ఇక్కడే ఇంజనీరింగ్ చదివారు. ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకున్నారు. హిందీ భాషలో నిష్ణాతుడిగా మారారు. ఆ భాషను మరొకరికి బోధించే స్థాయికి ఎదిగారు. నేను హిందీలో మాట్లాడడం, రాయడం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మనచుట్టూ ఉండేవారితో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఆరేళ్ల వయస్సులో నాన్న వద్ద నేర్చుకున్నాను. నేను ఎప్పటికీ మర్చిపోలేని రెండు ముఖ్యమైన పాఠాలు.. కారు డ్రైవర్‌ను ‘డ్రైవర్’ అని కాకుండా పేరు పెట్టి పిలవడం. మా డ్రైవర్ నాకు ‘డ్రైవర్’ కాదు.. నాథూ భయ్యా. మరొకటి.. నా పుస్తకాల సంచిని నేనే మోసుకుపోవడం!
ఉన్నదానితోనే సాధించేలా..
స్కూల్‌లో ఉన్నప్పుడు నాకు క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. అప్పుడు సునీల్ గవాస్కర్ రూపంలో ఓ హీరో దొరికాడు. ఆయన గొప్ప పొడగరి కాదు. పొట్టిగా ఉంటాడు. మైదానంలోకి దిగాడంటే.. హెల్మెట్ ధరించకుండానే ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనేవాడు. శారీరకంగా పొట్టిగా ఉండడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నానని గవాస్కర్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బౌన్సర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు తన శారీరక ప్రతికూలతే అనుకూలంగా మారిందని వెల్లడించాడు. తన ఇంట్లోని చిన్న బాల్కనీలోనే క్రికెట్ సాధన చేసేవాడినని, బంతులను సూటిగా బాదాలనే పాఠం అక్కడే అలవడిందని పేర్కొన్నాడు. గవాస్కర్ చెప్పిన ఈ రెండు విషయాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మనలో ఉన్నదానితోనే అనుకున్నది సాధించేందుకు కృషి చేయాలి. మనలో లేని దాని గురించి ఫిర్యాదులు చేస్తూ కాలం గడిపితే ప్రయోజనం శూన్యం.
‘కెరీర్స్ 360’ సౌజన్యంతో..
మెరికలు చూపిన మార్గంలో..
Published Sun, May 18 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement