కుర్రాళ్లోయ్‌! గుర్రాలోయ్!! | Today is International Youth Day | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లోయ్‌! గుర్రాలోయ్!!

Published Sun, Aug 12 2018 12:17 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

Today is International Youth Day - Sakshi

బిన్నీ, సచిన్‌... అంతర్జాతీయ కంపెనీకి గుడ్‌బై చెప్పి... ఆ కంపెనీకే పోటీ అయ్యారు. భారీ ఈ–కామర్స్‌ సామ్రాజ్యాన్ని నిర్మించారు. భవీష్‌... పనితో ప్రేమలో పడిపోయాడు. రోజుకు పద్దెనిమిది గంటలు దాంతోనే!! రొమన్‌ సైనీ... 21 ఏళ్లకే మెడిసిన్‌... తర్వాత ఏడాదికే సివిల్స్‌... అసిస్టెంట్‌ కలెక్టర్‌గా ఉద్యోగం!. అయినా... కిక్కు లేదని ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు.!!రితేష్‌... కాలేజీ చదువు మధ్యలో వదిలేసి... దేశ మంతా తిరిగాడు. ఆ అనుభవాలతో.. 18 ఏళ్లకే కంపెనీ పెట్టేశాడు. నందన్‌... ఓ అద్భుతమైన ఐడియాతో ఫెయిలయ్యాడు. అక్కడ నేర్చుకున్న పాఠాలతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. విజయం సాధించాడు. అభిరాజ్‌ భాల్, వరుణ  ఖైతాన్‌... చక్కని విదేశీ ఉద్యోగాన్ని వదిలేశారు. ఏం చేయాలో తేల్చుకోకుండానే ఇండియాకు తిరిగొచ్చేశారు. వచ్చాక తొలి ప్రయత్నం ఫెయిల్యూరే. మరో ప్రయత్నం భారీ సక్సెస్‌ ఇచ్చింది. ఇక శ్రీనుబాబు ఫ్రమ్‌ శ్రీకాకుళం... పాతికేళ్లకే యంగ్‌ సైంటిస్ట్‌. అది అందుకునేటపుడు పుట్టిన ప్రశ్న... కంపెనీగా పరిష్కారమయింది. కనిక... ఆలోచనలెప్పుడూ నింగిలోనే. 18 ఏళ్లకే విమాన సంస్థలో ఉద్యోగం. కానీ 22 ఏళ్లకే క్యాన్సర్‌. డాక్టర్లు కష్టమన్నారు. ఆమె ధైర్యం వదల్లేదు. శరీరం కీమోథెరపీని తట్టుకుంది. మనసు మాత్రం ఓ ఐడియాతో ఆకాశాన్ని అందుకుంది.

ఇంతకీ ఎవరు వీళ్లంతా..? ఫ్లిప్‌కార్ట్‌... ఓలా... అన్‌అకాడెమీ... ఓయో... స్విగ్గీ... అర్బన్‌ క్లాప్‌... పల్సస్‌... జెట్‌ సెట్‌ గో... వంటి దిగ్గజాల ఆవిష్కర్తలు. ‘చేయకుండా ఉండటం కంటే... నచ్చింది చేసి ఫెయిలయినా ఓకే’ అనే సిద్ధాంతాన్ని మనసా వాచా నమ్మిన ఈ నాటి యువతకు ప్రతినిధులు. వీళ్లేకాదు!! పెద్దగా పెట్టుబడి లేకపోయినా.. స్నేహితులే సహోద్యోగులుగా స్టార్టప్‌లు పెట్టి విజయం సాధించిన యువతే నేటి భారత బ్రాండ్‌ అంబాసిడర్లు. చేసే పనేదో సీరియస్‌గా చెయ్యాలన్నదే వీరి సూత్రం. కాకపోతే వీరికి కలిసొస్తున్నదల్లా... రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీ. దాని సాయంతోనే వీరు కొత్త సామ్రాజ్యాలు నిర్మిస్తున్నారు. తమ జీవితాన్ని మార్చుకోవటమే కాదు... భారత ముఖచిత్రాన్నే మారుస్తున్నారు. అయితే పైన ప్రస్తావించిన కంపెనీలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ అగ్రిగేటర్లు. అంటే... అవసరం తీర్చేవారిని– అవసరం ఉన్నవారిని కలిపే మధ్యవర్తులన్న మాట. వీటికంటూ సొంత ఉత్పత్తులు, తయారీ కేంద్రాలు వంటివేవీ ఉండవు. ఉన్నదల్లా టెక్నాలజీయే. దాంతోనే ఇవి కొనుగోలుదార్లకు ఎలాంటి బాదరబందీ లేకుండా చేస్తున్నాయి. వారికీ, విక్రయదార్లకు మధ్య తాము ఉంటూ... అమ్మేవారికి సొమ్ము, కొనేవారికి సేవలు సరిగా దక్కేలా చేస్తున్నాయి. మొత్తంగా... ఓ అద్భుతమైన  వ్యాపారాన్ని సృష్టిస్తున్నాయి. అలాంటి కొన్ని కంపెనీల సారథుల కథలే ఇవి...

పదేళ్లు... 1.4 లక్షల కోట్లు!!
పనిచేస్తున్న కంపెనీ... ఓ అంతర్జాతీయ దిగ్గజం. చేతిలో పెట్టుబడేదీ లేకుండా ఆ దిగ్గజాన్ని ఢీకొట్టాలంటే!!. ఎవరైనా నవ్విపోతారు.!!. సచిన్‌ బన్సల్‌– బిన్నీ బన్సల్‌ ఊరూ, పేరూ కలిసినా... ఎలాంటి బంధుత్వమూ లేదు. చండీగఢ్‌లో పుట్టి ఇద్దరూ అక్కడే చదువుకున్నారు. ఐఐటీ ఢిల్లీలో కలిశారు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఐటీ రాజధాని బెంగళూరుకొచ్చారు. సచిన్‌ అమెజాన్‌లో చేరాడు. బిన్నీ బన్సల్‌ మాత్రం గూగుల్‌లో ఉద్యోగానికి రెండుసార్లు దరఖాస్తు చేసి ఫెయిలయ్యాడు. చివరకు తానూ అమెజాన్‌లోనే చేరాడు. కొన్నాళ్లు పనిచేశాక ఇద్దరికీ ఒకటే అనిపించింది. తాము పనిచేస్తున్న అమెజాన్‌ స్థాయిలో దేశీ ఈ–కామర్స్‌ కంపెనీలేవీ సేవలందించటం లేదని!!. అంతే... సేవింగ్స్‌గా దాచుకున్న రూ.2 లక్షలూ పెట్టి... తమ ఫ్లాట్‌లోనే 2007లో ‘ఫ్లిప్‌కార్ట్‌’ను ఆరంభించారు.

పుస్తకాలు విక్రయించేవారిని లిస్ట్‌ చేసి... అమెజాన్‌ మాదిరే ఆరంభంలో తామూ ఆన్‌లైన్లో పుస్తకాలు విక్రయించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఇరువురి తల్లిదండ్రులూ నెలకు రూ.10 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. అది ఆరంభం. తరవాత బుక్స్‌ నుంచి ఇతరత్రా వస్తువులమ్మే సెల్లర్లను తమ సైట్‌లో లిస్ట్‌ చేయటం మొదలెట్టారు. అమెజాన్‌కు పోటీగా దేశీ ఈ–కామర్స్‌ సంస్థ ఒకటి రూపుదిద్దుకుంటున్నది తెలిసి... విదేశీ ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. వరసగా ఇన్వెస్ట్‌ చేయటం మొదలెట్టారు. కంపెనీ విలువ పెరిగింది. ఇద్దరూ బిలియనీర్లయ్యారు. ఈ మధ్యే ఫ్లిప్‌కార్ట్‌ను రూ.1.4 లక్షల కోట్ల విలువతో అమెరికన్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ సొంతం చేసుకుంది. ‘‘మా కాన్సెప్ట్‌ కొత్తదేమీ కాదు. కాకపోతే ఈ–కామర్స్‌లో నాణ్యమైన సేవలందించటమే మా ప్రత్యేకతగా పనిచేశాం. దానిపైనే దృష్టిపెట్టాం. అందుకే నిలబడ్డాం’’ అంటారు బన్సల్‌ ద్వయం.

క్యాబ్‌ డ్రైర్‌తో గొడవొస్తే...?
ఉదయం ఏడుకు లేస్తే రాత్రి ఒంటి గంట వరకూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాడు భవీష్‌ అగర్వాల్‌. ఖాళీ దొరికితే సైక్లింగ్‌ చేస్తాడు. స్క్వాష్‌ ఆడతాడు. సినిమాలకు, మొబైల్‌ గేమ్స్‌కు మాత్రం చాలా దూరం. పుట్టింది లుథియానాలో. 2008లో ఐఐటీ బోంబే నుంచి పట్టా అందుకున్నాక మైక్రోసాఫ్ట్‌లో మంచి ఉద్యోగమొచ్చింది. రెండేళ్లే పని చేశాడు. కంప్యూటర్‌కు అతక్కుపోయే ఆ ఉద్యోగంలో కిక్కు లేదనిపించింది. రాజీనామా చేసేశాడు. ముంబయిలో వెబ్‌సైట్‌ పెట్టి... ఆన్‌లైన్లో వివిధ ట్రావెల్‌ కంపెనీల టూర్‌ ప్యాకేజీలను విక్రయించటం మొదలెట్టాడు. ‘ట్రావెల్‌ ఏజెంటుగా మిగిలిపోతావేమో’ అన్నారు అమ్మానాన్నా. ‘పర్వాలేదు కదా!!’ అనుకున్నాడు.

ఓసారి బెంగళూరు నుంచి క్యాబ్‌లో బండిపురా నేషనల్‌ పార్క్‌కు వెళుతున్నాడు భవీష్‌. దార్లో ఆపేసిన క్యాబ్‌ డ్రైవర్‌... ముందు మాట్లాడింది తక్కువని, కాస్త ఎక్కువివ్వాలని పేచీ పెట్టాడు. అలా దార్లో బేరమాడటం భవీష్‌కు నచ్చలేదు. కుదరదన్నాడు. దీంతో డ్రైవరు దార్లోనే భవీష్‌ను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ క్యాబ్‌ డ్రైవరుపై ఫిర్యాదు చేసి, పోరాడమని సలహా ఇచ్చారు కొందరు. దాంతో లాభం లేదని గ్రహించాడు. ఇంకెవరికీ ఇలాంటివి జరగకుండా టెక్నాలజీతో పరిష్కారం చూపించాలనుకున్నాడు. అలా పుట్టిందే... ఓలా!!. 2010లో మిత్రుడు అంకిత్‌ భాటి తోడవటంతో... ఓలా కొత్త మలుపు తిరిగింది. భారీ పెట్టుబడులొచ్చాయి. ఈ కంపెనీ విలువ... దాదాపు రూ.50 వేల కోట్లు!!. 

క్యాన్సర్‌ ఇచ్చిన ధైర్యం... ‘జెట్‌ సెట్‌ గో’
ఏ విమానంలోనైనా చూడండి! ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు. గ్రౌండ్‌ స్టాఫ్‌లోనూ ఆడవాళ్లే. కానీ ఆ విమాన సంస్థల అధిపతులో? అంతా మగవారే. అదీ పరిస్థితి. అలాంటి రంగంలో స్థిరపడాలనుకుంది కనిక టేక్రీవాల్‌. 18 ఏళ్లకు ఎయిర్‌వేస్‌లో ఉద్యోగం  వచ్చింది. కొన్నాళ్లు చేశాక ఎంబీఏ కోసం యూకే వెళ్లింది. కానీ ఎంబీఏ పూర్తవుతూనే 2011లో ఆమెకు క్యాన్సర్‌ అని తేలింది. ఓ డాక్టర్‌ను కలిసింది. ‘నీకింకా కొన్నిరోజులే మిగిలున్నాయి’ అన్నాడాయన. కానీ ఆమె ముందు ఆ క్యాన్సరే ఓడిపోయింది.‘‘అది వరమో, శాపమో అని చెప్పను. నా జీవితంలో అదో క్లిష్టమైన దశ. చాలా ధైర్యాన్ని, ఖాళీ సమయాన్ని ఇచ్చిన దశ’’ అంటారు కనిక. అప్పట్లో దొరికిన ఖాళీ సమయాన్ని పూర్తిగా భవిష్యత్‌ ప్రణాళిక కోసం కేటాయించింది. అక్కడే.. ఛార్టర్డ్‌ విమానాలను, హెలికాప్టర్లను అద్దెకిచ్చే ‘జెట్‌సెట్‌గో’ రూపుదిద్దుకుంది. సొంత విమానాలు, హెలికాప్టర్లు ఉన్న వారితో ఓ నెట్‌వర్క్‌ను రూపొందించి... అద్దెకు కావాలనుకున్న వారితో సంధానించటమే ఈ సంస్థ పని. అంటే.. ‘గగనతల ఓలా’ అన్నమాట. తల్లిదండ్రులు ఈ ఆలోచనకు ససేమిరా అన్నారు. విమానయాన రంగంలో మహిళలు రాణించలేరన్నారు. కానీ క్యాన్సర్‌ను గెలిచిన ఈ మొండిఘటం వినలేదు. పునీత్‌ దాల్మియా, యువరాజ్‌ సింగ్‌ వంటి వారిని కలిసింది. 2014లో ఆరంభించిన కొన్నాళ్లకే వారు పెట్టుబడులు పెట్టడంతో జెట్‌ సెట్‌గో నిలదొక్కుకుంది. రెండేళ్లు తిరక్కుండానే లాభాల్లోకీ వచ్చింది. 

కాలేజీ చదువు  మధ్యలో ఆపేసి...
రితేష్‌ అగర్వాల్‌ పుట్టింది ఒడిశాలోని కటక్‌లో. స్కూల్‌ చదువు అక్కడే సాగింది. కాలేజీలో అడుగు పెట్టాడు కానీ... అక్కడ ఇమడలేకపోయాడు. క్లాసురూమ్‌లో కన్నా బయటే నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకున్నాడు. చదువు మానేశాడు. గెస్ట్‌హౌస్‌లు, టూరిస్ట్‌ లాడ్జ్‌లు, బడ్జెట్‌ హాస్టళ్లను ఆన్‌లైన్లో లిస్ట్‌ చేయడానికి ‘ఓరావెల్‌’ పేరిట ఓ వెబ్‌సైట్‌ ఆరంభించాడు. దానికోసం దేశమంతా తిరిగాడు. చాలాచోట్ల బసచేశాడు. ఆయా హోటల్స్‌ లిస్ట్‌ చేస్తున్నపుడు... అక్కడ తను ఉండటానికి ఫ్రీగా గది ఇవ్వాలని అడిగేవాడు. ‘‘ఎవ్వరూ ఇవ్వలేదు. నేను వాళ్ల వ్యాపారాల్ని లిస్ట్‌ చేస్తున్నందుకు వాళ్లు ఆ మాత్రం కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యమనిపించింది’’ అంటాడు రితేష్‌. అయితే ఇలా దేశమంతా తిరగటంలో రితేష్‌కు పలు విషయాలు తెలిసొచ్చాయి. వాటిలో మొదటిది... చిన్న హోటళ్లు, బడ్జెట్‌ హోటళ్లలో గదులు ఏమాత్రం బాగులేవని.!

‘‘ఆన్‌లైన్‌లో హోటల్‌ గదిని ముందుగా బుక్‌ చేసుకోవాలనుకుంటే అది ఎలా ఉంటుందో తెలీదు. సిబ్బంది ఎలాంటివారో, భోజనం ఎలా ఉంటుందో... ఏమీ తెలీదు. ఇవన్నీ చూశాక... బడ్జెట్‌ హోటల్స్‌లో స్టార్‌ హోటల్‌ అనుభవాన్నిస్తే విజయం తథ్యమనిపించింది. ఇదే ఓయోకు బీజం వేసింది’’ అంటారు రితేష్‌. చిన్న బడ్జెట్‌ హోటల్స్‌తో ఒప్పందం చేసుకొని... వాటిలో కొన్ని గదుల్ని ఏసీతో, అందంగా, ఆరోగ్యకరంగా మార్చడం చేశాడు. ఫ్రీ వై–ఫై, టీవీ, బ్రేక్‌ ఫాస్ట్‌ ఏర్పాట్లు చేశాడు. ఆన్‌లైన్లో ఫోటోలు కూడా ఉండటంతో... వాటికి ఆదరణ పెరిగింది. ఓయో రూమ్స్‌తో మొదలై... ఐదేళ్లలో ఓయో టౌన్‌హౌస్, ఓయో హోమ్స్, ఓయో సిల్వర్‌ కీ వంటి పలు విభాగాల్లోకి విస్తరించారు. ప్రస్తుతం చైనా, మలేషియా, నేపాల్‌లోనూ ఓయో సేవలు అందిస్తోంది. అంతర్జాతీయ హోటల్‌ కంపెనీలతో సహా పలు ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు ఓయోలో పెట్టుబడులు పెట్టాయి. ఇపుడు ఓయో విలువ... బిలియన్‌ డాలర్లపైనే! అంటే రూ.6,800 కోట్లపైమాటే.

ఆ ఓటమి...  చాలా నేర్పింది!
నందన్‌ రెడ్డిది కడప. శ్రీహర్ష మాజేటిది విజయవాడ. ఒకరు ఎమ్మెస్సీ.. మరొకరు ఇంజినీరింగ్‌. కాకపోతే ఇద్దరూ చదివింది మాత్రం బిట్స్‌ పిలానీలోనే. శ్రీహర్ష ఇంజినీరింగ్‌ చదువుతుండగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగానికి సెలక్ట్‌ అయ్యాడు. ఎవరైనా చేరేవారేమో!! కానీ శ్రీహర్ష వద్దనుకున్నాడు. క్యాట్‌ రాసి ఐఐఎం కోల్‌కతాలో చేరాడు. పూర్తవుతూనే లండన్‌లోని ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ పిలిచింది. లండన్‌ బాగుంటుందని వెళ్ళాడు. సిటీ నచ్చింది కానీ అక్కడి ఉద్యోగం నచ్చలేదు. రెండేళ్లు చేసి వెనక్కి వచ్చేశాడు. స్నేహితుడు నందన్‌ కలిశాడు. నందన్‌ అప్పటికే చిన్న వ్యాపారాల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘టెక్నాలజీ, ఉద్యోగాలు, లాజిస్టిక్స్‌’ మూడూ కలిసి ఉండే కంపెనీని పెడదామనుకున్నారు. సొంత వెబ్‌సైట్లున్న వ్యాపారులు... డెలివరీ చేయలేక ఈ–కామర్స్‌ సంస్థల్లో నమోదు చేసుకుంటున్నారని గ్రహించి... వారిని, డీటీడీసీ– ఫెడెక్స్‌– తదితర కొరియర్‌ సంస్థలను కలిపేలా ‘డెమొక్రటిక్‌ షిప్పింగ్‌’కు రూపకల్పన చేశారు. దీనికోసమే 2013లో ‘బండిల్‌’ను ఆరంభించారు.  కాకపోతే దీనికి తగ్గ టెక్నాలజీని అభివృద్ధి చేయటం వారి వల్ల కాలేదు. ఆ పనిని ఓ కంపెనీకి అప్పగించారు. అది పూర్తయ్యేసరికి ఏడాదిపైనే పట్టింది. తాము తయారు చేయదలచుకున్న ఉత్పత్తి బయటికొచ్చేసరికి మార్కెట్‌ పరిస్థితులు మారిపోయాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ కంపెనీలు సొంత డెలివరీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.

‘‘మార్కెట్‌కు మా ఉత్పత్తి పనికిరాదని అర్థమైపోయింది. అదృష్టమేంటంటే మాకు వేరే ఉద్యోగులు లేరు. మేం తప్ప ఎవరూ ఇన్వెస్ట్‌ చేయలేదు కూడా. అప్పులు కూడా లేవు. ఏడాదిలోపే బండిల్‌ను మూసేశాం’’ అంటారు స్విగ్గీ ద్వయం.‘బండిల్‌’ ప్రయాణంలో వారికి కొన్ని విషయాలు తెలిసొచ్చాయి. దేశంలో లాజిస్టిక్‌ కంపెనీలు దయనీయంగా ఉన్నాయని, వాటికి టెక్నాలజీ ఏమాత్రం అందుబాటులో లేదని తెలిసింది. దీంతో 2014 సెప్టెంబర్లో రెస్టారెంట్లను, వినియోగదార్లను తమ సొంత డెలివరీ యంత్రాంగంతో కలుపుతూ బెంగళూరులో స్విగ్గీని ఆరంభించారు. తరవాత వారికి మరో స్నేహితుడు రాహుల్‌ జైమిని వారికి తోడయ్యాడు. ఇపుడు దేశంలోని 13 నగరాల్లో సేవలందిస్తున్న స్విగ్గీకి 50 లక్షల మంది కస్టమర్లున్నారు. 25 వేల రెస్టారెంట్లతో ఒప్పందాలున్నాయి. భారీగా నిధులూ వచ్చాయి. సంస్థ విలువ... దాదాపు రూ.17వేల కోట్లు!!.

ఫెయిల్యూర్‌తో... గెలిచారు!
కాలేజీ నుంచి స్నేహితులైన అభిరాజ్‌ భాల్, వరుణ్‌ ఖైతాన్‌ ఇద్దరిదీ అమెరికాలోని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌లో ఉద్యోగం. మంచి జీతం. కానీ ఇద్దరిదీ ఒకటే ఆలోచన. ఇండియాకి వెళ్లి ఏదో ఒక వ్యాపారం పెట్టాలని. ఎంత చర్చించుకున్నా ఏం వ్యాపారం పెట్టాలో మాత్రం తేల్చుకోలేకపోయారు. అలా చర్చిస్తుంటే... ఏమీ చెయ్యకుండానే మిగిపోతామని భయమేసి... 2013లో ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ఇండియాకు తిరిగి వచ్చేశారు. చాలా ఆలోచించిన మీదట.. బస్సులు, రైళ్లు, విమానాల్లో ఆన్‌డిమాండ్‌ సినిమాల్ని ప్రదర్శించే బాక్స్‌లను తయారు చెయ్యాలనుకుని... ‘సినిమాబాక్స్‌’ సంస్థను ఏర్పాటుచేశారు. ఆరునెలలు గడిచాయి. ఆ మార్కెట్‌ చాలా చిన్నదని, దాన్లో విస్తరణకు పెద్ద అవకాశాల్లేవని వారికి అర్థమైంది. అదేమీ జీవితాన్ని మార్చే టెక్నాలజీ కాదని భావించారు. బాధపడ్డా... మూసేశారు. ఇంతలో ‘బగ్గీ.ఇన్‌’ పేరిట రైడ్‌షేర్‌ సంస్థను నడుపుతున్న రాఘవ్‌చంద్ర కలిశాడు. తనదీ ఇలాంటి కథే. బగ్గీ పెద్దగా సక్సెస్‌ కాలేదు. దీంతో మూసేశాడు. అప్పుడు వీళ్ల దృష్టి దేశంలో అసంఘటితంగా ఉన్న వృత్తి పని కార్మికులపై పడింది.

ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, యోగా ట్రెయినర్‌... ఇలా ఎవరు కావాలన్నా సామాన్యులు పడుతున్న బాధలు చూశారు. వారందరినీ ఆన్‌లైన్లోకి తెద్దామనుకున్నారు.  ఈ ఆలోచనను చాలామందితో పంచుకున్నారు. అంతా నవ్వేశారు. అభిరాజ్, వరుణ్, రాఘవ్‌ మాత్రం ఎవరిమాటా వినలేదు. టెక్నాలజీ తోడుగా వృత్తి పనివాళ్లందరినీ ఒక వేదికపైకి తెస్తూ.. ‘అర్బన్‌క్లాప్‌’ను ఏర్పాటు చేశారు. ‘అవసరం నుంచి పుట్టిన ఏ ఆలోచనకైనా తిరుగుండదు’ అనే మాటను నిజం చేస్తూ అర్బన్‌ క్లాప్‌ ఇపుడు దేశంలోని ప్రధాన నగరాలన్నిటా విస్తరించింది. వృత్తి నిపుణుల వివరాలు ఇవ్వటానికే పరిమితం కాకుండా... మొదటి నుంచీ దాన్ని తగిన ఆదాయాన్నిచ్చే వ్యాపారంగా మార్చటానికి ప్రయత్నించారు. ఫలితం... రతన్‌ టాటా దీన్లో పెట్టుబడి పెట్టారు. అంతేకాదు! యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ ఇండియాకు వచ్చినపుడు వీరిని కలిసి అర్బన్‌క్లాప్‌ సేవల్ని అడిగి తెలుసుకున్నారు కూడా. కంపెనీ విలువ ఇదమిత్థంగా తెలియకపోయినా... ఇప్పటికే ఇది దాదాపు రూ.40 కోట్ల నిధుల్ని సమీకరించింది. 

కలెక్టరు గిరీ... కాదనుకున్నాడు!!
ఏ యువకుడైనా ఇలా ఉండాలి అని రోమన్‌ సైనీని చూపించొచ్చు!! ఇలా ఉండకూడదు అని కూడా సైనీని కొందరు చూపిస్తారేమో!! ఎందుకంటే మెడిసిన్‌ చదివిన వెంటనే... 22 ఏళ్లకే సివిల్స్‌ రాసి సెలక్టయిపోయాడు. శిక్షణ పూర్తయ్యాక మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా సహాయ కలెక్టర్‌గా ఉద్యోగం కూడా వచ్చేసింది.  పాతికేళ్లు కూడా రాకుండానే ఇలా సెటిలైపోతే ఇంకేం కావాలి..? సైనీని మాత్రం అసంతృప్తి తొలిచేస్తోంది. ఇంకేదో చెయ్యాలనే తపన కుదురుగా ఉండనివ్వటం లేదు. అంతే!!. ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఇంట్లో వాళ్లు వద్దన్నారు. వినలేదు. తనకు మెడిసిన్, సివిల్‌ సర్వీస్‌ రాసిన అనుభవం ఉంది కనక వైద్యులు, ప్రోగ్రామర్లు, సివిల్‌ సర్వెంట్లు కావాలనుకున్న వారికి... పాఠాలు చెప్పి యూట్యూబ్‌లో పెట్టడం మొదలెట్టాడు. ఈ లెక్చర్లు చాలా మందికి పనికొచ్చాయి.

ఓ పది మంది ఐఏఎస్‌లు తయారయ్యారు. తను ఉద్యోగం చేస్తే... ఒకడే! కానీ పది మంది ఐఏఎస్‌లను తయారు చేశాడు!! ఆ కిక్కు.. సైనీకి నచ్చింది. స్నేహితుడు గౌరవ్‌ ముంజల్‌తో కలిసి 2015 డిసెంబరు 15న లాంఛనంగా అన్‌అకాడెమీని ఆరంభించాడు. దానిపేరిట వందల వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. తరవాత విద్యార్థులు, విద్యా నిపుణులు, లెక్చరర్లు తమ సొంత పాఠాల్ని ఎవరికి వారు అప్‌లోడ్‌ చేసేలా ఏర్పాట్లు చేశాడు. వీళ్లందరూ అందించే కంటెంట్‌... మారుమూల గ్రామాలకు చేరాలన్నది రోమన్‌ సైనీ ఆశయం. నాణ్యమైన విద్యకు దూరంగా ఉన్న పలు గ్రామాల్లోని విద్యార్థులు... నిపుణులైన విద్యావేత్తల తాలూకు పాఠాల్ని ఇలా ఆన్‌లైన్‌ ద్వారా అందుకోవచ్చన్నది తన ఆలోచన. ఈ మధ్యే అన్‌అకాడెమీలో అంతర్జాతీయ సంస్థలు రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టాయి. సంస్థ విలువ దాదాపు రూ.75–80 కోట్లు!!.

ఏ డాక్టర్‌నైనా కన్సల్ట్‌ చేయొచ్చు!!
సతీష్‌ కణ్ణన్, దీనదయాళన్‌ ఇద్దరూ ఐఐటీ మద్రాస్‌లో స్నేహితులు. 2012లో ఇంజినీరింగ్‌ పూర్తయి బయటికొచ్చాక సతీష్‌ పుణెలోని ఫిలిప్స్‌ హెల్త్‌కేర్‌లో చేరాడు. దీనదయాళన్‌ మాత్రం ఐఐటీలోని ఇన్నోవేషన్‌ సెంటర్లో డయాబెటిక్‌ రెటినోపతిని కనుక్కునే పరికరం తయారీలో మునిగిపోయాడు. ఏడాది ఉద్యోగం చేసిన సతీష్‌... ఉద్యోగంలో భాగంగా హెల్త్‌కేర్‌ సేవల్ని బాగా గమనించాడు. స్పెషలిస్టు వైద్యుల సేవలు సామాన్యులకు అందటం చాలా కష్టమవుతోందని తెలుసుకున్నాడు. దీన్ని టెక్నాలజీ సాయంతో అధిగమించాలని భావించి... దీనదయాళన్‌తో చెప్పాడు. ఇద్దరూ కలిసి 2013లో పాసర్జ్‌ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తమ ఆలోచనను అమల్లోకి తేవటంపై దృష్టిపెట్టారు.దాదాపు రెండేళ్ల కృషి తరవాత వారిద్దరూ డాక్స్‌యాప్‌ను అభివృద్ధి చేయగలిగారు. 2015లో డాక్స్‌యాప్‌ను ఆరంభించారు. స్పెషలిస్ట్‌ వైద్యులు, పేషెంట్లను కలిపే యాప్‌ ఇది. చాట్‌ లేదా కాల్‌ ఆధారంగా ఎవరైనా సరే... దేశంలోని ఏ స్పెషలిస్టు వైద్యుడినైనా 30 నిమిషాల్లోపే సంప్రతించవచ్చు.కన్సల్టేషన్, మందుల డెలివరీ, ఇంటిదగ్గరే ల్యాబ్‌టెస్టుల వంటి సేవలందిస్తున్న డాక్స్‌ యాప్‌లో గైనిక్, సైక్రియాట్రీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాక్, ఆంకాలజీ, న్యూరో, ఇన్ఫెర్టిలిటీ, పీడియాట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్, ఆర్థోపెడిక్‌ వంటి విభాగాల్లో 1500కు పైగా వైద్యులున్నారు. ఇప్పటికే సంస్థలో పలు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు దాదాపు రూ.50 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాయి. 

లా చదివి... ఆరోగ్య రంగంలోకి!!
నయ్యా సగ్గి గురించి ఆమె తల్లికెప్పుడూ ఆందోళనే. ఎందుకంటే స్కూలు స్థాయిలో సగ్గి మార్కులు అంతంత మాత్రంగానే ఉండేవి. ‘పెద్దయ్యాక ఏమవుతావో’ అని తల్లి ఎప్పుడూ బెంగపడుతూనే ఉండేది. ముంబైకి చెందిన సగ్గి... అందరు పిల్లల్లానే ఆ వయసులో ఎలాంటి భవిష్యత్‌ ప్రణాళికలూ లేకుండానే పెరిగింది. కాకపోతే అప్పుడప్పుడూ నేషనల్‌ లా స్కూల్‌లో చదివే తన సోదరి చెప్పే మాటలు మాత్రం ఆమెను ఆకర్షించేవి. ఒక దశలో... తానూ బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌లో చదవాలని ఫిక్సయిపోయింది. తల్లి ఆందోళన పెరిగిపోయింది. ‘తరవాత బాధ పడతావేమో!’ అని హెచ్చరించింది. సగ్గి తను గనక ఒక నిర్ణయం తీసుకుంటే... ఇక ఎవరి మాటా వినే ప్రసక్తే లేదు. కష్టమైన లా ఎంట్రన్స్‌ నెగ్గి... ఎన్‌ఎల్‌ఎస్‌లో సీటు సంపాదించింది. అదిగో... అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. ‘అదంతా వేరే ప్రపంచం. ఆడుతూ     పాడుతూ గడిచిపోయింది. కెజి బాలకృష్ణన్‌ వంటి న్యాయ మూర్తులతో పాటు విదేశీ న్యాయ నిపుణులనూ కలిసే అవకాశం దక్కింది’ అంటారామె. చదువుతున్నపుడే స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్‌’ కోసం పనిచేసింది సగ్గి. అదిగో... ఆ తపనే ఆమెకు ప్రతిష్ఠాత్మక ఫుల్‌బ్రైట్, హార్వర్డ్‌ స్కాలర్‌షిప్‌లు తెచ్చిపెట్టింది. 

హార్వర్డ్‌లో నాలుగేళ్లూ ఇట్టే గడిచిపోయాయి. ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, వాటిని భారీస్థాయికి తీసుకెళ్లటం వంటి అంశాలపై ఆమె ప్రాజెక్టు చేసింది. తరవాత ఇండియాకు తిరిగొచ్చింది. ‘ఏం చేసినా ఒక తరాన్ని ప్రభావితం చేయగలగాలి’ అనుకునే సగ్గి.. తన స్నేహితులు తల్లి కాబోయేటపుడు సరైన సమాచారం, ఉత్పత్తులు దొరక్క పడుతున్న ఇబ్బందులు గమనించింది. న్యూక్లియర్‌ కుటుంబాల కారణంగా... ఇంటర్నెట్‌లో టూర్‌ ప్యాకేజీలు, సినిమా టికెట్లు కూడా బుక్‌ చేసే తల్లిదండ్రులు... పిల్లల విషయంలో మాత్రం సరైన సలహా పొందలేకపోతున్నారని గ్రహించింది. పాత స్నేహితుడు మొహిత్‌కుమార్‌తో అన్నీ చర్చించింది. అదిగో... అక్కడే ‘బేబీ చక్ర’ రూపుదిద్దుకుంది. కాబోయే తల్లిదండ్రుల నుంచి.. బిడ్డను కన్న తల్లిదండ్రుల వరకూ వారికి కావాల్సిన సలహాలు, సూచనలు నిపుణుల ద్వారా ఇప్పిస్తూ... వారికి మార్గ దర్శకత్వం వహించటమే బేబీ చక్ర పని. అంతేకాదు. బేబీ ఉత్పత్తులు, ఇతరత్రా సర్వీసులు అందించేవారు కూడా దీన్లో లిస్టయ్యారు. మొత్తమ్మీద పిల్లల జీవితానికి కావాల్సిన అన్నిటినీ సంస్థ అందిస్తోంది. ఇటీవలే రెండు దశలుగా నిధులు కూడా వచ్చాయి. తొలినాళ్లలోనే ముంబై ఏంజిల్స్‌ పెట్టుబడి పెట్టగా... తరవాత విదేశీ నిధులొచ్చాయి. కాకపోతే ఇప్పటికీ సగ్గి తల్లికి కుమార్తె విషయంలో ఆందోళనే. వారానికోసారి ఫోన్‌ చేసి... ‘‘బేబీ చక్రలో కొత్తగా ఏం వచ్చాయి?’’ అని అడుగుతుంటుంది.

వ్యాపారానికి ‘పల్స్‌’ దొరికింది..!
శ్రీనుబాబుది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. రోజూ స్కూలుకు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అక్కడే ఇంటర్‌ పూర్తి చేశాడు. ఏయూలో బీఫార్మ్,. ఎంటెక్‌ బయోటెక్నాలజీ పూర్తయింది. పీహెచ్‌డీలో భాగంగా శరీరంలోని ప్రొటీన్లను విÔó్లషించి... మధుమేహ ముప్పును ముందే కనుక్కోవటంపై పరిశోధన చేశారు. 2006లో దక్షిణ కొరియాలోని సియోల్‌లో అంతర్జాతీయ ప్రొటియం ఆర్గనైజేషన్‌... ఈ పరిశోధన చేసినందుకు శ్రీనుబాబుకు యంగ్‌సైంటిస్ట్‌ అవార్డిచ్చింది. అపుడాయన వయసు 24 ఏళ్లు. ఈ రీసెర్చ్‌కోసం తాను ఆంధ్రా వర్సిటీతో పాటు వారి సిఫారసుతో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎన్, సీసీఎంబీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పలు జర్నల్స్‌ చదివానని, అలాంటివి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. చెప్పటమే కాదు! ప్రతి యూనివర్సిటీ ప్రచురించే పరిశోధన పత్రాల్ని అందరికీ అందుబాటులో ఉంచే ‘ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్‌’ను ఆరంభించారు కూడా. దానికి అంతర్జాతీయ సంస్థల అనుమతి పొందారు. అదే ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌కు నాంది. ఇక్కడ ఇంకో చిక్కుంది. ఈ జర్నల్స్‌ను ఎడిట్‌ చేయటానికి ఏటా ఎడిటోరియల్‌ బోర్డు సమావేశమవుతుంది. అంతా వివిధ రంగాల్లో నిపుణులే కావటంతో విదేశాల్లో వారికి ఆతిథ్యమివ్వటం... సమావేశం నిర్వహించటం బాగా ఖర్చుతో కూడుకున్న పని. అది ఇంకో వ్యాపారానికి నాంది పలికింది.

ఎడిటోరియల్‌ బోర్డు సమావేశాలప్పుడు దానికి హాజరయ్యే నిపుణులతో అక్కడే సదస్సులు నిర్వహించటం మొదలెట్టారు శ్రీను బాబు. పల్సస్‌.కామ్‌ ద్వారా తాము ప్రచురించే జర్నల్స్‌ను చదివే 5 కోట్ల మంది పాఠకులకు ఆ సమాచారాన్ని చేరవేశారు. కావాల్సిన వారు ఆ సదస్సులకు హాజరు కావొచ్చన్నారు. అది ఊహించని విజయాన్నిచ్చింది. ఇపుడు ఏటా 3వేలకు పైగా సదస్సులు నిర్వహించే స్థాయికెళ్లారు. ‘ఒమిక్స్‌’కు ఇవన్నీ భారీ ఆదాయ మార్గాలుగా మారాయి. పరిశోధక జర్నల్స్‌ను జర్మన్, చైనీస్‌ తదిరత భాషల్లోకి అనువాదం చేస్తుండటంతో రెవెన్యూ బాగా పెరిగింది. టర్నోవర్‌ రూ.1,300 కోట్ల స్థాయికి చేరింది. ఉద్యోగుల సంఖ్య 4,800కి పెరిగింది. తాజాగా భారతీయ భాషల్లోకి ఈ జర్నల్స్‌ను అనువదించే ప్రాజెక్టుకూ శ్రీకారం చుట్టింది పల్సస్‌. ‘‘మన చుట్టూ వ్యాపారావకాశాలు ఉంటాయి. వాటిని చూడాలి. జనం సమస్యలకు పరిష్కారంగా ఏదైనా వ్యాపారాన్ని ఆరంభిస్తే... దానికి తిరుగుండదు’’ అంటారు శ్రీనుబాబు గేదెల.

ఇవన్నీ ‘అగ్ర’గేటర్లు...
అమెజాన్‌ ఒక్కవస్తువూ తయారు చెయ్యదు. ఏ వస్తువూ నేరుగా అమ్మదు. కానీ అమ్మేవారంతా ఈ సైట్లోనే ఉంటారు కనక ప్రపంచమంతా కొనేది అమెజాన్లోనే!! రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఉబెర్‌దీ ఇలాంటి కథే. సొంతగా ఒక్క ట్యాక్సీ లేదు. కానీ ప్రపంచంలో అతిపెద్ద ట్యాక్సీ సర్వీస్‌ ఇదే! ఇటీవలే ఇది ప్రపంచ వ్యాప్తంగా 10వేల కోట్ల ట్రిప్పులను పూర్తిచేసుకుంది. ఇక సొంతగా ఒక్క హోటలూ లేని ‘ఎయిర్‌ బీఎన్‌బీ’... ప్రపంచంలోనే అతిపెద్ద హాస్పిటాలిటీ సంస్థ. ఇంటర్నెట్‌ దిగ్గజం, నెంబర్‌ వన్‌ వీడియో ఛానెల్‌ యూట్యూబ్‌కు సొంత వీడియో ఒక్కటీ ఉండదు. ఇదే అగ్రిగేటింగ్‌ కంపెనీల మహత్యం. అవసరం ఉన్నవారిని– ఆ అవసరాన్ని తీర్చేవారిని ఒకే వేదికపైకి తేవటమే ఇవి చేసే పని. ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా ఉంది.

ఇంటర్నెట్‌ సాయంతో యావత్తు ప్రపంచాన్నీ ఏలుతున్న ఈ టాప్‌ అగ్రిగేటర్లన్నీ... అగ్రరాజ్యం అమెరికాలో పురుడు పోసుకున్నవే. అమెరికన్‌ కంపెనీలే!వీటి స్ఫూర్తితో భారతీయ యువత మరింత ముందుకు వెళుతోంది. ఇక్కడి స్థానిక సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు వెదుకుతోంది. చేతిలో సొమ్ము లేకున్నా వీరికి దమ్ము పుష్కలంగా ఉంది. అమ్మానాన్నలు అంబానీలు కాకున్నా... ఉన్న ఉద్యోగానికి సైతం గుడ్‌బై కొట్టేసేంత తెంపరితనమూ ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఓలా వంటి యూనికార్న్‌లే కాదు. విద్యారంగంలో ఎడ్యుటర్, లెర్న్‌ సోషల్‌... రైడ్‌షేర్‌ రంగంలో జుగ్నూ, డ్రైవర్జ్‌... ట్రావెల్స్‌లో అభిబస్, రెడ్‌బస్‌... ఫుడ్‌ డెలివరీలో జొమాటో, హోలాషెఫ్‌... హెల్త్‌కేర్‌లో ప్రాక్టో, లైబ్రేట్‌... ఆతిథ్య రంగంలో నెస్ట్‌ ఎవే... గృహాలంకరణకు సంబంధించి లివ్‌ స్పేస్‌... లాజిస్టిక్స్‌లో లింక్, పోర్టర్‌... వినోద రంగంలో బుక్‌ మైషో... ఇవన్నీ ఆయా రంగాల్లో దేశీయంగా విజయం సాధించిన అగ్రిగేటర్లని చెప్పాలి. వీటిలో దాదాపు అన్ని కంపెనీల్లోకీ భారీగానే పెట్టుబడులొచ్చాయి.
– మంథా రమణమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement