
మన కుటుంబం మన ప్రపంచం!
వెనకటికి ఒక చీమ.. ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరేమిటో మరచిపోయిందట. పొద్దున ఇంటి నుంచి బయలుదేరిన మనిషి కూడా, సవాలక్ష పనుల్లో పడిపోయి ‘కుటుంబాన్ని’ మరచిపోతున్నాడు. ఆ చీమకు తన పేరు మరచిపోవడం వల్ల జరిగిన నష్టమేమిటో తెలియదుగానీ, మనం మన కుటుంబాలను మరచిపోవడం వల్ల ఒక సామాజిక అగాథం ఏర్పడుతుంది. దాని నుంచి అశాంతి ఏర్పడి ధైర్యం సన్నగిల్లుతుంది. ప్రతి చిన్న భయానికీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది.‘‘కుటుంబం అంటే ఏమిటో కాదు... అది మనకు దేవుడు ఇచ్చిన విలువైన కానుక’’ అనే ఒక విలువైన మాట ఉంది.ఎందుకో మరి ఆ విలువైన కానుక చాలామందికి కనబడడం లేదు. బిజీగా ఉండడం గొప్ప విషయమేగానీ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేంత దూరం ఉండడం మాత్రం గొప్ప విషయం కాదంటున్నారు నిపుణులు.
కుటుంబానికి దూరంగా ఉండడం లేదా నిరక్ష్యం చేయడం అనే ధోరణికి మూలాలు మానసికమా? సామాజికమా? ఆర్థికమా? అనుకుంటే చూపుడు వేలు మాత్రం ‘ఎకనామిక్ గ్లోబలైజేషన్’ వైపు చూపుతుంది. మన దేశంలో వేగంగా జరిగిన ప్రపంచీకరణ ఆర్థిక విషయాలకు మాత్రమే పరిమితం కాలేదు. అది సామాజిక సంబంధాలు, కుటుంబ విలువలపై కూడా ప్రభావం చూపుతుంది.
నరుడు విశ్వనరుడు అయ్యాడు.అమ్మానాన్నలు పల్లెటూళ్లో. అబ్బాయిలు, అమ్మాయిలు పట్నంలో. ఉద్యోగరీత్యా అమ్మ ఒకచోట, నాన్న ఒకచోట. దీంతో కుటుంబవిలువల వెలుగు మసకబారుతుంది.ఒక కుటుంబం ఉందంటే, ఎవరూ చెప్పకుండానే కొన్ని విలువలు ఏర్పడిపోతాయి. అవి మనలో ఇంకిపోతాయి.
నాన్న అంటే ఎవరు?
గంభీరంగా ఉంటాడు. అయితే మనసు మాత్రం వెన్న. క్రమశిక్షణతో ఉండాలంటాడు. కాలాన్ని వృథా చేయవద్దు అంటాడు. కార్యశీలతకు ప్రాధాన్యత ఇస్తాడు. తన ముఖం మీద ఎలాంటి బాధ కనిపించకుండా సంక్షోభ సమయాలకు పరిష్కారాలు ఆలోచిస్తాడు.
నాన్న అంటే నాన్న మాత్రమే కాదు... క్రమశిక్షణ మొదలు కార్యశీలత వరకు... కొన్ని ఉన్నతమైన విలువలకు బలమైన ప్రతీక.
ఇక అమ్మ.
నాన్నలా కఠినంగా కనిపించదు. వెన్నలా కరిగిపోతుంది. ఏమాటనైనా మనసు విప్పి చెప్పాలనిపిస్తుంది. అమ్మలో అమ్మ మాత్రమే లేదు మానసిక విశ్లేషకురాలు కూడా ఉంది. ‘ఇదిగో ఈ బాధ వచ్చిందమ్మా’ అంటే ‘అదిగో అలా చెయ్యి’ అంటుంది. నమ్మకం ఇచ్చే ధైర్యానికి, మాటతో కొత్త బాట చూపే సృజనాత్మక విలువలకు అమ్మ అద్దంలాంటిది.ఇక పెద్దన్న అంటే, చిన్నపాటి నాన్న. నాన్న విలువలకు రెండో ఇంచార్జీగా వ్యవహరిస్తాడు. తమ్ముళ్లతో స్నేహంగా ఉంటూనే బాధ్యతతో కూడిన విలువలను నేర్పిస్తాడు. ఇక అక్కలు, చెల్లెలు... ఇద్దరూ అమ్మలే. శ్రామిక విలువలను పంచుకోవడం ఎలానో వాళ్లు చెప్పకనే చెబుతారు. ఆరోజు అమ్మ ఊరెళ్లింది. పెద్దక్క ఉందిగా! మరి చిన్నక్క ఏంచేస్తుంది? పెద్దక్క అన్నం వండుతుంది. చిన్నక్క కూరలు తరుగుతుంది.నవ్వుతూ నవ్వుతూనే తమ్ముళ్లను, అన్నలను వంటాయణంలోకి దింపుతుంది. కుటుంబంలో ఒక్కో వ్యక్తి... ఒక్క విలువను ప్రతిబింబిస్తారు. ఆ విలువలన్నీ కలిసి బలమైన పునాదిని ఏర్పరుస్తాయి. కష్టాల గాలిదుమారాలు ఎన్ని వచ్చినా... ఆ పునాది చెక్కుచెదరకుండా బలంగా ఉంటుంది.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
కుటుంబ విలువలపై డిజిటల్ టెక్నాలజీ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీ ఒక అధ్యయనం నిర్వహించింది. కుటుంబవిలువలపై డిజిటల్ టెక్నాలజీ ప్రతికూల ప్రబావం చూపుతుందని ఈ అధ్యయనం తెలియజేస్తుంది. ఫేస్‌బుక్‌లాంటి సామాజిక అనుసంధాన వేదికల్లో ఎవరి లోకంలో వారు మునిగి పోవడం వల్ల, కుటుంబ సభ్యులలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం, సాన్నిహిత్యం తగ్గిపోతుంది.
ఇప్పుడు మనం ఏంచేయాలి?
మనసు ఉంటే మార్గం ఉంటుంది. కుటుంబానికి దగ్గర కావడం అంటే కుటుంబవిలువలకు దగ్గర కావడమే. అందుకే ఒక ప్రణాళిక రచించుకోండి. దీని ప్రకారం...ఉద్యోగరీత్యా, చదువుల రీత్యా కుటుంబసభ్యుల్లో ఒక్కొక్కరూ ఒక్కోచోట ఉండొచ్చు. అందుకే వారానికి రెండుసార్లు అందరూ కలుసుకునే ఏర్పాట్లు చేసుకోండి. ఒక్క వారం అలా చేసి చూడండి. మీలోకి ఎంత కొత్త శక్తి వచ్చిందో చూసుకోండి.విదేశాల్లో ఉన్నప్పుడు తరచు కలుసుకోవడం కష్టం కాబట్టి ఫోన్‌లో ఎక్కువగా టచ్‌లో ఉండండి. పొడి పొడి మాటలు కాకుండా విశ్లేషణాత్మకమైన సంభాషణ చేయండి. కుటుంబ జ్ఞాపకాలను పంచుకోండి.మీ ఇంట్లో పెద్దగా జరుపుకునే పండగేదో ఉంటుంది. ఆరోజు అందరూ తప్పనిసరిగా కలుసుకోండి. మనసు విప్పి మాట్లాడుకోండి.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే...
మీరొక్కసారి కళ్లు మూసుకొని ఆలోచించండి... ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ‘ఫ్యామిలీ ఈజ్ నాట్ యాన్ ఇంపార్టెంట్ థింగ్.
ఇట్స్ ఎవ్రీ థింగ్’ అది మీ అనుభవంలోకి రావాలంటే కుటుంబాన్ని ప్రేమించండి. ఆ విలువలను గొప్పగా తలకెత్తుకోండి. మీ ఫ్యామిలికీ మన ఫ్యామిలీ తరపున హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్!
‘‘కుటుంబం అంటే ఏమిటో కాదు... అది మనకు దేవుడు ఇచ్చిన విలువైన కానుక’’ అనే ఒక విలువైన మాట ఉంది. ఎందుకో మరి ఆ విలువైన కానుక చాలామందికి కనబడడం లేదు. బిజీగా ఉండడం గొప్ప విషయమేగానీ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేంత దూరం ఉండడం మాత్రం గొప్ప విషయం కాదంటున్నారు నిపుణులు.
కుటుంబం అంటే అందమైన స్వర్గం.
- జార్జ్ బెర్నార్డ్ షా, నాటక రచయిత
వాస్తవాలు తెలుసుకోవడానికి ‘కుటుంబం’
మార్గదర్శనం చేస్తుంది.
- గ్రేస్ కెల్లీ, హాలివుడ్ నటి