
ధర్మ సందేహాలు, సంకటాలు భక్తులకే ఉంటాయని కదా అనుకుంటాం! ఆ సందేహాలన్నింటినీ చక్కగా తీరుస్తుండే ఆధ్యాత్మికవేత్తలు సైతం కొన్ని సందర్భాలలో ధర్మ సంకటంలో పడిపోతుంటారు!! ‘జీవాత్మ, పరమాత్మ వేర్వేరు కాదు’ అనే భావనపై ‘అద్వైత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరాచార్యుల వారు క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో నాలుగు హిందూ పీఠాలను స్థాపించారు. ఆ నాలుగు పీఠాలలో ఒకటైన జ్యోతిర్మఠానికి (బదరీనాథ్) ఇప్పుడు కొత్తగా ‘శంకరాచార్య’ కావలసి వచ్చారు. ఖాళీ అయిన ఆ ఆధ్యాత్మిక పీఠాన్ని భర్తీ చేయడం కోసం అర్హులైన సాధువుల నుంచి ఇటీవలే భారత మహాధర్మ మండలి దరఖాస్తులు ఆహ్వానించింది. దాదాపు రెండు వందల దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటినీ సూక్ష్మంగా వడబోసి, చివరికి నలుగురు సాధువులతో ఒక జాబితాను మండలి సిద్ధం చేసింది. విశేషం ఏమిటంటే.. ఆ నలుగురిలో ఒకరు మహిళ! ‘శంకరాచార్య’ పదవి చేపట్టడానికి మిగతా ముగ్గురితో సమానంగా అన్ని అర్హతలున్న ఆ సాధ్వి పేరు.. హేమానంద్ గిరి. నేపాల్ ఝంపా జిల్లా పరిధిలోని గౌరీగంజ్‌లో ఉన్న ‘సూర్యశివ’ మఠానికి ప్రస్తుత ఆచార్యురాలు.
ఇలా ఒక మహిళ ‘శంకరాచార్య’ స్థానానికి పోటీ పడటం గత పన్నెండు వందల ఏళ్ల చతుర్మఠాల చరిత్రలోనే మొదటì సారి అవడంతో.. ఒకవేళ మహిళనే ఎంపిక చేయవలసి వస్తే ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయా అన్న విషయమై మహా ధర్మ మండలి ఇప్పుడు మీమాంసలో పడిపోయింది! ఆది శంకరాచార్యులు రాసిన ‘మహానుశాసనం’లో ఇందుకు ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని కూడా మండల సభ్యులు శోధిస్తున్నారు. ప్రస్తుతానికైతే పరిష్కారం దొరకలేదు కానీ, శంకరాచార్య అవడానికి కనీస అర్హత ‘దండి’ స్వామి అయి ఉండటం అనే నిబంధన వారి కంటబడింది. అయితే హేమానంద్ గిరి.. ‘దండి’ స్వామి కాదు. కాలేరు కూడా! ఎందుకంటే.. హైందవ «ధర్మశాస్త్రాలు పురుషులను మాత్రమే దండి స్వామిగా అంగీకరిస్తున్నాయి. మరేమిటి సాధనం? మహిళలను ‘తప్పించే’ దారులను వదిలిపెట్టి, ‘తెప్పించే’ దారుల కోసం వెదకడమే. అవును. ఒక కొత్త ఒరవడిని నెలకొల్పాలన్న సదుద్దేశంతో, పూర్వపు నియమాలలో స్వల్ప సడలింపులను చేసుకుంటే అది తప్పు కాబోదు, ధర్మం తప్పినట్టూ అవదు.
Comments
Please login to add a commentAdd a comment