దీర్ఘాయుష్మాన్‌ భవ! | There is no guarantee that man will live forever | Sakshi
Sakshi News home page

దీర్ఘాయుష్మాన్‌ భవ!

Published Tue, Dec 5 2017 12:02 AM | Last Updated on Tue, Dec 5 2017 2:47 PM

There is no guarantee that man will live forever - Sakshi

మనిషి ఎన్నాళ్లు బతుకుతాడో గ్యారంటీ ఏమీ లేదు. అయినా సరే, ప్రతి ఒక్కరూ వీలయినంత ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటారు. పెద్దలు కూడా దీర్ఘాయుష్మాన్‌ భవ అని ఆశీర్వదిస్తారు. అంతవరకూ బాగానేఉంది కానీ, అసలు ఏం చేస్తే మనం ఎక్కువకాలం జీవించగలమో... మన జీవిత ప్రయాణం ఒడుదొడుకులు లేకుండా హ్యాపీగా సాఫీగా ఎలా సాగుతుందో చెప్పే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో చూద్దాం...

మనిషి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేసేది డి విటమిన్‌. అది సమృద్ధిగా లభించేది సూర్మరశ్మిలోనే. అందుకే పొద్దునా, సాయంత్రం ఎప్పుడు వీలయితే అప్పుడు ఒంటికి సూర్యరశ్మి తగిలేలా తిరిగితే సరి.

కంటినిండా నిద్ర పోండి
రోజుకు కనీసం 6గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. అదీ రాత్రి నిద్ర. నిద్ర తక్కువైతే అనారోగ్య సమస్యలు తథ్యం. కాబట్టి కంటినిండా నిద్రపోతే సరి.. ఆయుష్షు అదే పెరుగుతుంది.

పండ్లు తినండి
రోజూ ఏదో ఒక పండు తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల రుతువుల వారీగా దొరికే పండ్లు తినడం చాలా మంచిది.

నొప్పి నివారణ మాత్రలు తగ్గించండి
తలనొప్పి, ఒళ్లు నొప్పులు... వెన్ను నొప్పి...వంటి వాటికి సొంత పరిజ్ఞానంతో పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం అలవాటు చాలామందికి. అయితే పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడటం వల్ల హార్ట్‌ ఎటాక్‌ వంటి ముప్పు పెరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి, పెయిన్‌ కిల్లర్స్‌కు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు.

పెళ్లి చేసుకోండి...
ఒక స్టడీ ప్రకారం పెళ్లి చేసుకున్న స్త్రీలు లేదా పురుషులు అవివాహితులకన్నా 46 శాతం అధికంగా హృద్రోగానికి దూరంగా ఉంటారట. పెళ్లికాని వారితో పోల్చితే వివాహితులలో కార్డియో వాస్కులర్‌ డిసీజెస్‌ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందట. సో... పెళ్లి చేసుకోవాల్సిందే మరి!

నిల్వ వద్దు... తాజానే ముద్దు
నిల్వ ఉంచిన పండ్లు, కూరగాయలలో పోషక విలువలు  తగ్గిపోతాయట. అందువల్ల తాజా పండ్లు, కూరగాయలే మంచిదంటున్నారు పరిశోధకులు.

చక్కెర తగ్గించండి
చక్కెర ఎక్కువ వాడటమంటే కొలెస్ట్రాల్‌ ముప్పును పెంచుకున్నట్టే. సో... తీపి కోసం చక్కెర బదులు బెల్లం లేదా తేనె వాడటం మంచిది.

కొంచెం కారంగా...
పచ్చి లేదా పండుమిర్చిలో ఆయుష్షును పెంచే కారకాలేవో ఉన్నాయట. కారం ప్రభావాన్ని తగ్గించడానికి మెదడు ఎండార్ఫిన్లను ఎక్కువగా విడుదల చేస్తుందట. ఎండార్ఫిన్ల వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయట. అందువల్ల కారం తినండి.

మంచి కాఫీ... మంచి ఆరోగ్యం
రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు వచ్చే ముప్పు తప్పు తగ్గుతుందట. మీరు కాఫీ ప్రియులయితే ఇంకేం... ఇంచక్కా తాగేయండి స్ట్రాంగ్‌ కాఫీ.

గింజలు తినండి
గింజ ధాన్యాలు తినడం ఆరోగ్యానికి మంచిది. హార్వార్డ్‌ యూనివర్శిటీ స్టడీ ప్రకారం రోజూ గింజధాన్యాలు తినేవారిలో ముఖ్యంగా పొట్టు తీయని ధాన్యం, బ్రౌన్‌ రైస్‌ వంటివి తినేవారికి, అవి తినని వారితో పోల్చితే ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయట.

గో గ్రీన్‌
ఇందాక కాఫీ తాగమన్నాం కదా అని టీ ప్రియులు బాధపడకండి... అయితే మామూలు మిల్క్‌ టీ కాదు... గ్రీన్‌ టీ! అవును, గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. అందుకే ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్, హృద్రోగ సమస్యలు రాకూడదనుకునేవారు రెగ్యులర్‌గా గ్రీన్‌ టీ తాగడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మధ్యయుగంలోకి వెళ్లిపొండి
ఇదేం కిరికిరి... మధ్యయుగంలోకి వెళ్లడమెలా అనుకుంటున్నారా? ఉద్దేశ్యం అది కాదు... మధ్యయుగం వాళ్లలా వీలయినంతగా పచ్చి కూరలు తినడం మంచిదట. వాటితోపాటు చేపలు, ఆలివ్‌ ఆయిల్, గుడ్లు తినడం హెల్దీ అట.

ఆరోగ్యానికి హోల్‌ మిల్క్‌
ఏ కాడికీ వెన్న తీసిన పాలు, స్కిమ్డ్‌ మిల్క్‌ తాగమని చెప్పిన వారే కానీ, ఇలా హోల్‌ మిల్క్‌ తాగమని ఎవరూ చెప్పలేదే అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది కిటుకు... (ప్రత్యేకమైన ఆరోగ్య కారణాలుంటే తప్ప) వెన్న, నెయ్యి వంటివి ఆరోగ్యానికి మంచిదేనట. హోల్‌ మిల్క్‌ తాగేవారిలో ఆరోగ్య సమస్యలు ఇతరులకన్నా యాభైశాతం తక్కువగా తలెత్తుతాయని అధ్యయనాల్లో తేలిందట.

తగినన్ని నీళ్లు తాగండి
ఇది మొదటినుంచి వింటున్నదేననుకోండి... బాడీలో తగినన్ని ద్రవపదార్థాలు ఉంటే కోలోన్‌ క్యాన్సర్‌ ముప్పు తప్పుతుందట, అలాగే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయట. అందుకే వీలయినన్ని ఎక్కువ గ్లాసులు నీరు తాగండి. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు పరిశోధకులు.

రాత్రి భోజనాన్ని తొమ్మిదికల్లా ముగించెయ్యండి
రాత్రి తొమ్మిది దాటాక ఫుడ్‌ తినకుండా ఉండటం మంచిదట. బాగా పొద్దుపోయాక పడుకోబోయే ముందు తినడం, తిన్న వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదట. అందువల్ల వీలయినంత వరకు రాత్రి తొమ్మిదిలోగానే భోజనం ముగించెయ్యడం మంచిది మరి!

ముందే చేతులు కడిగేసుకోండి
భోజనానికి ముందే కాదు... కడుపు నిండక ముందే చేతులు కడుక్కోవాలి మరి! అంటే పొట్ట నిండేదాకా తినకూడదని దీని అర్థం. ఫుల్లుగా తినేబదులు కడుపులో ఇంకా 20 శాతం ఖాళీ ఉండేలా చూసుకుని తిండి ముగించెయ్యడం వల్ల బీపీ, కొలెస్టరాల్, షుగర్‌ వంటి ముప్పు నుంచి తప్పించుకోవచ్చట.

నచ్చినట్లు చెయ్యండి
మనసుకు ఇష్టమైన పనులు చేయడం ఆరోగ్యానికి మంచిదట. మంచి మ్యూజిక్‌ వినడం, వాకింగ్, పెయింటింగ్, సింగింగ్, డ్యాన్సింగ్‌ వంటి వాటివల్ల ఆయుష్షు పెరుగుతుందట. ఇంకా... మంచి పుస్తకాలు చదవడం, ఫన్నీ వీడియోలు చూడటం, పదిమందితోనూ హాయిగా కలిసిపోవడం, మనవళ్లు, మనవరాళ్లతో ఉల్లాసంగా గడపటం, పెంపుడు జంతువులతో ఎంగేజ్‌ అవడం, వర్క్‌లో బిజీ అవడం వంటివి ఆయుష్షును పొడిగించేలా చేస్తాయట. వీలయినన్ని ఫాలో అవండి... దీర్ఘాయుష్మంతులు కండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement