థ్రోట్ కేన్సర్ కౌన్సెలింగ్
మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. రెండేళ్ల కిందట ఆమె గొంతులో... అంటే కొండనాలుక భాగంలో ఒక చిన్న గడ్డలా ఏర్పడింది. ఆహారం తినలేక తీవ్రమైన నొప్పితో బాధపడతూ ఉండేది. ఒక హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు పరీక్షించి ‘గొంతు క్యాన్సర్’ అని చెప్పారు. రేడియో థెరపీ చేస్తామంటూ చెప్పారు. అయితే చికిత్స చేయించాక కూడా ఏమీ తగ్గలేదు. సమస్య పునరావృతమైంది. అదేమంటూ మేం వెళ్లి అడిగాం. కానీ వాళ్లేమీ పట్టించుకోలేదు. మా అమ్మాయి అవస్థ చూడలేకపోతున్నాం. పెళ్లికావాల్సిన వయసులో ఆమెకు వచ్చిన ఈ సమస్య మమ్మల్ని చాలా మానసిక వేదనకు గురిచేస్తోంది. దయచేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి. - మాధవి, హైదరాబాద్
మీరు చెబుతున్న విషయాలను బట్టి మీ అమ్మాయికి వచ్చిన సమస్యను అక్కడి డాక్టర్లు చక్కగానే గుర్తించారుగానీ అవసరమైన చికిత్సను మాత్రం అందించలేకపోయారని తెలుస్తోంది. మీ అమ్మాయికి వచ్చిన క్యాన్సర్ చాలా అరుదైనది. దీనికి అవసరమైన ఆధునిక ఉపకరణాలు, వైద్య సదుపాయాలు ఉన్న పెద్ద సెంటర్‌లో చికిత్స చేయించడం అవసరం. మీ అమ్మాయి గొంతులో ఏర్పడ్డ క్యాన్సర్ గడ్డకు అక్కడి వైద్యులు తమకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో చేసిన చికిత్స... ఆమె సమస్యను పూర్తిగా తగ్గించలేకపోయిందని మీరు రాసిన దాన్ని బట్టి తెలుస్తోంది. అలాగే ఇప్పుడు ఆమెకు సర్జరీ లాంటి విధానాలు అవలంబించినా గొంతు దగ్గర గాటు, గీత పడతాయి కాబట్టి భవిష్యత్తులో ఆ మచ్చ అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. మీ అమ్మాయి పెళ్లీడుకు వచ్చిందని అంటున్నారు కాబట్టి అలాంటి సమస్యలేమీ లేకుండా ఉండేలా అత్యాధునికమైన వైద్యప్రక్రియను అవలంబించాల్సి ఉంటుంది. మీ అమ్మాయి గొంతు క్యాన్సర్‌కు అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్‌డ్ ‘డావిన్స్‌డ్ రోబో’ సర్జరీ విధానం చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. ఇది మీ అమ్మాయి సమస్యను సమూలంగా, శాశ్వతంగా నిర్మూలిస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చికిత్స ప్రక్రియలో వైద్యులు రోబోటిక్ పరికరాలను నోటి ద్వారా పంపిస్తారు. దానికి కెమెరా అనుసంధానమై ఉంటుంది. ఇది 180 డిగ్రీల పరిమాణంలో తిరుగుతూ ట్యూమర్ ఉన్న స్థానాన్ని 3డి విజన్‌లో బయట ఉన్న స్క్రీన్‌పై స్పష్టంగా చూపెడుతుంది. రోబోటిక్ పరికరాలను నియంత్రిస్తున్న డాక్టర్... ట్యూమర్‌ను సమూలంగా తొలగించగలుగుతారు.
అలాగే దాని చుట్టుపక్కల క్యాన్సర్‌కు సంబంధించి ఇతరత్రా చిన్న చిన్న ట్యూమర్లు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని కూడా ఈ రోబోటిక్ పరికరం ద్వారా సులువుగా గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో వైద్యులు ఆ క్యాన్సర్ ట్యూమర్లను సమూలంగా, శాశ్వతంగా నిర్మూలించగలుగుతారు. ఈ నూతన చికిత్సా విధానాన్ని ‘ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ’ అని అంటారు. మీ అమ్మాయి సమస్యకు ఇది చాలా సురక్షితమైన చికిత్స ప్రక్రియ అని కచ్చితంగా చెప్పవచ్చు. మీరు ఎంతమాత్రమూ ఆందోళన చెందవద్దు. మీ అమ్మాయి సమస్యకు సర్జరీతో సంపూర్ణ చికిత్స అందుబాటులోనే ఉంది. గొంతు క్యాన్సర్‌కు సంబంధించిన ట్యూమర్ ముదరకముందే, ఇతర భాగాల్లోకి వ్యాపించకముందే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అమ్మాయికి సరైన చికిత్సను అందించండి.
డా జగదీశ్వర్‌గౌడ్ గజగౌని,
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఎన్నో ఆరోగ్య సమస్యలకు మందు... దానిమ్మ
ఆయుర్వేదం కౌన్సెలింగ్
నాకు రక్తం తగ్గిందని చెబితే కొంతమంది స్నేహితులు దానిమ్మపండు తినమని చెప్పారు. దీని అన్ని వయసుల వారు తినవచ్చా? ఆయుర్వేదంలో దీని ప్రాముఖ్యత తెలియజేయండి. - బంటీ సింగ్, హైదరాబాద్
దానిమ్మ పండును సంస్కృతంలో దాడిమః అంటారు. దీనికి చాలా పర్యాయ పదాలున్నాయి. కొన్ని ముఖ్యమైనవి... దంతబీజ, రక్తబీజ, రక్తపుష్ప, సునీల, నీలపత్ర, శుకవల్లభ, కుచఫల. వృక్షశాస్త్రంలో దీనిని ప్యూనికా గ్రనేటం అంటారు. గుణాలు, ప్రయోజనాలు: దానిమ్మ పండు అరుచిని పోగొట్టి నాలుకకు రుచిని పెంచుతుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది. ఆకలిని పుట్టించి, జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది. దప్పికను, శరీరంలోని మంటను పోగొడుతుంది. బలకరం. పుష్ఠికరం, శుక్రకరం, గొంతు గరగర, మంట, నొప్పి, నీళ్ల, జిగట విరేచనాలు తగ్గిస్తుంది. గుండెజబ్బులను నివారిస్తుంది. జ్వరహరం కూడా.
భావప్రకాశ గ్రంథంలోని శ్లోకం: ‘‘....త్రిదోషఘ్నం, తృట్ దాహ జ్వరనాశనం; హృత్ కంఠ ముఖ రోగఘ్నం; తర్పణం శుక్రలం, గ్రాహీ, మేధాబలప్రదం; దీపనం రుచ్యం...’’
చికిత్సకోసం వాడే భాగాలు: బెరడు పువ్వులు పిందెలు పండు తొక్క పండు గింజల రసం ఆకులు వేరు మీద పట్ట
బెరడు కషాయం: తాగితే నీళ్ల, జిగట విరేచనాలు తగ్గుతాయి. కషాయంతో కడిగితే వ్రణాలు (పుండ్లు) త్వరగా మానిపోతాయి.
బెరడు చూర్ణం: ఒక చెంచా చూర్ణం, ఒక చెంచా తేనె కలిపి నాకితే కోరింత దగ్గు తగ్గుతుంది.
లేత పిందెలు: తియ్యని పెరుగులో మెత్తగా నూరి ఒక చెంచా సేవిస్తే చంటిపిల్లల విరేచనాలు తగ్గుతాయి.
కాయ: మెత్తగా దంచి, పైన పట్టువేస్తే, స్త్రీలలో రొమ్ములు పెరుగుతాయి.
పువ్వులు: నీడలో ఎండించి, మెత్తగా పొడిచేసి తేనెతో సేవిస్తే బొంగురుపోయిన గొంతు బాగుపడుతుంది. కంఠరోగాలు శమిస్తాయి.
ఆకులు: దంచిన ముద్దను కనురెప్పలపై ఉంచితే కండ్లకలక తగ్గుతుంది.
పండు మీది తొక్క: తొక్కను దంచి రసం తీసి, తేనెతో కలిపి నాకిస్తే గర్భిణులకు వాంతులు తగ్గుతాయి. తొక్కను నోటిలో నములుతూ రసాన్ని మింగుతుంటే దగ్గు తగ్గుతుంది.
వేరు మీద పట్ట: కషాయం కాచుకుని తాగితే (4 చెంచాలు, రోజుకి రెండుసార్లు) కడుపులోని క్రిములు (నట్టలు) నశిస్తాయి. దీనితో కడిగితే యోనివ్రణాలు తగ్గి తెల్లబట్ట, మంట, దురద తగ్గుతాయి.
పండ్లగింజలు:రసాన్ని సేవిస్తే నెత్తురుపట్టి పుష్టి కలుగుతుంది. పచ్చకామెర్లు తగ్గుతాయి. ఛాతీలో నొప్పి తగ్గుతుంది. పండ్ల గింజలను ఎండబెట్టి... దంచి కషాయం కాచుకోవాలి. సుమారు 6 చెంచాల) ద్రవ్యాన్ని 300 మిల్లీలీటర్ల నీళ్లలో సగం నీళ్లు ఇగిరేలా కాచి వడగట్టాలి. ఆ నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగితే... గుండెధమనుల్లో గడ్డకట్టిన రక్తం కరిగి రక్తప్రసరణ సాఫీ అవుతుంది. ఇటీవల చాలామంది వైద్యులు... ఎమర్జెన్సీ లేని రోగులకు ఈ కషాయాన్ని 3 నుంచి 6 నెలల పాటు వాడితే మంచి ఫలితాలు కనబడ్డాయి. రక్తంలోని అధిక చెడు కొవ్వులు కూడా తగ్గిన దాఖలాలున్నాయి ఛాతీ ప్రాంతంలో నొప్పి, ఆయాసం తగ్గి, తేలికగా నడవటం సాధ్యమవుతుంది ఆహార విహారాలలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. అప్పుడే ఫలితాలు బాగుంటాయి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్
ముక్కులో ఏదో అడ్డంకి... ఎందుకిలా?
ఇఎన్‌టి కౌన్సెలింగ్
నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్‌లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి పరిష్కారం తెలపండి. - జ్ఞానసుందర్, ఒంగోలు
ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను కలవండి. వైద్య పరీక్షలు చేయించాక, వ్యాధి నిర్ధారణ ముందుగా జరగాల్సిన పని.
మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు.
డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్‌ఓడి - ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్