
జాగ్రత్తలతో దీపావళి
దీపాలు, మతాబుల కాంతుల్లో వెలిగిపోయే దీపావళి చిన్నాపెద్దకు సంబరాన్ని కలిగిస్తుంది. ఇంటిని వెలుగులు విరజిమ్మేలా అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాదు సురక్షితంగా పండగ జరుపుకోవడంలోనూ అత్యంత జాగ్రత్త వహించాలి. అప్పుడే పండగ ఆనందం అంబరాన్నంటుతుంది. అందుకోసమే ఈ చిన్ని జాగ్రత్తల చిట్టా...
టపాసులను ఎక్కువగా ఇంట్లో స్టోర్ చేయకూడదు. వాటిని కాల్చేటప్పుడు ఆరుబయట, ఖాళీ ప్రదేశాల్లోనే కాల్చాలి. ఆ సమయంలో నీళ్ల బక్కెట్టు ఓ పక్కగా ఉంచితే, కాల్చేసిన టపాసులను, ఇనుప చువ్వలను ఆ నీటిలో వేయవచ్చు
నూనె దీపాలు ఎక్కువశాతం ఇంటిలోపల ఉంచకూడదు. దీపాలు ఇంట్లో ఉంచితే పొరపాటున కర్టెన్లు, పేపర్లు, ధరించిన దుస్తులకు అవి అంటుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే దీపాల దగ్గరగా తిరిగేటప్పుడు ఏమరుపాటుగా ఉండకూడదు
మంటలను ఆర్పే సాధనాలను అందుబాటులో ఉంచుకోవాలి
మెట్లు, దారికి అడ్డంగా ఉండే చోట దీపాలు వెలిగించకూడదు. అప్పుడు పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే త్వరగా బయటపడే వీలుంటుంది
లైట్ల అమరిక కోసం ఎలక్ట్రిక్ సాకెట్‌లో ఎక్కువ హోల్డర్స్, కరెంట్ వైర్లు ఉపయోగించరాదు. ఒక క్రమపద్ధతిలో లైట్లను అమర్చుకుంటే దీపాల వెలుగులు ఆకట్టుకుంటాయి
ఇంటి లోగిలిలోనూ, వాకిట్లోనూ దారికి అడ్డంగా వాహనాలను ఉంచరాదు. పొరపాటున మంటలు ఎగిసే సమయంలో పరిగెత్తడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి
పొరపాటున కాలితే, ఆ గాయాలపై నెయ్యి, పౌడర్ వంటివి వేయకూడదు. ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి
అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రి అవసరం వస్తే, దగ్గరలో ఉన్న హాస్పిటల్ నెంబర్లు కంటికి కనిపించేలా గోడపై లేదా పెద్ద షీట్‌పై రాసి ఉంచాలి.