ఇప్పటికీ తరచు వార్తల్లో ఉండే బికిని ఎప్పుడో షష్టిపూర్తి చేసుకుంది. అయితేనేం... ఎప్పుడూ ‘హాట్’టాపిక్కే. ఈత దుస్తులుగా పుట్టుకొచ్చి... ఈతరం కూడా ఆచితూచి ఎంపిక చేసుకునే వస్త్రధారణగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. అరవై ఎనిమిదేళ్ల బికిని సంగతులివి...
బీచుల్లో బికినీలు నిషేధించాలని గోవా ప్రజా పనుల శాఖా మంత్రి సుదిన్ దావలికర్ ఇటీవల ఒక వివాదాస్పద వాఖ్య చేశారు. గోవా సంస్కృతికి బికినీలు గొడ్డలి పెట్టు అన్న ఈ మంత్రి వాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బహిరంగ ప్రదేశాలలో కురుచ దుస్తులు ధరించడం వల్ల మహిళలకు ప్రమాదం అని, అందుకే అలా అన్నానని ఈ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉండగా ఇక నుంచి బికినీ బామల ఫొటోలతో పర్యాటక ప్రకటనలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా గోవా టూరిజమ్ శాఖ మంత్రి మరో హాట్ టాపిక్‌కి తెర తీశారు.
ఇప్పటికే షష్టిపూర్తి వయసు దాటేసిన ‘బికిని’ ఇంకా హాట్ హాట్‌గా న్యూస్‌లో ఎందుకు చోటుచేసుకుంటున్నట్టు? ఒళ్లంతా కప్పుకుని ఒద్దికగా ఉండే మన సంస్కృతిలోకి ‘బికిని’ ఎప్పుడు ప్రవేశించింది? బీచ్ డ్రెస్‌గా మోత మోగిస్తున్న ‘బికిని’ పుట్టి ఈ రోజుకి 68 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బికిని రూపవిలాసాలు తెలుసుకుందాం...
పుట్టింది ప్యారిస్ ఇంట...: బికిని అనగానే పాశ్చాత్య ఈతకొలనులలో ఈదులాడే అందమైన అమ్మాయిల రూపాలు, వారు ధరించిన అతి కురుచ దుస్తులు కళ్లముందు కదులుతుంటాయి. టు పీస్ బికినీగా ప్రపంచమంతా ఆకట్టుకుంటున్న ఈ డ్రెస్‌ను మొదటిసారి ఫ్రాన్స్ దేశీయుడైన లూయిజ్ రియర్డ్ రూపకల్పన చేశాడు. ఇతను రూపొందించిన బికినీని ‘బెర్నార్డి’ అనే ఫ్రెంఛ్ మోడల్ ధరించి జూలై 5, 1946లో ప్యారిస్ ఫ్యాషన్ షోలో హొయలు పోయింది. ఆ విధంగా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది బికిని.
ప్రపంచమంతా పరుగులు: పసిఫిక్ మహా సముద్రంలోని మార్షలీస్ దీవులలో ‘బికిని అటోల్’ అనేది ఒక దీవి పేరు. ఇక్కడ అమెరికా మొదటిసారి అణుబాంబు పరీక్షలు జరిపింది. ఈ దీవి పేరునే టూ పీసెస్ డ్రెస్‌కు పెట్టారు లూయిజ్ రియర్డ్. ‘వరల్డ్ స్మాలెస్ట్ బాతింగ్ సూట్’గా ప్రకటనలలో విజృంభించి అటు తర్వాత ఫిలిప్పీన్స్, బాలి, హవాలి, గోవా... వంటి ఎన్నో బీచ్‌లలో రంగురంగులుగా పరుగులు పెడుతోంది బికిని. బికినీతో పాటు పై నుంచి కింది వరకు ఒళ్లంతా కవర్ చేసే స్విమ్‌సూట్‌లెన్నో మార్కెట్లోకి వచ్చాయి
మీకుతెలుసా!
20వ శతాబ్దపు ఫ్యాషన్ చరిత్రను తిరగేస్తే విస్మయానికి లోనుచేసే విషయాలు ఎన్నో తెలుస్తాయి. శరీర సౌష్టవం చక్కగా కనిపించేలా ఒంటికి అతుక్కుపోయే పొడవాటి స్కర్ట్‌లు, స్లీవ్‌లెస్ టాంక్ సూట్స్ ధరించడం మొదలుపెట్టారు. 1920లో క్రీడాకారులు స్లీవ్‌లెస్ టాంక్ సూట్స్‌ను ఈత సమయాలలో ధరించేవారు
1930లో కాటన్ ప్రింటెడ్ మెటీరియల్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఒన్‌పీస్ బాతింగ్‌సూట్ 20వ శతాబ్ధపు అతి చెత్త ఫ్యాషన్ జాబితాలో చేరింది
1931లో బీచ్‌లకు ప్రత్యేకం అనిపించే ‘కోర్‌సెట్’ స్విమ్‌సూట్‌లు మార్కెట్లోకి వచ్చాయి
1940ల కాలంలో మహిళల శరీరాకృతికి తగిన విధంగా స్ట్రాప్‌లెస్, సన్నని స్ట్రాప్స్.. వంటి రకరకాల స్విమ్ సూట్స్‌ని తయారుచేశారు
1950ల కాలం నుంచి నేటి వరకు ఈ తరహాను పోలిన స్విమ్ సూట్స్ కనిపిస్తున్నాయి.
1960ల కాంలో నైలాన్ లేదా లిక్రా లేదా ఈ రెంటినీ పోలిన మెటీరియల్స్‌తో స్విమ్‌సూట్‌ను తయారుచేసేవారు. ఈ తరహా గార్మెంట్స్ సాగడం, ఒంటికి హత్తుకున్నట్టు సౌకర్యంగా ఉండటంతో బాగా ప్రాచుర్యం పొందాయి.
స్పాండెక్స్ మెటీరియల్‌తో తయారైన స్విమ్‌సూట్స్ ప్రపంచమంతటా ఆకట్టుకుంటున్నాయి. కాటన్, పాలియస్టర్ కలిపి తయారుచేయడంతో చూడటానికి, ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. సాగే గుణం గల ఈ ఫ్యాబ్రిక్ దీర్గకాలం మన్నుతుంది.
డిజైనర్ సూచనలు
స్విమ్ సూట్ / బికిని ఎంపిక శరీరాకృతికి తగిన విధంగా ఉండాలి.
టాప్స్...
బాండేయు: శరీరాకృతి తీరుగా ఉన్నవారు స్ట్రాప్స్‌లేని బాండేయు టాప్ స్టైల్ స్విమ్ వేర్‌ను ఎంచుకోవాలి.
ట్రయాంగిల్: మెడ, వీపు భాగంలో ముడులు వేసుకొని అడ్జెస్ట్ చేసుకునే స్టైల్ ఇది. ఛాతి పరిమాణం తక్కువగా ఉన్నవారికి ఇవి నప్పుతాయి.
అండర్‌వైర్: ఛాతి పరిమాణం ఎక్కువ ఉన్నవారి నుంచి తక్కువ ఉన్నవారి వరకూ ఈ స్టైల్ నప్పుతుంది.
హాల్టర్: ఈ స్టైల్‌లో వెడల్పాటి పట్టీలు ఉండటంలో ఛాతి భాగంలో మరింత సపోర్టివ్‌గా ఉంటుంది.
టాన్‌కిని: ఉదరభాగాన్ని కూడా కవర్‌చేసే స్టైల్ ఇది.
బాటమ్స్...
బ్రెజిలియన్: పిరుదల భాగం బాగున్నవారికి ఈ స్టైల్ నప్పుతుంది.
సైడ్‌టై: రెండు వైపులా ముడులు వేసుకోవడానికి స్ట్రాప్స్ ఉంటాయి. పిరుదల భాగాన్ని తక్కువ కవర్ చేస్తుంది.
హిప్స్‌టర్: ఈ బాటమ్ సైడ్స్ విశాలంగా ఉండటం వల్ల పిరుదుల భాగం ఎక్కువ కవర్ అవుతుంది.
హై వెయిస్టెడ్: పొత్తికడుపు ఎత్తు ఉన్నవారికి నప్పుతుంది.
స్కర్టెడ్: బాటమ్‌కి సరిపడా స్కర్ట్ కూడా అటాచ్ అయి ఉంటుంది.
నోట్: జియోమెట్రిక్ ప్రింట్స్ స్విమ్‌వేర్/బికినీ ఈ ఏడాది (2014) ట్రెండ్‌గా మారింది.
సినిమాలలో బికిని...
మొదటిసారి స్విమ్‌సూట్‌ను పోలిన డ్రెస్ వేసిన తార మీనాక్షి శిరోద్కర్. ‘బ్రహ్మచారి’ (1938) అనే మరాఠీ సినిమాలో ఈమె ఈత కొలనులో సింగిల్ పీస్ స్విమ్ సూట్‌లో కనిపించి ప్రేక్షకులను విస్మయానికి లోనుచేశారు. మన బాలీవుడ్ తారలు నమ్రతశిరోద్కర్, శిల్పా శిరోద్కర్‌ల బామ్మ మీనాక్షి శిరోద్కర్.
మొట్టమొదట బాలీవుడ్‌లో ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ (1967) సినిమాలో బికినీలో కనిపించిన హీరోయిన్ షర్మిలా ఠాగూర్. ఈ సినిమాలో ఒన్ పీస్ బాతింగ్ సూట్‌లో కనిపించా రు ఈమె. ఆ తర్వాత డింపుల్ కపాడియా బాబీ (1973) సినిమాలో... ఆ తర్వాత వరుసగా హీరా పన్నా, పర్వీన్ బాబి స్విమ్‌సూట్‌లో కనువిందుచేశారు.
తెలుగు సినిమాలలో నాటి తరం హీరోయిన్ లు లక్ష్మి మొదలుకొని మాధవి వరకు స్విమ్ సూట్‌లో మెరిశారు.
నేటితరం తారలలో నయనతార, అనుష్క, దీపిక పదుకొనెలు బికినీ భామల జాబితాలో తొలి మూడు స్థానాలలో ఉన్నారు. ఆ తర్వాత ఇలియానా, ప్రియమణి, శ్రీయ, కాజల్, నమిత, శృతిహాసన్, సదా, అంకిత, లక్ష్మీరాయ్, దీక్షాసేథ్... తదితరులు ఉన్నారు.
ఆత్మవిశ్వాసం తప్పనిసరి...
మిగిలిన వస్త్రధారణల్లా కాకుండా బికినీ ధారణకు తప్పనిసరిగా చక్కని శరీరాకృతి ఉండాల్సిందే. అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన యువతులు మాత్రమే ధరించగలరు. నేనూ బికినీ డిజైన్స్ చేశాను. మన దేశంలో బికినీ కల్చర్ బాగా తక్కువ కాబట్టి, వీటిని కోరుకునేవారు ఫ్యాషన్ డిజైనర్స్‌ను సంప్రదించాల్సిందే.
-జుబిన్‌వకీల్, ఫ్యాషన్‌డిజైనర్
ఆ తరం టు ఈ తరం
Published Fri, Jul 4 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement
Advertisement