చెలవర జలపాతం, మల్లన్న జలపాతం
కావేరి, కుమారధార, ఆర్కావతి ఇలా ఎన్నో నదులు ఆలంబనగా పుట్టిన జలపాతాల సోయగాలు పర్యాటకులను మైమరిపిస్తాయి. జలధారలు కురిపిస్తూ శ్వేతవర్ణంలో పొంగిపొర్లే జలాల అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఉరుకుల పరుగుల జీవితంలో నూతన ఆనందాన్ని అందుకోవడానికి జలపాతాల వీక్షణం ఉపకరిస్తుంది.
సాక్షి, బెంగళూరు: రాచనగరి చుట్టుపక్కల ఉన్న జలపాతాలు పర్యాటక రంగానికి ఊపిరి పోస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణం మధ్య సెలవురోజుల్లో జలపాతాలను వీక్షించడం మనసంతా కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇందుకోసమే బెంగళూరుతో సహా రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. మైసూరు చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన ఐదు జలపాతాలు చెలవర, చుంచనకట్టె, మల్లాలి, శివసముద్ర, చుంచి వేసవి మినహా మిగతా కాలమంతా ప్రవహిస్తూ కనువిందు చేస్తుంటాయి.
చెలవర జలపాతం
మైసూరు నుంచి 125 కిలోమీటర్లు, విరాజ్‌పేట నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చెయ్యందనే గ్రామానికి సమీపంలో ఉన్న చెలవర జలపాతం ఉంది. సుందర జలపాతాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. స్థానిక పర్యాటకులకు మాత్రమే ప్రాచుర్యం పొందింది. జలపాతం బేస్ వద్ద ఏర్పడిన చెరువు వర్షాకాలంలో అంచు వరకు నిండిపోతుంది. ఇందులో దిగడం ప్రమాదంతో కూడుకున్నది. దూరం నుంచి జలపాతాన్ని వీక్షించడం ఉత్తమం.
కావేరి నదిపై చుంచనకట్టే
మైసూరు నుంచి 56 కిలోమీటర్ల దూరంలో కావేరి నదిపై చుంచనకట్టే జలపాతం ప్రసిద్ధి చెందింది. తప్పక చూడాల్సిన ప్రదేశం. సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక ప్రకాశం కారణంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారు. సమీపంలోనే కోదండ రామాలయం ఉంది. చుంచనకట్టే జలపాతం నీటిలోప్రశాంతంగా స్నానం చేసి రాముని ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
శివన సముద్ర జలపాతం
మైసూరు నుంచి 78 కిలోమీటర్ల దూరంలో కావేరి నదిపై అందమైన శివనసముద్ర జలపాతం ఉంది. ఇది రెండు జలపాతాలుగా విడిపోతుంది. అవి పశ్చిమాన గగనాచుక్కి, తూర్పున భరచుక్కి జలపాతం. జలపాతంతో పాటు చూడదగ్గ ప్రకృతి దృశ్యాల వల్ల ఏడాది పొడవునా పర్యాటకులతో రద్దీగా ఉంటుంది.
ఆర్కావతి నదిపై చుంచి
మైసూరు నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఆర్కావతి నదిపై ఉంది. రాముడు తన ప్రవాసంలో బస చేసిన మరో ప్రదేశంగా భావిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో వారంతపు సెలవుల్లో విహరించేందుకు సరైన ప్రదేశం. దట్టమైన అడవులు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
మళ్లళ్లి ఫాల్స్
మైసూరు నుంచి 135 కిలోమీటర్ల దూరంలో మల్లాలి జలపాతం కుమారధార నదిలో కలిసిపోయి ఉంటుంది. రాతి భూ భాగాలు, పశ్చిమ కనుమల పచ్చని వృక్షాలు కలిసి మనోహరంగా దర్శనమిస్తాయి. యువత ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రాంతంలోని ఎత్తైన జలపాతాల్లో ఒకటిగా ఉంది. అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది.
చుంచి ఫాల్స్ చుంచన కట్టె ఫాల్స్
Comments
Please login to add a commentAdd a comment