
కార్బన్ డైయాక్సైడ్, మీథేన్! భూతాపోన్నతి పెరిగిపోయేందుకు, తద్వారా వాతావరణ మార్పులతో భూమ్మీద మనుగడ కష్టమయ్యేందుకూ కారణమైన రెండు విషవాయువులు. వాతావరణంలోకి చేరుతున్న వీటి మోతాదును ఎలా తగ్గించాలని ఒకవైపు ప్రయత్నాలు సాగిస్తూంటే.. ఇంకోవైపు సర్రే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ విష వాయువులను ఎంచక్కా మన వంటగ్యాస్ మాదిరిగా మార్చేసేందుకు ఓ వినూత్న ఉత్ప్రేరకాన్ని సిద్ధం చేశారు.
వాతావరణంలోకి చేరుతున్న కార్బన్ డైయాక్సైడ్, మీథేన్‌ల మోతాదు గత నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉంటే... ఈ ఏడాది మళ్లీ హెచ్చడం మొదలైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిని ఒడిసిపట్టి వేర్వేరు పద్ధతుల్లో నిల్వ చేసేందుకు కొన్ని టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో సర్రే శాస్త్రవేత్తలు నికెల్ ఆధారిత ఉత్ప్రేరకం సాయంతో ఈ వాయువులను కత్రిమ వంటగ్యాస్‌గా మరికొన్ని ఇతర ప్రయోజనకరమైన పదార్థాలుగా మార్చవచ్చునని నిరూపించారు.
పైగా ఈ ఉత్ప్రేరకాన్ని వాడటం కూడా సులువు అని, చౌకగానూ ఉపయోగించుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ థామస్ ఆర్. రీనా తెలిపారు. వాతావరణంలోంచి ఈ విషవాయువులను తొలగించడం వాటిని ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చుకోవడం రెండూ చౌకగా జరిగిపోతే భూతాపోన్నతి సమస్యను సులువుగా పరిష్కరించవచ్చునన్నది తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment