
మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది.
నా వయసు 66 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా?
– డి. సాయిప్రతాప్, ఏలూరు
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ఈ మధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.
కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం – ఎక్కువ కాలం విరేచనాలు – వంశపారంపర్యం – అతిగా మద్యం తీసుకోవడం – ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం – మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది.
లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట – చురుకుగా ఉండలేరు – చిరాకు, కోపం – విరేచనంలో రక్తం పడుతుంటుంది – కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట.
చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్