సాక్షి, అమరావతి: ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిపోయిన చందంగా.. జబ్బుతో ఆస్పత్రికి వస్తే నయం చేయాల్సిందిపోయి, కడుపులోని కణతులు తొలగించాల్సిన కత్తెర్లు, కత్తులను కడుపులోనే పెట్టేసి కుట్లేసేస్తున్నారు మన డాక్టర్లు కొందరు. మళ్లీ రోగి తీవ్ర ఇబ్బందికి గురవడం, స్కానింగ్ చేయించిన తర్వాత కత్తెర్లను గుర్తించి, తిరిగి సర్జరీ చేసేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దాస్పత్రుల్లోనే చోటుచేసుకుంటుండటంతో రోగులు సర్జరీ అంటే హడలెత్తిపోతున్నారు. ఆపరేషన్ థియేటర్‌లోకి వచ్చే ముందు సర్జికల్ సామగ్రి లెక్కించి ఆపరేషన్ పూర్తయ్యాక వాటిని సరిచూసుకోకపోవడం వల్లే ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆపరేషన్ చేశాక సర్జికల్ పరికరాలన్నీ ఓసారి పరిశీలించుకుంటే తాజాగా నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనల్లాంటివి పునరావృతం కావని చెబుతున్నారు. గుంటూరులోనూ ఇటీవల ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది.
తేలిగ్గా తీసుకుంటున్న వైద్యులు
సర్జరీ చేశాక కడుపులో కత్తెర్లు మరిచిపోయి కుట్టేసే ఉదంతాలు కొత్తేమీ కాదు. ఏడాదికి 30 నుంచి 40 ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పునరావృతం అవుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు కడుపులో కత్తులు మరచిపోయి కుట్లేశాక రెండేళ్లకో మూడేళ్లకో దుష్పరిణామాలు చోటు చేసుకుని తిరిగి మళ్లీ శస్త్రచికిత్స చేయించుకున్న ఘటనలూ ఉన్నాయని కాకినాడకు చెందిన ఓ వైద్యుడు చెప్పారు. కడుపులోనే కత్తెరలు, కత్తులు మరచిపోయి తిరిగి గుర్తించాక మళ్లీ ఆపరేషన్ చేసి తీయడం అనే విషయాన్ని వైద్యులు అత్యంత తేలిగ్గా తీసుకుంటున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలూ తక్కువగా ఉండటంతో పట్టింపు లేకుండా పోయింది. ఏడాదికి బోధనాసుపత్రుల్లోనే 11 బోధనాసుపత్రుల్లో 75 వేల వరకూ మేజర్ సర్జరీలు మరో 70 వేలు మైనర్ సర్జరీలు జరుగుతున్నాయి. ఇక్కడికొచ్చేదంతా పేద రోగులే. అసలే అతికష్టమ్మీద వైద్యం దక్కిందన్న ఆనందం ఇలాంటి ఘటన జరిగినప్పుడు వారికి దక్కడం లేదు.
పొరపాటున జరిగిందే
సాధారణంగా ఆపరేషన్ ముగిశాక ప్రతి డాక్టరూ, ఆపరేషన్‌లో ల్గొన్న స్టాఫ్‌నర్సులూ కౌంట్ చేసుకుంటారు. నెల్లూరులో జరిగిన ఘటన పొరపాటున జరిగిందే. ఇలాంటి ప్రభుత్వాస్పత్రులతోపాటు ప్రైవేటులోనూ అప్పుడప్పుడూ జరుగుతూంటాయి. ఇలా ఎవరో వైద్యులు కడుపులో కత్తెర్లు మరచిపోయిన ఘటనలో నేనే శస్త్రచికిత్స ద్వారా తీశాను. ప్రాణాపాయం ఉండకపోయినా ఇలాంటి ఘటనలు జరగకూడదు. రెండు గంటలు కష్టపడి చేసిన సర్జరీ ఇలాంటి చిన్న పొరపాటు వల్ల విఫలమవుతుంది. –డా.కె.బాబ్జీ, న్యూరో సర్జన్, వైద్య విద్యా సంచాలకులు (అకడమిక్)
ఆపరేషన్ ప్రొటోకాల్స్ ఇలా..
► ఆపరేషన్ చేయాలన్నప్పుడు ముందుగా రోగిని సిద్ధం చేస్తారు
► ఆపరేషన్‌కు గడువు విధించినప్పుడే సర్జన్‌తో పాటు స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లను నిర్ణయిస్తారు.
► అనస్థీషియా వైద్యుడిని ముందే నిర్ణయిస్తారు
► ఆపరేషన్ మొదలయ్యే సమయానికి స్టెరిలైజ్ (వేడినీటిలో శుద్ధి) చేసిన కత్తులు, కత్తెర్లు వంటివి సిద్ధం చేస్తారు
► రక్తస్రావాన్ని నియంత్రించే కాటన్ ప్యాడ్స్ (స్వాబ్స్)ను సిద్ధం చేస్తారు
► కత్తులు, కత్తెర్లు, ఫోర్‌సెప్స్, కాటన్‌ప్యాడ్స్ లాంటివన్నీ విధిగా ముందే లెక్కించి థియేటర్‌లోకి తీసుకురావాలి
► ఆపరేషన్ ముగియగానే కత్తులు, కత్తెర్లు, కాటన్‌ప్యాడ్స్ వంటివన్నీ స్టాఫ్‌నర్సు లెక్కిస్తారు
► అన్నీ లెక్కసరిపోయాక లెక్క సరిపోయాయి.. ఇక ముగించవచ్చని స్టాఫ్‌నర్సు చెబుతారు
► ఆ వెంటనే ఆపరేషన్ చేసిన భాగాన్ని కుట్లు వేసి మూసేస్తారు
► ఇవన్నీ విధిగా పాటించాలి.. వీటిలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా రోగికి ఇబ్బంది తప్పదు
Comments
Please login to add a commentAdd a comment