డాన్
ట్రెండ్ సెట్టర్
కొన్ని సూపర్‌హిట్స్ విశేషాలు సరదాగా ఉంటాయి. డాన్ స్క్రిప్ట్‌ని సలీమ్ జావెద్ రాశాక దానిని దేవ్ ఆనంద్, ధర్మేంద్ర రిజెక్ట్ చేస్తే పనికి రాదేమోనని రచయితలు పక్కన పడేశారు. అప్పుడే ఇండ్రస్ట్రీలో నారిమన్ అనే కెమెరామెన్ సొంత సినిమా తీసి అప్పుల్లో పడ్డాడు. అతడికి మంచి పేరుంది. పైగా అమితాబ్, జీనత్ అమన్‌కు స్నేహితుడు. మనోజ్ కుమార్ దగ్గర శిష్యుడిగా పని చేసిన చంద్ర బారట్‌కు కూడా స్నేహితుడే. కష్టాల్లో ఉన్న నారిమన్‌ను గట్టెక్కిద్దామని ముగ్గురూ నిశ్చయించుకుని కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. సలీమ్ జావెద్‌ను అడిగితే మా దగ్గర ఒక సన్నాసి స్క్రిప్ట్ ఉంది కావాలంటే పట్టుకుపోండి అని ఉదారంగా ఇచ్చేశారు. అప్పటికే గాడ్ ఫాదర్ రిలీజ్ అయ్యి డాన్ వంటి మాటలు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాయి. అలా ‘డాన్’ అనే టైటిల్ రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత విడుదలయ్యి సంచలనం సృష్టించింది. అంతవరకూ ఠాకూర్‌లు ఏలుతున్న బాలీవుడ్‌లో ఆ తర్వాత డాన్‌లు రంగ ప్రవేశం చేశారు.
అక్కణ్ణుంచి తెలుగులోకి కూడా డెన్‌లూ డాన్‌లు వచ్చేశారు. డాన్‌కు జరిగినన్ని రీమేక్‌కు మరే సినిమాకు జరగలేదు. తెలుగు తమిళం హిందీ భాషల్లో దాదాపు ఆరేడు సార్లు ఈ సినిమా రీమేక్ అయ్యింది. ఎన్టీఆర్ వంటి హీరో ఈ స్క్రిప్ట్ అంగీకరించి ‘యుగంధర్’ పేరుతో నటించారంటే ఊహించుకోవచ్చు. దీనికి ఇళయరాజా సంగీతం ఇవ్వడం ఒక విశేషం అయితే ఇందులోని ‘నా పరువం నీ కోసం’ పాట హిందీలోని ‘ఏ మేర దిల్ ప్యార్ కా దీవానా’ పాటకు దీటుగా నిలవడం మరో విశేషం.