అడవి పూలు...
అడవిలో పువ్వు ఎవరో చూడాలని పూయదు.
తన సంకల్పమే తన ఉనికికి ఆధారం.
ఆ అడవి మట్టిలో ఉన్న సహజ గుణమే
ఆ పువ్వుకు పరిమళం...
గిరిజన అందాలను గిరి దాటించి ...
మీదాకా తెచ్చాం.
ట్రైబల్ ఫ్యాషన్ అంటేనే వైవిధ్యభరితమైన రంగులు, చిత్రాల కలయిక. గిరిజనుల ఎంబ్రాయిడరీ చిత్రమైన కళారూపాలతో నిండిన అత్యంత అందమైన టెక్స్‌టైల్ ఆర్ట్. ఒక్కో గిరిజన తెగకూ ఒక్కో తరహా ఎంబ్రాయిడరీ ఉంటుంది. అలాగే వారి సంస్కృతికీ ప్రత్యేకించిన పనితనం ఉంది. వీటిలో రొమాంటిక్ చిత్రాలు, నృత్య భంగిమలు, నెమళ్ల నృత్యాలు వంటివెన్నో. వన్యప్రాణుల నుంచి స్ఫూర్తి పొందిన పర్షియన్, మొఘలాయి ఆర్ట్స్ ఆధారిత డిజైన్లూ ఈ డిజైన్లలో కనువిందు చేస్తాయి.
అద్దాలు, పూసలు, దారాల మేళవింపుతో రూపొందించిన డిజైన్లు ఇవి. ఎరుపు, పసుపు, నలుపు రంగుల్లో క్లాత్ బ్యాండ్స్, వైట్ క్రిస్‌క్రాస్ స్టిచ్‌తో కలిపి ఈ డిజైన్లను సృష్టించారు డిజైనర్. జామెట్రిక్ ప్యాటర్న్స్, విభిన్నమైన టెక్చర్డ్ ఎఫెక్ట్, క్రాస్ స్టిచ్ మోటిఫ్స్ వాడటంతో బాగా హైలెట్ అయ్యాయి. ఈ డిజైన్లకు చాలా వరకూ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్‌నే ఎంచుకున్నారు. వాటిలో పట్టు, శాటిన్, స్పన్ కాటన్‌లు ప్రధానమైనవి.
పూసలతో చేసిన పనితనం ఇందులో విశేషంగా ఆకట్టుకుంటుంది. లంబాడా ఎంబ్రాయిడరీ ప్రధానంగా ఆకుపచ్చ, తెలుపు, నీలం, నలుపు, ముదురు ఎరుపు, పసుపు... రంగుల్లో సాగుతుంది. ఈ వర్క్ విధానమే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఒక ఫ్రేమ్ మీద ఫ్యాబ్రిక్‌ను స్ట్రెచ్ చేస్తూ... పొడవాటి సూదిని ఉపయోగించి స్టిచ్చింగ్ చేసే ఆరి వర్క్ ఆధునికులు నేర్చుకోవడం అంత సులభం కాదు. ఇక జామెట్రిక్ ఎంబ్రాయిడరీని ఆవిష్కరించే కచ్‌వర్క్ పూర్తిగా ఇంటర్‌లే సింగ్‌తో ఉంటుంది.
తండాల సౌందర్యం...
తెలంగాణలోని లంబాడా తండాలను సందర్శించి, వారి జీవనశైలుల్ని పరిశీలించాను. ఆ వస్త్రశైలులు అద్భుతంగా అనిపించాయి. తమకు లభిస్తున్న ఆదరణ సంపాదనలతో సంబంధం లేకుండా తరాల తరబడి ఇక్కడి మహిళలు నైపుణ్యమైన కుట్టు కళకు ప్రాణం పోస్తూనే ఉన్నారు. అందుకే వీరికి మద్దతుగా వీవర్స్ వెల్ఫేర్ కోసం ఆలయం సొసైటీ ఏర్పాటు చేశాను.
- శ్రవణ్ రామస్వామి,
ఫ్యాషన్ డిజైనర్