సత్యం పలికేవానికి అన్నీ సాధ్యమే
శ్లోకనీతి భాగవత పద్యం-7
మానవేంద్ర! సత్యమతికి దుష్కరమెయ్యదెరుక కలుగు వాని కిష్టమెయ్య దీశ భక్తిరతునికీరాని దెయ్యది యెరుక లేనివానికేది కీడు
వ్యాఖ్యాన భావం... పరీక్షిన్మహారాజా! సత్యం పలికేవానికి అసాధ్యమనేదే ఉండదు. వానికి అన్నీ సాధ్యమే. యుక్తాయుక్త విచక్షణ కలవానికి ‘ఇది ఇష్టము - ఇది అనిష్టము’ అనే భేద భావం ఉండదు. స్థిరబుద్ధితో ఉంటారు. భగవద్భక్తుడు ఈయరానిదంటూ ఏదీ ఉండదు. (సర్వస్వాన్నీ త్యాగం చేస్తాడు). అజ్ఞానికి ‘ఇది మేలు - ఇది కీడు’ అనే జ్ఞానమే ఉండదు కదా! తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తాడు. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనే ఇంగితజ్ఞానం వానికి ఉండదు.
అంటూ వసుదేవుడు సమయస్ఫూర్తిని ఉపయోగించి కంసునితో పలుకుతూ, తన మాటపై నిలిచి కొడుకును అప్పగించాడు. వసుదేవుని స్థిరబుద్ధికి కంసుడు ఎంతో సంబరపడి, ప్రశంసించాడు. ఆపదలు కలిగినప్పుడు ఆ ఆపద నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. స్థిరచిత్తంతో సదాలోచన చేయాలి. వసుదేవుడు ఎంతో చాకచక్యంగా కంసునితో ప్రవర్తించాడు.... అని శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకి బోధించాడు. - డా. పురాణపండ వైజయంతి