
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ఇప్పుడు ‘మీ ఇష్టం వచ్చినంత మంది పిల్లల్ని కనండి’ అనే పాలసీని తీసుకురావడానికి సామాజిక నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. ఏళ్ల పాటు చైనా అనుసరించిన ‘వన్–చైల్డ్’ పాలసీ వల్ల ఆ దేశంలోని అనేక ప్రావిన్స్‌లలో స్త్రీ పురుష జనాభాలో తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తోంది! 130 మంది మగపిల్లలకు 100 మంది ఆడపిల్లలు మాత్రమే ఉంటున్నారు.
ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దడానికి చైనా 2015 అక్టోబర్ నుండి ‘టూ చైల్డ్’ పాలసీని తెచ్చింది. అయినప్పటికీ ఆశించినంతగా పరిస్థితి చక్కబడలేదు. వన్–చైల్డ్ విధానం ఉన్నప్పుడు ఎలాగైతే గర్భస్థ శిశు పరీక్షలతో భ్రూణహత్యలు జరిగేవో ‘టు చైల్డ్’ విధానంలోనూ అలాగే జరుగుతున్నాయి.
అందుకే ‘ఇష్టం వచ్చినంత మంది పిల్లల్ని కనండి’ అనే విధానం కూడా ఫలించబోదని, ఈ వెసులుబాటును ఇష్టం వచ్చినంత మంది మగపిల్లల్ని కనడానికి ఉపయోగించుకోరని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. సామాజిక అసమానతలు పోగొట్టేందుకు ఇంకేవైనా మెరుగైన పాలసీలను అవలంబించాలని సూచిస్తున్నారు.