వాస్తవాన్నే జీవితంగా మలుచుకొని లోకానికి క్రైస్తవాన్ని ఆచరణలో చాటిన ఒక మహా విశ్వాసి ఉదంతం ఈ వారం. గొప్ప మేధావి, పరిశోధకుడు, ఆదర్శప్రాయమైన యూనివర్సిటీ అధ్యాపకుడు, భూగర్భ శాస్త్రజ్ఞుడు, రచయిత, బైబిల్ పండితుడు, తాను విశ్వసించిన క్రైస్తవాన్ని ఆచరిస్తూ అత్యున్నత ప్రమాణాలతో జీవించిన మహా విశ్వాసి ప్రొఫెసర్ బి.యి.విజయం, తన 86వ యేట ఈ జనవరి 30న కన్ను మూశారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో భూగర్భ శాస్త్రం (ఎ్ఛౌ ౌజy)లో పట్టభద్రుడై, ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి, అత్యున్నత పదవులు అలంకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర విభాగానికి అధిపతిగా, జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా సైంటిస్టుగా, మన దేశపు తూర్పు కనుమల్లో అణుధార్మిక శక్తి కలిగిన అత్యంత విలువైన భూగర్భ ఖనిజ నిల్వల్ని కనుగొనడంలో, బీహార్ ధన్బాద్ బొగ్గుగనులకు చెందిన అత్యంత విస్తారమైన నిల్వలను కనుగొనడంలో ఆయన దేశానికి చేసిన సేవ ఆవిరళమైనది. సౌదీ అరేబియా దేశంలో కూడా, ఆ దేశ ప్రభుత్వం ఆహ్వానం మీద అక్కడికెళ్లి చమురు నిల్వలున్న పలు ప్రదేశాలను అప్పట్లో ఆయనే గుర్తించారు. వారి వైజ్ఞానిక సేవల్ని గుర్తిస్తూ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిభా పతకాన్ని ప్రొ.విజయంకు బహూకరించి ఎం.ఎస్.స్వామినాథన్, వర్గీస్ కురియన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ దిగ్గజాల సరసన ఆయన్ను నిలబెట్టింది. రాయలసీమలోని ఒక గ్రామంలో ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి పట్టుదలతో, స్వయంకృషితో, ప్రపంచస్థాయి శాస్త్రజ్ఞుడుగా ఎదిగి, పటిష్టమైన క్రైస్తవ పునాదులున్న మచ్చలేని క్రైస్తవ విశ్వాసిగా జీవించిన ప్రొ.విజయం జీవితం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన మన దేశమే కాదు మొత్తం ప్రపంచం గర్వించదగిన మహా మేధావి, క్రైస్తవం, మానవత్వం పరిమళించిన మహామనిషి. ఒక్కమాటలో ‘తెలుగు క్రైస్తవం’ సగర్వంగా ప్రపంచానికందించిన మణిమాణిక్యమాయన!
ప్రొఫెసర్ విజయం సహాయం పొందిన అసంఖ్యాకుల్లో ఈ రచయిత కూడా ఒకరు. సాక్షిలో క్రైస్తవ వ్యాసాన్ని క్రమం తప్పక చదివి, తన అమూల్యమైన లభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు విజయం. అలా ‘సాక్షి’ ద్వారా మళ్లీ ఏర్పడిన సాన్నిహిత్యంతో తరచుగా కలుసుకొంటున్నపుడు, భూగర్భశాస్త్రంలో ఆయనెంత ప్రవీణుడో, బైబిల్ పరిజ్ఞానంలో కూడా అంతే పట్టుగల్గిన వాడన్నది వెల్లడైంది.. ఈ రచయితతోపాటు ఆయన ఇజ్రాయేల్ దేశాన్ని సందర్శించినప్పుడు ఎంతో విలువైన సమయం గడపడం సాధ్యమైంది. అప్పుడు ఈజిప్ట్‌లో సీనాయి ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా చోట్ల రాళ్లను పరిశీలించి, ‘ఇక్కడ బంగారం నిల్వలున్నాయి’ అన్నారాయన. అదే విషయాన్ని ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక పరిశోధకుల బృందం ఇటీవల ధృవీకరించడం వార్తల్లో తెలుసుకొని ఆయన ప్రతిభకు ఆశ్చర్యపోక తప్పలేదు. రాయలసీమ సిఎస్ ఐడియాసిస్‌కు మొట్టమొదటి భారతీయ బిషప్‌గా నియమించబడ్డ రైట్ రెవ. జాన్ బన్యన్ ఐదుగురు సంతానంలో కనిష్ఠుడాయన. నీతి నియమాలకు కట్టుబడి ఎంతో నిజాయితీగా పరిచర్య చేసిన బిషప్ జాన్ బన్యన్ నుండి క్రమశిక్షణ, భక్తి బాల్యం నుండే ప్రొఫెసర్ విజయంకు అలవడ్డాయి. నిజాయితీపరుడైన బిషప్ కుమారుడుగా విలాసాలకు దూరంగా, అతి సాధారణంగా ఆయన జీవితం సాగింది. పేదరికాన్ని, పేదల నిస్సహాయతను అలా ఆయన చాలా దగ్గరి నుండి చూశారు. అందుకే పేదల్ని, నిరాశ్రయుల్ని, అభాగ్యుల్ని ఆయన హృదయపూర్వకంగా ప్రేమించి ఎన్నో సహాయ కార్యక్రమాలు తన సేవాసంస్థ ద్వారా చేపట్టారు. ‘ఎవరినైనా ఆదుకున్న రోజున భలే నిద్రపడుతుందయ్యా’ అనేవారాయన. నిజ క్రైస్తవానికి ఇంతకు మించిన విశ్లేషణ, నిద్రలేమి అనే భయంకర వ్యాధికి దీన్ని మించిన చికిత్స ఉందా? ఎంతో స్నేహపాత్రుడు, గుండెలో ప్రేమ, కనికరాల ఊటలు ఉన్నాయా అనిపించేంత గొప్పగా స్పందించి సాయం చేసే వితరణ శీలి, సాత్వికుడు, వినయ మనస్కుడు అయిన విజయం లేని లోటు పూడ్చలేనిది. ఆయన విడిచి వెళ్లిన క్రైస్తవ వారసత్వం మాత్రం వెలలేనిది.
–రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
విజ్ఞానగని, విశ్వాసమణి ప్రొఫెసర్ విజయం
Published Sun, Feb 10 2019 2:20 AM | Last Updated on Sun, Feb 10 2019 2:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment