
ఆఫీసులో ఆ రోజెందుకో కొంచెం సీరియస్‌గా ఉంది వాతావరణం. బాయ్ తెచ్చిచ్చిన కాఫీ చప్పరిస్తూ, బాస్ మాటలను అందరం శ్రద్ధగా వింటున్నాం. ఇంతలో మీటింగ్‌కి ముందే పీకనొక్కేసి జేబులోకి తోసేసిన ఫోన్ నుంచి వైబ్రేషన్లు మొదలయ్యాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఏసీ ఛాంబర్‌లో నా ఫోన్ శబ్దాలు అసహనం కలిగిస్తున్నాయందరికీ! అదృష్టవశాత్తూ అదే సమయంలో బాస్‌కి కూడా ఫోన్ రావడంతో అదే అదనుగా మెల్లగా ఫోన్ బయటకు తీసి, కాల్ చేసింది ఎవరా అని చూశా.
అమ్మ... అప్పటికే నాలుగైదు మిస్స్‌డ్ కాల్స్ ఉన్నాయందులో. ఎవరి ఫోన్ అయినా ఇగ్నోర్ చేయొచ్చు కానీ, అమ్మ ఫోన్‌కి రెస్పాండ్ ఇవ్వకపోయానంటే మాత్రం తిప్పలు తప్పవు. గతంలో ఇలాగే నేను ఫోన్ తియ్యకపోయేసరికి ఆమె కంగారుగా మా ఆఫీసులో తనకు తెలిసిన అందరికీ ఫోన్లు చేసేసింది. ఆఖరికి ఆఫీసులో మా బాస్ తర్వాత బాస్ అంతటి వాణ్నీ వదిలిపెట్టలేదు. దాంతో నేను మెల్లగా రీడయల్ చేశా. గభాల్న ఆన్సర్ చేసి, ‘‘ఎక్కడున్నావ్... ఎన్నిసార్లు చేసినా, లిఫ్ట్ చేయకపోతుంటే టెన్షన్ వచ్చింది’’ అంటూ నిష్ఠూరాలు పోయింది.
‘‘ఇక్కడే చచ్చాన్లే... ఇంతకీ ఏంటో చెప్పు’’ అన్నా కొంచెం విసుగ్గా. కొద్ది నిశ్శబ్దం తర్వాత ‘‘ఏం లేదులే... పొద్దుటునించీ వైఫై రావట్లేదు... ఏం తోచక చస్తున్నాననుకో’’ అంది. నాకు ఒళ్లు మండుకొచ్చింది. ‘‘ఇందుకా ఇన్నిసార్లు ఫోన్ చేసింది... ఏమైందో ఏంటో అని భయపడి చచ్చాననుకో’’అంటూ విసుగ్గా ఫోన్ పెట్టేశా. ‘‘నేను కాసేపటిలో వచ్చేస్తాను కానీ, ఈలోగా మీరు అయిడియాలు రాసుంచండి’’ అని చెప్పి హడావిడిగా ఎక్కడికో వెళ్లిపోయారు బాస్. టైమ్ దొరికింది కదా... ఆగుతానా నేను... బయటికి రాగానే తిరిగి అమ్మకి ఫోన్ చేసి, ‘‘ఏంటమ్మా! రోజూ నేనా టైమ్‌లో మీటింగ్‌లో ఉంటానని తెలిసి కూడా అవతలేదో సీరియస్ మ్యాటరున్నట్లు అన్నిసార్లు ఫోన్ చేశావ్. భయమేసింది’’ అన్నాను.
‘‘నాకు ఇంక కాలక్షేపం ఏముంది... ఆ ఫోన్ చూసుకోవడం తప్ప. అదీ పాపం... ఆ పిచ్చోడు కొనివ్వబట్టి కానీ, నాతో మాట్లాడేదెవరు, నా మొహం చూసేవారెవరు... పొద్దుగూకులూ ఆ గదిలో ఒక్కదాన్నే పడుండటం తప్ప. మీ ఆవిడగానీ, నీ సంతానం గానీ నాతో మాట్లాడతారా ఏమన్నానా? ఇవ్వాళ్ల కూడా నువ్వటెళ్లగానే మీ ఆవిడ కూడా పిల్లల్ని తీసుకుని బయల్దేరింది ‘అక్కా వాళ్ల ఇంటికి వెళ్ళొస్తా’ నంటూ... అసలు పొరపాటు చేశాలే. నువ్వు నాకు ఆ జియో సిమ్ ఇస్తానన్నప్పుడు తీసుకోనుంటే బాగుండేది.. కరెంట్ పోగానే నెట్టు ఆగిపోకుండా ఉండేది’’ అమ్మ వాక్‌ప్రవాహం ఆగడం లేదు. నిజమే కదా అనిపించి నాకు జాలేసింది. ‘‘సర్లే... ఆ సీపీయూ పక్కనే నల్లటి డబ్బాలాంటిది ఉంటుంది కదా... దానికి రెండు స్విచ్చులుంటాయి.. అవి ఆన్లో ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండాలెప్పుడూ...’’ అంటూ డైరెక్షన్లిచ్చి తిరిగి నా పనిలో మునిగిపోయా.
అసలు మా ఇంట్లో కరెంట్ పోయినా,నెట్ రాకపోయినా ముందుగా ఇబ్బంది పడేది అమ్మ, ఆ తర్వాత మూడున్నరేళ్ల మా చిన్నదీ. పొద్దుగూకులూ ఫోన్‌తోనే దాని ఆటలన్నీ. పెద్దదానికేమో సిస్టమ్ ఆపరేట్ చెయ్యడం వచ్చు. యూట్యూబ్ పెట్టుకుని గేమ్సూ అవీ చూసేస్తుంటుంది. మా ఆవిడకేమో పని ధ్యాస, ఇల్లు సర్దుడూ తప్ప ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. పాపం! అమ్మకేమో మొదటినుంచీ నలుగురిలో ఉండటం, కబుర్లు చెప్పడం అలవాటు కాబట్టి మాటల కోసం మొహం వాచిపోయి ఉంటుంది. నేను కాస్త ఖాళీగా కనిపిస్తే చాలు... పక్కన కూచుని కబుర్లు చెబుతుంటుంది. నాక్కూడా ఈ మధ్య ఆమెతో గడిపేందుకు సరిగా తీరిక దొరకడం లేదు. దాంతో ఆమెకి ఫోనే ప్రపంచంగా మారిపోయింది.
పాపం! నిజానికి ఈ వాట్సప్పులూ, ఫేస్బుక్కులూ మొన్నటి దాకా ఆమెకూ తెలీదు. ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుల మూలంగా తనూ ‘స్మార్ట్’అయిపోయింది. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం అమ్మతో కలిసి చదువుకున్న స్కూల్‌మేటొకాయన ఫేస్‌బుక్‌లో నా ఫొటోతోబాటూ ఉన్న అమ్మ ఫొటోలు చూసి గుర్తుపట్టి నా ద్వారా అమ్మను కాంటాక్ట్ చేశాడు. తర్వాత ఆమెను బతిమాలీ బామాలీ అందరూ కలిసి ఆమెను పూర్వవిద్యార్థి సమ్మేళనానికి తీసుకెళ్లారు. వాళ్లలో ప్రభుత్వంలో పెద్ద ఆఫీసర్‌గా పని చేసి రిటైరైన ఒకాయన వద్దు వద్దంటున్నా వినకుండా ఆమెకు ఒక స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోన్‌లో వాట్సప్పూ, ఫేస్బుక్కూ ఇన్‌స్టాల్ చేసి, వాటిని ఆపరేట్ చేయడం ఎలాగో నేర్పించాడు... స్వతహాగా తెలివిగల మా అమ్మ అన్నిటినీ ఠకాఠకా నేర్చేసుకుని, తన పాత నొక్కుడు ఫోన్ పక్కన పడేసి,స్మార్ట్ మదర్ అయిపోయింది. తొందరలోనే తను మా అందరికన్నా బిజీ అయిపోయింది ఫేస్‌బుక్కూ, వాట్సప్పులలో.
వాటి పుణ్యమా అని ఇప్పుడు నాకు ఫోన్ చేయడం, మా పెద్దదానితో ‘తిండి తినకపోతే చిక్కిపోతావ్, అది తినూ, ఇది తినూ అని సతాయించడం... పొద్దుగూకులూ ఆ సిస్టమ్ చూడ్డమేనా, హోమ్ వర్క్ చేసుకునేదేమైనా ఉందా’’ అంటూ గొడవ పడటం మానేసింది. పైపెచ్చు మా చిన్నదెప్పుడైనా ఏడుస్తుంటే పిలిచి, దగ్గర కూచోబెట్టుకుని తన ఫోన్‌లోని వీడియోలూ, ఫొటోలూ చూపిస్తూ, మాక్కొంచెం ఊరట కనిపించింది. ఇదేదో బాగానే ఉందిలే అనుకున్నాం నేనూ అక్కా వాళ్లూ. నేను మా ఆఫీసులోని వాళ్లకీ, తెలిసిన వాళ్లకీ కూడా ‘‘మా అమ్మ వాట్సప్పు వాడుతుంది తెలుసా’’ అని గర్వంగా చెప్పుకోవడం మొదలు పెట్టాను.
అయితే, త్వరలోనే మాకు ‘స్మార్ట్’ సమస్యలూ మొదలయ్యాయి. ఫోన్‌లో తెలుగు కీ బోర్డ్ పెట్టుకుని నాకూ, మా అక్కా వాళ్లకూ, పిన్నీ వాళ్లకీ, తనకు ఆ ఫోన్ కొనిచ్చినాయనకీ ఎడాపెడా మెసేజీలు చేయడం... ఏదో హడావుడిలో ఉండి రిప్లై ఇవ్వకపోతే ‘‘చూసి కూడా రిప్లై ఇవ్వలేదే’’ అని నిష్ఠూరాలు పోవడం మొదలు పెట్టింది. ఫేస్‌బుక్‌లోనేమో తను వయసులో ఉన్నప్పటి ఫొటోని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది. దాంతో ఆమె యంగ్ అనుకుని కొందరు ఆకతాయిలు ‘‘హాయ్... యూ ఆర్ సో స్వీట్’’అంటూ మెసేజీలు, చాటింగ్‌లు చేయడం మొదలు పెట్టారు.
అవి మా దగ్గరకు తీసుకొచ్చి చూపించి నవ్వుకోవడం, కొంచెం వికటిస్తే తనలో తనే భయపడ్డం... గ్యాలరీలో ఫొటోలు చూసుకుంటుంటే పొరపాటుగా ఎవరికో వెళ్లాయి, వాటిని డిలీట్ చేయడం ఎలా అని కంగారు పడటం... పక్కరూమ్‌లో ఉన్న నాకు కూడా ‘‘ఏంటీ అట్లా ఉన్నావ్... ఆఫీస్‌లో ఎవరన్నా ఏమైనా అన్నారా... లేకపోతే మీ ఆవిడేమైనా పుట్టింటికెళ్తానంటోందా’’ అని వాట్సప్ చేయడం... లేదంటే ‘ఒకసారిటొచ్చిపో’ అని మెసేజీలివ్వడం... గ్యాలరీలో ఎప్పటినుంచో ఉన్న ఫొటోలు పొరపాటుగా డిలీటయిపోయాయి. ఎలా వస్తాయి అని అడగడం... ఫోన్ మెమరీ ఫుల్లయిపోయిందనీ, నెట్టు రావడం లేదనీ, వైఫై ఆన్ చేయడం మర్చిపోయి, డేటా ఆన్ చేసేసరికి బ్యాలన్సంతా అయిపోయిందని బాధపడటం... ఇలాగన్నమాట.
అసలు అంతకుముందు సన్‌డే సప్లిమెంట్లలో తెలుగు పదకేళీలు పూర్తిచేయడమంటే అమ్మకు ఇష్టమని ఆమెకోసం ఆదివారం నాడు నాలుగైదు పేపర్లు వేయించేవాణ్ణి... ఇప్పుడు వైఫై పెట్టించాల్సొచ్చింది!! మొన్నామధ్య రోడ్డు బాగు చేస్తుండే సరికి కేబుల్ వైర్లు తెగిపోయి, రెండు మూడురోజులపాటు నెట్ సరిగా పని చేయలేదు. కరెంట్ కూడా వస్తూ పోతూ ఉంది. దాంతో చేసేదేం లేక ఎప్పటెప్పటివో సన్‌డే సప్లిమెంట్లు ముందేసుకుని కూచుని పజిల్స్ పూర్తి చేస్తూ... మధ్యమధ్యలో తెలియని పదాల కోసం ఫోన్లు చేసి మాట్లాడుతూ కనిపించింది. అయితే ఆ సంబరం ఎన్నాళ్లుంటుంది... కేబుల్ వైర్లు కలవకుండా ఉంటాయా? కరెంటు రాకుండా ఉంటుందా? సిస్టమ్ పని చేయకుండా ఉంటుందా? అదిగో... మళ్లీ పోన్ రింగవుతోంది. అమ్మే చేస్తోంది.. బహుశా మళ్లీ వైఫై పని చేయడం లేదేమో!
అప్‌డేట్ అవ్వండే!
ఒక్కసారి.. పైన ఫొటోలో ఉన్న బామ్మగారిని చూడండి. ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఈ వయసులో ఇంకెవరితో మాట్లాడతారు? మనవరాళ్లు, మనవళ్ల గురించి కొడుకు, కూతురితో డిస్కస్ చేస్తున్నారని తప్పులో కాలేయకండి. ఇంటర్‌నెట్ స్పీడ్ పెంచమని కంప్లైట్ చేస్తున్నారామె. మాములు బామ్మ కాదండీ బాబు. అప్‌డేటేడ్ బామ్మగారు.
అంతేనా.. ఆమెని ఎవరైనా బామ్మ అంటే ఊరుకోరు. ‘కాల్ మీ బేబీ. బేబీ షామిలి’ అంటారు. ఇప్పుడు అర్థమైందిగా ఎంత అప్‌డేటెడ్ బామ్మగారో. ‘అప్ డేట్ అవ్వండే. గంటల తరబడి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం కాదు... మిమ్మల్ని పదిమందీ చూసేలా తయారవ్వండి’ అని మనుమరాళ్లను ఊదరగొడుతుంటుంది. మోడరన్ బామ్మగా రోహిణీహట్టంగడి నటించిన ఈ సీన్ ఏన్టీఆర్, సమంత నటించిన ‘రామయ్యా.. వస్తావయ్యా’ సినిమాలోనిది.
– డి.వి.ఆర్.భాస్కర్