సిగ్గు, బిడియంతో....
యూరాలజీ కౌన్సెలింగ్
నా వయస్సు 51 సంవత్సరాలు. నాకు ముగ్గురు పిల్లలు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు మూత్ర విసర్జనపై నియంత్రణ లేకుండా పోతోంది. బంధువుల ఇంటికి, లేదా సినిమాలకి వెళ్లినపుడు నాకు తెలియకుండానే చుక్కలు చుక్కలుగా మూత్రం వచ్చేసి, సీట్లు తడిసిపోయి, పరువు పోతున్నట్టు అనిపిస్తోంది. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం పడడం, బయటికి వెళ్లాలంటేనే భయమేసే స్థాయిలో నన్ను ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఆఫీసులో అన్నిసార్లు బాత్రూంకి వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు.
- ఒక సోదరి, కరీంనగర్
మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్’ అనే సమస్యతో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది. అంటే... మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవడం. పురుషుల కంటే స్త్రీలలో ఈ సమస్య కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కొంతమందిలో కాన్పులు కష్టమైన వారికి, స్థూలకాయంతో గానీ, హార్మోన్స్ సమస్యలు లేదా ప్రోస్టేట్‌తో బాధపడుతున్న వారికి, మరికొంతమందిలో మెనోపాజ్ (ఋతుక్రమం) ఆగిపోయిన తర్వాత తలెత్తుతుంది.
అలాగే మూత్రాశయానికి సంబంధించిన నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా వస్తుంది. ఇలాంటి కారణాలతో దాదాపు చాలామంది స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ అందులో పదిశాతం మంది కూడా వైద్యులను సంప్రదించడానికి ముందుకు రావడం లేదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. మీకున్నట్టుగానే చాలామంది సిగ్గుపడుతుండడం వల్ల ఆ బాధను తమలోనే నొక్కిపెట్టుకుంటుంటారు. సమస్య తీవ్రమైనప్పుడు ఇలా బయటికి చెప్పుకుంటారు.
ఇది ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు. మీరు అధిక పని ఒత్తిడికి లోనై ఉండడం వలన ఈ సమస్య ఉత్పన్నమై ఉండవచ్చు. లేదా యూరినరీ బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ చోటుచేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య మిమ్మల్ని బాధపెడుతుండవచ్చు. ఇది అంత పెద్ద సమస్య కాకపోయినప్పటికీ ఇటు మానసికంగానూ అటు శారీరకంగానే కాకుండా సామాజికంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ముందుగా మీరు యూరాలజిస్ట్‌ని కలవండి. ఆయన మీకు కొన్ని పరీక్షలు నిర్వహించి మీ సమస్యకు అసలు కారణాన్ని గుర్తిస్తారు.
అలాగే మంచి చికిత్సను అందించే అవకాశం ఉంది. వైద్యుడి సలహాలు కచ్చితంగా పాటించండి. రెండు రోజుల్లో ఉపశమనం లభించిందని మందులు మానేయకండి. కోర్స్ పూర్తి చేయండి. లేదంటే మళ్లీ సమస్య తిరగబడే అవకాశముంది. ఒక్కోసారి పెల్విస్‌కు ముప్పు ఏర్పడి, దాని చుట్టూ ఉండే అనుబంధ కండరాలకు మూత్రం వల్ల ఏర్పడిన తడితో చర్మ సంబంధిత అలెర్జీలు కూడా వస్తాయి. సమస్య తీవ్రత పెరిగి సర్జరీ వరకు దారితీయవచ్చు. కాబట్టి వెంటనే మీరు మీ బిడియాన్ని పక్కనపెట్టి మంచి ట్రీట్‌మెంట్ తీసుకోండి. ఎంతమాత్రం ఉపేక్షించవద్దు. దీనికి చక్కటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది.