అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్
ఆ నేడు 4 నవంబర్, 1980
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన రొనాల్డ్ రీగన్ ఘనవిజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జిమ్మీ కార్టర్‌పై ఆయన భారీ మెజారిటీ సాధించారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికన్ ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలవడం సాధారణమే అయినా, 1980 నాటి అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం ఒక విశేషం ఉంది.
సినీనటులు ఎన్నికల్లో ఘన విజయాలు సాధించడం ఆ కాలానికి భారత్‌కు కొత్త కాదు గానీ, అమెరికాకు మాత్రం కొత్తే. హాలీవుడ్‌లో పేరుప్రఖ్యాతులు గల నటుడైన రొనాల్డ్ రీగన్‌ను రిపబ్లికన్ పార్టీ తన అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దించడమే విశేషంగా వార్తల్లోకెక్కితే, అమెరికన్ ఓటర్లు కూడా ఆయనకు పట్టం కట్టి, రాజకీయ రంగంపై వెండితెర ప్రభావం తక్కువేమీ కాదని నిరూపించారు.