నవంబర్‌ 3కు రెండు రోజుల ముందే వ్యాక్సిన్‌! | US 2020 Election: October Surprise More Surprising This Time | Sakshi
Sakshi News home page

నిజంగా అమెరికాలో ఆ పరిస్థితి ఉందా?

Published Tue, Sep 15 2020 7:40 PM | Last Updated on Tue, Sep 15 2020 8:58 PM

US 2020 Election: October Surprise More Surprising This Time - Sakshi

వాషింగ్టన్‌: అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌.. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోట వినబడుతున్న మాట. అక్టోబర్‌లో అమెరికన్లకు కరోనాకు వ్యాక్సిన్‌ ఇస్తాడన్నది దీని అర్థం. ఈ ఒక్క వాక్సినే తనను రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెడుతుందన్నది ట్రంప్‌ ఆశ. మరి నిజంగా అమెరికాలో ఆ పరిస్థితి ఉందా? కరోనా అమెరికాను ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎంత దెబ్బ తీసింది? ప్రజలు ట్రంప్‌ తీసుకున్న చర్యలను హర్షిస్తారా? లేక బుద్ధి చెబుతారా? కరోనా చుట్టు తిరుగుతున్న అమెరికా ఎన్నికలు చివరికి ఎలాంటి ముగింపు పలుకుతాయి? అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌గా మిగులుతుందా? లేక ట్రాజెడీగా మారుతుందా?

అమెరికా ఎన్నికలపై కరోనా బలంగా ప్రభావం చూపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అమెరికాలో ఉగ్రవాదం కంటే కరోనానే ఎక్కువ ప్రమాదమన్న భావన వచ్చింది. దాదాపు 70లక్షల కరోనా కేసులు, 2 లక్షల మరణాలతో అమెరికా అతలాకుతలమయింది. ముఖ్యంగా ఈస్ట్‌ కోస్ట్‌ను అయితే కరోనా భారీగా దెబ్బతీసింది. కరోనాను అరికట్టడంలో ట్రంప్‌ సర్కారుపై చాలా మంది అమెరికన్లకు పీకల్దాక కోపముంది. ముఖ్యంగా ఈస్ట్‌ కోస్ట్‌లో న్యూయార్క్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేసింది. దాదాపు ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా ప్రభావం చూపింది. ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా సగటు అమెరికన్‌ను వణికించింది కరోనానే. అందుకే ఉగ్రవాదం కంటే పెద్ద ప్రమాదకారిగా కరోనాను చిత్రీకరించారు అమెరికన్లు. యూరోపియన్‌ దేశాల్లో కరోనాను కట్టడి చేసినట్టుగా అమెరికాలో ట్రంప్‌ వైరస్‌ను నియంత్రించలేకపోయారన్న విమర్శలున్నాయి.

నవంబర్‌ 3న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దానికి రెండు రోజుల ముందుగానే వాక్సిన్‌ ఇస్తామన్న ధీమాలో ట్రంప్‌ ఉన్నారు. ఇప్పటికే వాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. దీని ద్వారా కరోనా భయం లేకుండా చేశానని ట్రంప్‌ చెప్పుకోవచ్చు. ప్రజల్లో నమ్మకం నింపే ఈ వాక్సిన్‌ ప్రయత్నంలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి.

ట్రంప్‌ క్యాంపెయిన్‌లో కీలక అస్త్రంగా భావిస్తున్న అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌ వికటించవచ్చన్నది నిపుణుల అంచనా. హడావిడిగా అక్టోబర్‌లోనే అమెరికన్లకు కరోనా వాక్సిన్‌ ఇవ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంతో ఆటలాడడం సరికాదని, అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌ కాస్తా... అక్టోబర్‌ ట్రాజెడీగా మారే ప్రమాదముందంటున్నారు నిపుణులు. ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలు అసలుకే మోసం తేవచ్చని, పరిశోధనలు పూర్తి కాకుండా ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదముందంటున్నారు. (చదవండి: నవంబర్‌ నాటికి చైనా వ్యాక్సిన్‌)

ఈసారి కరోనా ప్రభావం పోలింగ్‌పైనా ఉండొచ్చంటున్నారు. కరోనా కారణంగా అబ్సెంటీ బ్యాలెట్‌లు సకాలంలో చేరుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేకపోయిన వారు అబ్సెంటీ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా కారణంగా ఫ్లోరిడా రాష్ట్రంలో అబ్సెంటీ బ్యాలెట్‌ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఈ ఎన్నికల్లో ఫ్లోరిడా ఫలితాలు రావడానికి రాత్రి 10 గంటలు దాటొచ్చని భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇదే ఫ్లోరిడా కారణంగా అధ్యక్ష ఫలితాలు ఏకంగా నెల ఆలస్యమయ్యాయి. పోటాపోటీగా సాగిన రీకౌంటింగ్‌లో అప్పట్లో జార్జ్‌ బుష్‌ కేవలం 537 ఓట్లతో ఆల్‌గోరెను వెనక్కి నెట్టాడు. ఈ సారి కూడా అదే పరిస్థితి కరోనా కారణంగా అబ్సెంటీ బ్యాలెట్‌తో రావచ్చంటున్నారు. (చదవండి: 1,000 రెట్లు ఎక్కువ ప్రతీకారం తీర్చుకుంటాం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement