
పురుష ప్రపంచంలో వనితా నాదం
తెలుగునాట దర్శకత్వ శాఖలో కనిపించే యువతులు చాలా తక్కువ. నందినీ రెడ్డి లాంటి ఒకరిద్దరు దర్శకులుగా ఎదిగినా, అవకాశం కోసం చూస్తూ, సహాయ, సహకార దర్శకులుగా అలుపెరుగని కృషి చేస్తున్నవాళ్ళే ఎక్కువ. పుష్కరకాలం పైగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ప్రియదర్శినీ కృష్ణ ఈ పరిణామానికీ, పరిస్థితికీ ప్రత్యక్షసాక్షి. పైగా, ఇటీవలే ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ ఎన్నికలలో కార్యవర్గ సభ్యురాలిగా పోటీ చేసి, ఏకంగా 830 ఓట్లలో 590 ఓట్లు సంపాదించి, గెలిచారు.
‘‘దర్శకత్వంలో సహాయకులుగా పనిచేసే వారికి జీతభత్యాల దగ్గర నుంచి చాలా సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలనుకుంటున్నా’’ అని దృఢంగా చెప్పారు ప్రియదర్శిని. జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టి, పత్రిక, ఇంటర్నెట్, టీవీ వార్తా రంగాలు మూడింటిలోనూ పనిచేసిన ఈ ఎం.ఏ, ఎం.ఫిల్ - గోల్డ్ మెడలిస్ట్ ‘‘చిన్నప్పటి నుంచి సినిమాలు తెగ చూసే’’వారు. ‘‘రచన మీద ఆసక్తి, ఎంచుకున్న రంగంలో అందరికీ సారథిగా నిలవాలన్న కోరికతో సృజనాత్మకతకు పదునుపెట్టే దర్శకత్వశాఖలోకి వచ్చా’’రు.
జర్నలిస్టుగా రాజకీయ వార్తాసేకరణలో అతికొద్దిమంది మహిళల మధ్య ఒకరుగా పనిచేశారు. పుష్కరకాలంగా దర్శకత్వశాఖలో ఉండి, ఇరవయ్యేళ్ళ స్థిరనివాసంతో పక్కా హైదరాబాదీ అయిపోయినా, తన మూలాలను మర్చిపోని ఈ విశాఖపట్నం అమ్మాయి సినీ దర్శకత్వ శాఖలో స్త్రీలకుండే ఇబ్బందులు తక్కువేమీ కాదంటారు. ‘‘జూదంలా మారిన సినీ వ్యాపారంలో, ఎవరైనా హీరో కానీ, చిత్ర నిర్మాణ సంస్థ - స్టూడియో కానీ చేతిలో లేనప్పుడు మహిళా దర్శకులుగా అవకాశాలు రావడం, వచ్చినా నిలబడడం కొద్దిగా కష్టమే’’న ంటారు.
లింగ వివక్ష, లైంగిక వేధింపుల గురించి ప్రశ్నిస్తే, ‘‘అసలు లేదని చెప్పలేను కానీ, జర్నలిజమ్ నుంచి రావడం వల్లనో ఏమో నాకలాంటి అనుభవాలు ఎదురుకాలేద’’ని తేల్చేశారు. ‘‘ఇక్కడ మనం గాజులా ఉంటే ప్రతి ఒక్కరూ రాయి విసురుతారు. మనమే రాయిలా దృఢంగా ఉంటే పురుషాధిక్య భావజాలమున్నవాళ్ళూ మనతో మర్యాదగానే ఉంటారు’’ అని సినీ జీవిత సూక్ష్మం చెప్పారు ప్రియదర్శిని.
ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ లాంటి పనులతో పోలిస్తే, కుటుంబ బాధ్యతల రీత్యా దర్శకత్వ శాఖలో పని ఆడవారికి కొద్దిగా కష్టమే. ‘‘అండగా నిలిచే తల్లితండ్రులు, అర్థం చేసుకొనే భర్త (టీవీ మీడియా ప్రముఖుడు వెంకట కృష్ణ) లభించడం నా అదృష్టం’’ అంటారు మూడేళ్ళ క్రితం ఓ పాపకు జన్మనిచ్చిన ప్రియదర్శిని. వివిధ టీవీ చానళ్ళకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేసిన ఈ నవతరం మహిళ ‘‘ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏదీ నేర్పరు. మనమే అన్నీ గమనిస్తూ, మన సృజనాత్మకతను జోడిస్తూ ముందుకు సాగాలి’’ అంటారు. ఆ అనుభవం, అవగాహన మహిళలకే కాదు, ఏ అసిస్టెంట్ డెరైక్టర్‌కైనా అవసరమే.
- రెంటాల జయదేవ